తమిళ యాక్షన్ డైనమైట్ .. ధనుష్ లేటెస్ట్ గా ‘కర్ణన్’ అనే మూవీతో వచ్చాడు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకుంది. ఏప్రిల్9న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఒక గ్రామాన్ని కాపాడే సంఘ సంస్కర్తగా ధనుష్ నటన అనితర సాధ్యమని చెప్పుకుంటున్నారు. ‘ఆడుకళాం, అసురన్’ సినిమాలతో నేషనల్ అవార్డు అందుకున్న ధనుష్ .. ‘కర్ణన్’ మూవీలోని నటనకు కూడా నేషనల్ అవార్డు అందుకోవం గ్యారెంటీ అంటున్నారు.
అలాంటి ఈ అద్భుతమైన సినిమా రీమేక్ రైట్స్ ను ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్ తీసుకున్నారట. తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ సంక్రాంతికి ‘అల్లుడు అదుర్స్’ సినిమా రిజల్ట్ తో నిరాశ చెందిన బెల్లంకొండ.. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘ఛత్రపతి’ రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం కేస్టింగ్ సెలెక్షన్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ అక్కడ జరుగుతుండగానే.. తెలుగులో కర్ణన్ రీమేక్ మూవీని కూడా పట్టాలెక్కించాలని భావిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రాబోతోంది. కేస్టింగ్, దర్శకుడు ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఆల్రెడీ తమిళ రీమేక్ అయిన ‘రాక్షసుడు’ తో మంచి హిట్ సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ .. ‘కర్ణన్’ రీమేక్ తో కూడా మంచి విజయం అందుకుంటాడని నమ్ముతున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కర్ణన్ .. తెలుగులో యధా ప్రకారం తెరకెక్కుతుందా లేక ఏవైనా మార్పులు చేస్తారా అనే విషయం ఇంకా తెలియదు. మరి ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడొస్తుందో చూడాలి.
Must Read ;- రాజ్ బీహారీ పాత్ర కోసమేనా నాగబాబు గెటప్ ?