దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలను ఉద్ధేశిస్తూ తాను చెప్పేది అబద్దమని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని గతంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి తాజాగా స్పందించారు. అయితే సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావుకు మధ్య రాజకీయంగా తగవుపెట్టే స్కెచ్ వేస్తున్నట్లు తన కామెంట్స్ చూస్తే స్పష్టమవుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేసేందుకు చెమటోడ్చి పనిచేస్తున్న మంత్రి హరీష్‌రావుకు ఆయన మామ సీఎం.. ఊహించని షాక్ ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఒకవైపు హరీష్ రావును పొగుడుతూ, మరోవైపు సీఎం కేసీఆర్‌ను హెచ్చరిస్తూనే పరోక్షంగా కేటీఆర్‌కు హరీష్‌రావుకు మధ్య నిప్పురాజేసే ప్రయత్నాలను ఆమె చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇద్దరి నేతల మధ్య అగ్గిరాజేసే ప్రయత్నాన్ని రాములమ్మ చేస్తుందనే చర్చ జరుగుతోంది.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తురువాత జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి ఆ ఫలితాలు రాగానే తన తనయుడు కేటీఆర్‌కు సీఎం పదవి ఇచ్చేందు కేసీఆర్ రంగం సిద్ధం చేసినట్లు టీఆర్ఎస్ వర్గాల ప్రచారంగా ఆమె పేర్కొన్నారు. ఈ వాదనకు బలం చేకూర్చేలా మొదటిసారిగా కేసీఆర్ నోట వెంట సీఎం పదవికి రాజీనామా మాట బయటికొచ్చిందన్నారు. ఎన్నడూ లేనంతగా మామ, అల్లుడి మధ్య విజయశాంతి ఈ విధంగా లింకు పెట్టే ప్రయత్నం వెనుకాల కచ్చితంగా రాజకీయ కోణమేదాగుందనే టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కేటీఆర్‌కు సీఎం పదవి అంటగట్టి రాజకీయంగా హరీష్‌రావును తొక్కేందుకే గులాబీ బాస్ ఇలా ప్లాన్ వేస్తున్నారని తన ఉద్ధేశంగా చెప్పుకొచ్చారు.
బీజేపీ మీద నెపం నెట్టి సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సంకేతాలివ్వడం భవిష్యత్ రాజకీయాలకు అద్దం పడుతోందని విజయశాంతి తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఒకవేళ గెలిస్తే హరీష్‌కి.. మామ కేసీఆర్ బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని, ఆ గిఫ్ట్ ఏమిటంటే.. సీఎం పదవికి రాజీనామా చేసి కేటీఆర్‌ను సీఎం గద్దెపై కూర్చోబెట్టబోతున్నారన్న వాదన వినిపిస్తోందన్నారు. ఎంతైనా నమ్మినవారిని గొంతు కోయడంలో కేసీఆర్ అనుసరించే స్టైలే వేరని హరీష్‌రావును ఉద్ధేశిస్తూ అన్నారు. ఓవైపు హరీష్‌రావు దుబ్బాకలో బీజేపీ నేతల మీద విరుచుకు పడుతుంటే, ఆయన ప్రచారాన్ని డామినేట్ చేసేలా కేసీఆర్ బీజేపీ నేతలకు సవాల్ విసరడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన ప్రకటన బీజేపీ నేతలకే కాదు పరోక్షంగా హరీష్‌రావుకి కూడా సంకేతం ఇచ్చినట్లేనని తెలంగాణ సమాజం భావిస్తోందని ఆమె కామెంట్ చేశారు.