భావాన్ని వ్యక్తం చేయడానికి ప్రాంతానికో భాష. కానీ మళ్ళీ అదే భాషను పలకడానికి ఓ ప్రాంతంలోనూ ఒకో యాస. సాధారణంగా ఒక ప్రాంతంలోని యాస మరో ప్రాంతం వారు.. అర్ధం చేసుకోడానికి కాస్తంత టైమ్ పడుతుంది. కానీ అన్ని యాసల్ని అన్ని ప్రాంతాల వారికి సమానంగా చేరవేసేది మాత్రం సినిమానే. గతంలో తెలంగాణ యాస ఆంధ్రా ప్రాంతం వారికి అంతగా అర్ధమయ్యేది కాదు. అలాగే ఆంధ్రలోని కొన్ని పదాలు తెలంగాణా వారికి అర్ధమయ్యేవి కాదు. కానీ ఇప్పుడు రెండు యాసల్నీ ఇప్పటి సినిమాల్లో తరచుగా ఉయోగిస్తూండడంతో.. ఉభయ రాష్ట్రాల వారికి ఆ సమస్య అంతగా రావడం లేదు.
దీనికి తగ్గట్టుగానే ఈ తరం హీరోలు… తాము నటించే సినిమాల్లో ఒకోసారి ఆ యాస తమది కాకపోయినా.. ఆ పాత్ర కోసం ప్రత్యేకించి నేర్చుకొని మరీ నటిస్తున్నారు. యన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమా కోసం రాయలసీమ స్లాంగ్ ను నేర్చుకొని మరీ డైలాగ్స్ పలికాడు. అంతకు ముందు బన్నీ ‘రుద్రమదేవి’ లోని గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణా స్లాంగ్ ను నేర్చుకొని మరీ పలికాడు. ఇప్పుడు రాబోయే కొన్ని సినిమాల కోసం మన యంగ్ హీరోలు ఆ కోవలోనే యాసా ప్రవీణులు గా మారుతున్నారు.
‘పుష్ప’ సినిమా కోసం బన్నీ చిత్తూరు స్లాంగ్
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్వకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడట. ఈ సినిమా ఎక్కువ శాతం శేషా చలం అడవుల్లో షూటింగ్ జరుపుకోనుంది. దాని కోసం బన్నీ పాత్ర చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడిందట. అందుకే చిత్తూరు యాస కోసం బన్నీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడట. లాక్ డౌన్ సందర్భంగా చిత్రీకరణను ఆపేసిన ఈ చిత్ర యూనిట్ .. అతి త్వరలో షూటింగ్ పున: ప్రారంభింనుందట.
లవ్ స్టోరీ కోసం చైతూ తెలంగాణ స్లాంగ్
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇద్దరు డాన్సర్ల జీవన శైలిని ప్రధానంగా ఆవిష్కరిస్తోంది. ఇందులో చైతూ తెలంగాణ అబ్బాయిగా నటిస్తున్నాడట. ఆ పాత్ర కోసం నాగచైతన్య ప్రత్యేకంగా తెలంగాణ యాక్సెంట్ లో డైలాగ్స్ చెబుతాడట. గతంలో ఫిదా సినిమా కోసం సాయిపల్లవి ఈ తరహాలోనే తెలంగాణా స్లాంగ్ ను నేర్చుకొని మరీ డైలాగ్స్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగచైతన్య తెలంగాణా కుర్రోడిగా నటిస్తూండడంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి.
కొత్త స్లాంగ్ నేర్చుకుంటోన్న సుధీర్ బాబు
ఇటీవల ‘వి’ సినిమాతో పోలీస్ ఆఫీసర్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. సినిమా రిజల్ట్ మాట ఎలా ఉన్నా.. అందరికీ అతడి పాత్ర, అభినయం బాగా నచ్చాయి . దీని తర్వాత సుధీర్ రెండు సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నాడు. అందులో ఒకటి బ్యాండ్ మింటన్ కింగ్ పుల్లెల గోపీచంద్ జీవిత విశేషాల ఆధారంగా రూపొందే సినిమా. ఇందులో సుధీర్ బాబు పుల్లెల గోపీచంద్ పాత్ర పోషించబోతున్నాడు. దీనికోసం మనోడు బ్యాండ్ మింటన్ కూడా బాగా ప్రాక్టీస్ చేశాడట. ఇక మరో సినిమా ఏంటంటే.. లాక్ డౌన్ కు ముందు ‘పలాస 1978’ సినిమాతో జనాన్ని మెప్పించిన దర్శకుడు కరుణ కుమార్ .. త్వరలో రెండో సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడు. అందులో సుధీర్ బాబు హీరోగా నటించబోతున్నాడు. దీని కోసం ఒక ఇంటెన్స్ విలేజ్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు కరుణ కుమార్. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ఒక సరికొత్త స్లాంగ్ లో డైలాగ్స్ పలకనున్నాడట.
గోదావరి యాస కి శర్వానంద్ ‘శ్రీకారం’
యంగ్ హీరో శర్వానంద్ … కొంతకాలంగా పరాజయాలతో కెరీర్ లాగిస్తున్నాడు. ఈ టైమ్ లో అతడికో మంచి హిట్టు పడాలి. మంచి టెలెంటెడ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ కథల ఎంపికలో తడబడుతున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడో మంచి కథతో రాబోతున్నాడు . సినిమా పేరు శ్రీకారం. ఇందులో వ్యవసాయ దారుడిగా శర్వానంద్ నటిస్తున్నాడు. బుర్రాసాయిమాధవ్ డైలాగ్స్ రాస్తున్న ఈ సినిమాకు దర్శకుడు కిశోర్ రెడ్డి. అతడికిదే మొదటి సినిమా. ఇందులో శర్వానంద్ గోదావరి యాసలో డైలాగ్స్ పలకబోతున్నాడట. లాక్ డౌన్ కు ముందు ప్రారంభమైన ఈ సినిమా… త్వరలోనే తిరిగి సెట్స్ మీదకు వెళ్ళనుంది.











