గత 4ఏళ్లలో ప్రజలపై రూ 2.30లక్షల కోట్ల పన్నుభారాలు..
డిబిటి ద్వారా ఇచ్చింది గోరంత.. పెంచిన పన్నులతో గుంజేసింది కొండంత.
గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలపై రూ 2.30లక్షల కోట్ల పన్నుల భారం వేశారు. ఒక్కో కుటుంబంపై రూ 1,52,413 పన్నుల భారం మోపారంటే ఇక ఏ స్థాయిలో ‘‘బాదుడే బాదుడు’’ ఉందో తెలుస్తోంది.. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఇదే బ్యానర్ (బాదుడే బాదుడు)పై పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది..
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్(డిబిటి) ద్వారా ఈ 4ఏళ్లలో పేదల ఖాతాల్లో రూ 2లక్షల 10వేల కోట్లు జమచేశామని బైటకు చెబుతూ, ప్రజలపై పన్నులు విచ్చలవిడిగా పెంచేసి అంతకన్నా మరో రూ 20వేల కోట్లు అధికంగా వెనక్కి గుంజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే.. ఎడమచేత్తో ఇచ్చినట్లే ఇచ్చి కుడిచేత్తో లాగేసుకున్నారు.. బూటకపు సంక్షేమాలతో జగన్నాటకాలకు ఏపినే వేదిక..
కరెంటు బిల్లులు, ఆర్టీసి ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ రేట్లు, నిత్యావసరాల ధరలు, నాసిరకం మద్యం, ఇసుక, సిమెంట్, స్టీల్ రేట్లు, ఆస్తిపన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులు, చెత్తపన్ను, యూజర్ ఛార్జీలు ఒకటేమిటి అనేకరకాల పన్నుపోటుతో, ధరల వాతలతో జనం అల్లాడుతున్నారు.
గత 4ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు 8సార్లు పెంచి రూ 20వేల కోట్ల భారం మోపారు, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ అప్పులు, కరెంటు ఉత్పత్తి చేయకుండానే హిందుజాకు చెల్లింపులు అన్నీ కలిపితే ఒక్క విద్యుత్ భారాలే రూ 60వేల కోట్ల పైబడి..నాలుగేళ్ల క్రితంతో పోల్చితే ప్రతి ఇంటికి వచ్చే కరెంటు బిల్లు 3రెట్లు అయ్యింది. ట్రూ అప్ ఛార్జీల పేరుతో రూ 4వేల కోట్లు, శ్లాబులు కుదించి మరో రూ 4వేల కోట్లు వసూళ్లు చేశారు. ఆక్వా రైతులకు యూనిట్ రూపాయిన్నరకే ఇస్తామని హామీనిచ్చి రూ 6 వసూళ్లకు తెగించారు.
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెంచేసి రూ లక్ష కోట్ల భారం వేశారు, అందులో రూ 42వేల కోట్లు వైసిపి నాయకుల లూటీనే. నగదు ఇస్తేనే మద్యం అమ్మే ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే, అందులోనే పెద్ద స్కామ్ ఉందనేది నగ్నసత్యం.. దేశంలో ఎక్కడా కనిపించని సొంత బ్రాండ్లతో నాసిరకం మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలతో ఏపిలో వైసిపి లిక్కర్ మాఫియా అరాచకాలు అన్నీఇన్నీ కావు. స్పెషల్ స్టేటస్, త్రీ కేపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బూమ్ వంటి బ్రాండ్లతో పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
భారతీ సిమెంట్ లాభాల కోసం అన్ని సిమెంట్ కంపెనీలను సిండికేట్ చేసి ధరలు పెంచేసి రూ 12వేల కోట్ల భారం వేశారు. బస్తాకు రూ 60పెంచేసి మోయలేని భారం మోపారు. పేదల పక్కాఇళ్లకు, ప్రాజెక్టుల పనులకు, రోడ్ల నిర్మాణానికి భారతీ సిమెంట్ నే వాడాలని ఒత్తిడిచేయడం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆరాటమే..అటు సిమెంట్, ఇటు స్టీల్ ధరలు పెంచేసి, ఇసుక కృత్రిమ కొరత సృష్టించి రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని చావుదెబ్బ తీశారు..
టిడిపి హయాంలో ఉచిత ఇసుక పథకాన్ని రద్దుచేసి బినామీ కంపెనీకి ఇసుక రీచ్ ల కాంట్రాక్టులిచ్చి స్థానికంగా ఇసుక కృత్రిమ కొరత సృష్టించి, విపరీతంగా రేట్లు పెంచేశారు. లారీ లోడ్ ఇసుక గతంలో రూ 4వేలుకాగా, ఇప్పుడు రూ 50వేలకు కూడా లభ్యమయ్యే పరిస్థితి లేకుండా చేశారు, కనస్ట్రక్షన్ రంగాన్ని కుదేలయ్యేలా చేశారు. ఫలితంగా లక్షలాది భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులు పనులు కోల్పోయి రోడ్ల పాలయ్యారు. రాయలసీమ నుంచి చెన్నై, బెంగళూరులకు, ఉత్తరాంధ్ర నుంచి ఒడిశాకు, కోస్తా జిల్లాలనుంచి తెలంగాణకు పెద్దఎత్తున ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులకు గేట్లెత్తేశారు, వెళ్లేటప్పుడు ఇసుక, వచ్చేటప్పుడు మద్యం అక్రమ రవాణా రోజువారీ మామూలైంది. ఏడాదికి రూ 3వేల కోట్ల చొప్పున 4ఏళ్లలో రూ 12వేల కోట్ల ఇసుక దోపిడీకి వైసిపి శాండ్ మాఫియా పాల్పడిందని మీడియా ప్రచారంకాగా వాస్తవంగా చూస్తే అంతకు రెట్టింపే ఉంటుంది.
