పంచ్ ప్రభాకర్ అలియాజ్ చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి.. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా అందరికీ చిరపరచితుడే. జగన్ అంటే అమితమైన అభిమానం చూపే పంచ్.. జగన్‌ను ఇతరులేమన్నా, జగన్‌కు వ్యతిరేకంగా ఏది జరిగినా కూడా ఇట్టే స్పందిస్తుంటారు. అలా జగన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించింది ఎవరు? ఏ కారణం చేత వ్యవహరించారు? అలా వ్యవహరించడంలో తప్పు ఉందా? లేదంటే జగన్ తప్పు చేస్తేనే ఆ నిర్ణయం వచ్చిందా? ఆ నిర్ణయం కోర్టులు తీసుకున్నాయా?.. ఇలా ఏ విషయాన్ని కూడా పంచ్ అస్సలు ఆలోచించరు. జగన్ కు అనుకులమా? వ్యతిరేకమా? అన్న విషయాన్ని మాత్రమే పంచ్ పట్టించుకుంటారట. అందుకే కాబోలు.. జగన్ సర్కారు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు తప్పుబట్టిందన్న విషయాన్ని కూడా పంచ్ పట్టించుకోలేదు. హైకోర్టు అయితే ఏమిటి? అందులో పనిచేస్తున్న న్యాయమూర్తులు అయితే ఏంటి? అన్న కోణంలో జడ్జీలను దూషిస్తూ సోషల్ మీడియాలో సంచలన పోస్టులు పెట్టేశాడు. వాటిని తన మిత్ర బృందంతో వైరల్ చేయించాడు. ఇలా చేయకూడదని ఎవరో చెబితే.. తాను ఫలానా అడ్రెస్‌లో ఉంటాను.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు ఏ ధైర్యంతో ఆ వ్యాఖ్యలు చేశాడో తెలియదు గానీ.. జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన సీబీఐ.. పంచ్ ప్రభాకర్‌ను మాత్రం అరెస్ట్ చేయలేకపోయింది.
సీబీఐ ఎస్పీ ఏమంటారంటే..?
ఈ కేసుకు సంబంధించి గురువారం, శుక్రవారం ఏపీ హైకోర్టులో వరుసగా విచారణ జరిగింది. జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు నమోదై ఏడాది అయిపోతున్నా.. ఇప్పటికీ కీలక నిందితుడు పంచ్ ప్రభాకర్‌ను పట్టుకోలేని వైనంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గురువారం నాటి విచారణలో భాగంగా సీబీఐ తరపు న్యాయవాది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. స్వయంగా సీబీఐ ఎస్పీనే హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో శుక్రవారం నాటి విచారణకు సీబీఐ ఎస్పీ హైకోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచ్ ప్రభాకర్ ఎక్కడున్నారో తెలియడం లేదని, సోషల్ మీడియా సంస్థలు తాము అడిగిన వివరాలేమీ ఇవ్వడం లేదని సీబీఐ ఎస్పీ సెలవిచ్చారట. ఎస్సీ సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఎవరో వివరాలు అందిస్తేనే నిందితులను అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడింది. అసలు పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేస్తారా? లేదా? ఈ విషయంలో మీకు చేతనవుతుందా? లేదంటే చేతనయినా చేత కానట్లు నటిస్తున్నారా? అంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా మీతో పని కాదు గానీ.. మీ డైరెక్టరే ఈ కేసును నేరుగా పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఇకపై ఈ కేసును సీబీఐ డైరెక్టరే నేరుగా పర్యవేక్షించాల్సి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వీడియోలు ఇంకా డిలీట్ కాలేదా?
జడ్జీలపైనే కాకండా భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడుపైనా పంచ్ ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలంటూ చాలా కాలం క్రితమే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికీ పంచ్ ప్రభాకర్ పోస్ట్ చేసిన వీడియోలు ఇంకా సోషల్ మీడియాలోనూ ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం నాటి హైకోర్టు విచారణ సందర్భంగా సీబీఐ ఎస్పీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. హైకోర్టు విచారణ సందర్భంగా పంచ్ ప్రభాకర్ వీడియోలను డిలీట్ చేయాలని యూట్యూబ్‌కు లేఖ రాశామని సీబీఐ ఎస్పీ న్యాయమూర్తికి చెప్పారు. అయితే అక్కడే ఉన్న యూట్యూబ్ తరఫు న్యాయవాది మాత్రం ఆ దిశగా సీబీఐ నుంచి తమకు ఎలాంటి లేఖ రాలేదని తేల్చేశారు. దీంతో సీబీఐ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీనిని బట్టి జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పంచ్ ప్రభాకర్ పోస్ట్ చేసిన వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో ఉన్నట్లుగానే భావించక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్‌కు తెలిసే మాట్లాడుతున్నారా?