రొటీన్ చిత్రాలకు కాలం చెల్లింది. అన్నింటా సమ్ థింగ్ స్పెషల్ ఉన్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇందుకోసం హీరోలు కూడా బాగా కష్టపడాల్సి వస్తోంది.
మంచి కథ,అందులో తమ పాత్ర బావుంటేనే మార్కులొస్తాయి. అందుకే పేరున్న హీరోలు గతంలోలా ఎక్కువ సినిమాలు చేసేయకుండా.. ఆచితూచి అంగీకరిస్తున్నారు. ఇందుకు ఎంత సమయం పట్టినా తొందరపడక వేచిచూడటంతో పాటు. పాత్రకు తగ్గ లుక్ కోసం మేకోవర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాము నటిస్తున్న కొన్ని చిత్రాల కోసం హీరోలు ప్రత్యేకంగా మేకోవర్ అయి కొత్త లుక్స్ లో కనిపించబోతున్నారు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రీకరణ ఇటీవల తిరిగి మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. కథానుసారం బ్రిటిష్ అధికారులను ఢీ కొనడం కోసం తమ తెలివితేటలతో పలురకాల గెటప్స్ వేస్తారట. ఇందుకోసం ఈ హీరోలిద్దరూ ఎప్పటికప్పుడు మేకోవర్ అవుతున్నారట. ఇక సీనియర్ హీరో నాగార్జున ప్రస్తుతం కాప్ థ్రిల్లర్ కథతో వైల్డ్ డాగ్ పేరుతో ఓ చిత్రం చేస్తున్నారు.
ఇందులో ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మగా నాగ్ కనిపిస్తారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నాగ్ నటన అత్యుత్తమంగా ఉంటుందట. ప్రాణాలను లెక్క చేయక ఉగ్రవాదులను ఏరిపారేసి సమాజాన్ని రక్షించే అధికారిగా నాగ్ పాత్ర ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకుంటుందట. ఇందులో గెటప్ పరంగా బాగా కనిపించడం కోసం నాగ్ ఎంతో శ్రద్ద వహిస్తున్నారట. ఆ మధ్య హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం చిత్రీకరణ ఇటీవలే కులుమనాలిలో జరిగింది. బిగ్ బాస్ గేమ్ షో హోస్టుగా ఉన్న నాగ్ ఈ మధ్య కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి కులుమనాలి వెళ్లివచ్చారు.
తమిళ దర్శకుడు సోలమన్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా దియా మీర్జా, సైయాబీ ఖేర్‌లు ఇతర ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇక అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కలయికలో రూపొందుతున్న పుష్ప చిత్రం తిరిగి సెట్స్ పైకి వచ్చింది. హీరోలను కొత్తగా చూపించే సుకుమార్ ఇందులో అల్లు అర్జున్ ను కూడా కొత్తగా చూపించబోతున్నారు. రంగస్థలం చిత్రంలో చదువుకోని గ్రామీణ యువకుడిగా రామ్ చరణ్ ను గడ్డం గెటప్ లో చూపించినట్లుగా వేరొక కోణంలో అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం గడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన విషయం తెలిసే ఉంటుంది.
Must Read ;- సినీ ప్రముఖలతో అల్లు అర్జున్ ‘ఆహా’ ఏమిటో?
ఇక ఈ వరుసలోనే అక్కినేని నాగచైతన్య తన 19వ చిత్రం లవ్ స్టోరీ కోసం లూజు లూజు ప్యాంటు, చొక్కాలను ధరించి మధ్యతరగతి యువకుడిగా కొత్తగా కనిపిస్తున్నారు. సహజత్వానికి దగ్గరగా సినిమాలను తీసే శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని కూడా తనదైన శైలిలో రూపొందిస్తున్నారు. వీరిసంగతి ఇలా ఉంటే.. రాక్షసుడు చిత్రం తర్వాత మల్లీ మంచి హిట్ సాధించాలని పట్టుదలతో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్.
ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమా చేస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని ఏదైనా ప్రత్యేక ఎపిసోడ్ కోసమో లేదో తెలియదు కానీ ఇటీవల శ్రీనివాస్ సోషల్ మీడియాలో తన న్యూ లుక్ పోస్ట్ చేసారు. పొడవు జుట్టు, బాగా వత్తుగా ఉన్న గడ్డంతో ఇప్పటివరకు ఎప్పడూ చూడని విధంగా కనిపిస్తున్నారు. ఇంతకీ ఎంతో కస్టపడి తయారైన ఈ లుక్ రహస్యం ఎందుకోసమో తెలియాల్సి ఉంది. ఇక మరో హీరో నాగశౌర్య కూడా ఇప్పటివరకు ఎప్పుడూ లేనివిధంగా తన 20వ చిత్రం కోసం చాలా కొత్త అవతారంలో కనిపించబోతున్నారు.
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందే చిత్రం లుక్ లో నాగశౌర్య గడ్డం, కండలు పెంచి కనిపించడంతో పాటు జుట్టు ముడివేసి మరీ విల్లు చేతపట్టారు. ఇలా తాము చేసే పాత్రలకు తగ్గట్టుగా హీరోలు వర్కౌట్లు చేసి న్యూలూక్స్ తో ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నం ప్రేక్షక న్యాయస్థానంలో ఏ మేరకు ఫలిస్తుందో ఆ సినిమాలు విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే.
Also Read ;- టెన్షన్ పడుతున్న నిధి అగర్వాల్, నభా నటేశ్