అజ్జాతవాసి.. ఏ ముహూర్తాన సినిమాకు ఈ పేరు పెట్టారోగానీ ఆ సినిమా హీరోయే కాదు మిగిలిన హీరోలందరూ అజ్జాతవాసులుగా మారిపోవాల్సి వస్తోంది. నువ్వు హీరోనా.. అయితే నేను కరోనా కాస్కో అన్నట్టుంది వ్యవహారం. దీన్నుంచి ఎలా బయట పడాలో తెలియక అందరూ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.
కరోనా సెకండ్ వేవ్ సెగ సినీ పరిశ్రమపై తీవ్రంగా ఉంది. ఒక్క తెలుగు సినిమా రంగమే కాదు మిగిలిన సినిమా రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఒక్క రోజులోనే నమోదైన కేసుల సంఖ్య మూడు లక్షలు దాటిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. సినిమా థియేటర్లు మూతపడిపోయాయి. సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఈ నెలాఖరుకల్లా దాదాపు అన్ని సినిమా షూటింగులూ నిలిచిపోనున్నాయి. టాలీవుడ్ లో కూడా ఇప్పటికే చాలామంది కరోనా బారిన పడ్డారు. హీరో రామ్ చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాంకు కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటూ మరణించారు.
జయరామ్ కు కరోనా సోకిన సంగతి తెలిసిన వెంటనే రామ్ చరణ్ సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. రామ్ చరణ్ కోవిడ్ టెస్టులు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన ఒకసారి చరణ్ కరోనా బారిన పడి కోలుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కు కూడా కరోనా సోకింది. దాంతో ఆయన కూడా ఐసొలేషన్ లో ఉన్నారు.
దేశాలు దాటే ఆలోచన..
కరోనా కారణంగా మెగాస్టార్ కార్ వాన్ డ్రైవర్ కూడా మరణించారు. ఆయన షూటింగ్ విరమించుకోడానికి ఈ డ్రైవర్ మరణం కూడా ఒక కారణమని తెలుస్తోంది. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ‘ఆచార్య’ షూటింగ్ ను నిలిపివేశారు. ఆ డైవర్ మెగాస్టార్ చిరంజీవి దగ్గర చాలాకాలంగా పనిచేసినట్టు సమాచారం. మరో వైపు ఆచార్య షూటింగ్ లో పాల్గొన్న రియల్ హీరో సోనూ సూద్ కు కరోనా పాజిటివ్ గురయ్యారు. ఆయన కూడా అజ్జాతంలోకి వెళ్లిపోయారు. అయినా సరే ఆయన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉన్నారు.
తనకు వచ్చిన వినతులకు స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. కొందరు స్టార్ హీరోలు మాత్రం ఇళ్లల్లో ఉన్నా క్షేమంగా కాదు దేశం విడిచి వెళ్లిపోతేనే మంచిదనే భావనతో కోవిడ్ లేని దేశాలకు పయనం కడుతున్నట్టు సమాచారం. ఎలాగో ఏటా సమ్మర్ ట్రిప్ వేయాలి కాబట్టి ముందే ట్రిప్ వేసేద్దామన్న ఆలోచనలో వారున్నారు. ఏఏ ప్రాంతాల్లో కరోనా లేదో వెతికే పనిలో కొందరున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, రానా, ఎన్టీఆర్, మహేష్ బాబు.. తదితరులంతా సెల్ప్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. తమకు వైరస్ ఉన్నట్టయితే మరొకరికి వ్యాపించకుండా ప్రత్యేకంగా ఓ గదిలోనే గడుపుతున్నట్టు సమాచారం.
తెలుగులో మొత్తం 25 సినిమాల షూటింగులు నిలిచిపోయినట్టు సమాచారం. మహేష్ నటిస్తున్న సర్కారువారి పాట షూటింగ్ కూడా నిలిచిపోయింది. మే నెలలో షూటంగ్ ప్రారంభం కావచ్చని చెబుతున్నా పరిస్థితులు చక్కబడే వరకూ ఏ షూటింగూ ప్రారంభమయ్యే అవకాశమే లేదు. ట్రిపుల్ ఆర్ షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఖిలాడి దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో హీరో రవితేజ అప్రమత్తమయ్యారు. ఈ సెకండ్ వేవ్ లో రిస్క్ తీసుకోకుండా ఉండటమే మేలన్న అభిప్రాయంలో హీరోలంతా ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ మరో సారి సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.
– హేమసుందర్
Must Read ;- కరోనా కోరల్లో చిత్ర పరిశ్రమ విలవిల