గ్రామాల్లో, పట్టణాల్లో ఆస్తిపన్ను రెట్టింపు చేశారు, ప్రజలపై రూ 8వేల కోట్ల భారం వేశారు. భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు 6సార్లు పెంచారు..ప్రతిఏటా రిజిస్ట్రేషన్ శాఖ వరుసబాదుడే…. తాజాగా వాణిజ్య సముదాయాల పేరుతో కొత్త కేటగిరీని పెట్టారు. జూన్ 1నుంచి కొత్త విలువలు అమల్లోకి రానున్నాయి. 1000అడుగుల ప్లాట్ కు గతంలో కంటే రూ 15వేలు ఎక్కువ చెల్లించాల్సి ఉంది. గుడిసెలకూ చ.అడుగుకు రూ 10పెంచడం గమనార్హం..చెత్తపన్ను పేరుతో రూ 750కోట్లు వసూళ్లు చేశారు. రకరకాల యూజర్ ఛార్జీల పేరుతో మరో రూ 2400కోట్ల భారం వేశారు.
మున్నెన్నడూ లేనివిధంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు, రూ 2వేల కోట్ల భారం మోపారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి రూ 2వేల కోట్ల భారం వేశారు. రూ 200 ఉన్న గ్రీన్ టాక్స్(హరిత పన్ను)ను రూ 20వేలు చేశారు. లారీలపై గతంలో రూ 1000ఉన్న ఓవర్ హైట్ కేసుల జరిమానాను ఇప్పుడు రూ 20వేలు చేశారు.. అటు పన్నుపోటు, ఇటు జరిమానాల వేటుతో రెండిందాలా దోపిడీకి తెగబడ్డారు..పెట్రోల్ పై వ్యాట్ 31.50%నుంచి 35.20%కు పెంచారు. డీజిల్ పై వ్యాట్ 22.25% నుండి 27%కి పెంచేశారు. డెవలప్ మెంట్ సెస్ ముసుగులో రూ 4, రోడ్ సెస్ పేరుతో రూపాయి వసూలు చేస్తున్నారు. డెవలప్ మెంటే లేని రాష్ట్రంలో డెవలప్ మెంట్ సెస్ వసూలు చేయడమేంటి..? రోడ్లపై గుంతలు పూడ్చనప్పుడు రోడ్ సెస్ ఎందుకు కట్టాలని ప్రజలే ప్రశ్నిస్తున్నారు..గత 4ఏళ్లలో రోడ్ సెస్ పేరుతో వసూలుచేసిన రూ 2400కోట్లతో ఏం చేశారని నిలదీస్తున్నారు..గుంతలన్నా పూడ్చండి లేదా పెట్రోల్ డీజిల్ పై రోడ్ సెస్, డెవలప్ మెంట్ సెస్ ఎత్తేయండని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకుని అదేతరహాలో రాష్ట్రప్రభుత్వ వ్యాట్ కూడా తగ్గించాలన్న సూచనను ఇతర రాష్ట్రాలు పాటించి తగ్గించినా ఏపిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెడచెవిన పెట్టి ప్రజలను వంచించారు.
పెరిగిన పన్నుల భారాలు, ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజల జనజీవన ప్రమాణాలు పడిపోయాయి..కరోనా సృష్టించిన కల్లోలం నుంచి తేరుకోని ప్రజానీకంపై ఏమాత్రం ప్రభుత్వపరంగా చేయూత లేకుండా ఈవిధమైన పన్నుపోటు, ఛార్జీల భారం మోపడం గోరుచుట్టు మీద రోకటిపోటే..ఇప్పటికే సంపద చక్రం ధ్వంసమై, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి, పొదుపు శక్తి క్షీణించి వ్యక్తుల నిజ ఆదాయాలు మున్నెన్నడూ లేనిరీతిలో పతనం అయ్యాయి. ఒకవైపు నిరుద్యోగం పెరిగిపోయింది, మరోవైపు లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు, ఇంకోవైపు కుటుంబాన్ని ఎలా గడపాలో తెలీక దిక్కుతోచని స్థితిలో ప్రజానీకం అల్లాడుతోంది..
ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి బాదుడే బాదుడంటూ దీర్ఘాలు తీస్తూ చేసిన ప్రసంగాలకు తామెంత మోసపోయామో తల్చుకుని ఆవేదన చెందుతున్నారు. మాటల్లో తేనె-చేతల్లో విషమంటూ మండిపడుతున్నారు. జగన్ హితమే తప్ప జనహితం అనేది అతని డిక్షనరీలోనే లేదనేది రూఢీ అయ్యేటప్పటికే జరగాల్సిన డేమేజి జరిగిపోయింది.. ఎప్పుడెప్పుడీ గుదిబండను వదుల్చుకోవాలా అని ఎదురెదురు చూస్తున్నారు.