ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇచ్చిన షెడ్యూల్‌ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికలు అడ్డొస్తాయని కోర్టు భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు, వాక్సినేషన్ ఒకేసారి నిర్వహించలేమని ఏపీ ప్రభుత్వ ఏజీ కోర్టులో వాదనలు వినిపించారు. రెండు గంటల పాటు సాగిన విచారణ అనంతరం ధర్మాసనం ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
వారి మధ్య వార్ ముగిసినట్టేనా?
మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పటి నుంచీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, ఏపీ ప్రభుత్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం రగులుతూనే ఉంది. గత మార్చిలో కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను మధ్యలోనే ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వానికి, ఎస్‌ఈసీ మధ్య వార్ కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి ముగియక ముందే నిమ్మగడ్డను తొలగించి ఏపీ ప్రభుత్వం కనగరాజ్‌ను నియమించింది. దీనిపై హైకోర్టుకు వెళ్లి నిమ్మగడ్డ పదవి సాధించుకోగలిగారు. అప్పటి నుంచి ఏపీలో స్థానిక ఎన్నికల పోరు నిమ్మగడ్డ వర్సెస్ ప్రభుత్వం అన్న చందంగా తయారైంది.
Must Read ;- స్థానిక ఎన్నికలు జరిగేనా? కేరళలో అలా.. మరి ఏపీలో ఎలా?

స్థానిక ఎన్నికలు మార్చి తరవాతేనా?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చిలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం సహకరించకపోయినా ఈనెల 8న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని, ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కావని ప్రభుత్వ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు తేల్చి చెప్పారు. అయినా ఎన్నికల కమిషనర్ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
డివిజన్ బెంచ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం
ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయితే కోర్టులు జోక్యం చేసుకోవు. కానీ స్థానిక ఎన్నికల విషయంలో ఏపీ హైకోర్టు ఏకంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్‌ను సస్పెండ్ చేసింది. దేశ చరిత్రలో ఎన్నికల షెడ్యూల్ మొత్తాన్ని కోర్టులు రద్దు చేసిన దాఖలాలు లేవని సీనియర్ న్యాయ కోవిదులు చెబుతున్నారు. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగా హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి వచ్చే తీర్పును పరిశీలించి, ఎస్ఈసీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీ ప్రభుత్వానికి ఊరట
ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. చాలా కేసుల తరవాత ఏపీ ప్రభుత్వానికి అనుకూల తీర్పు వెలువడింది. స్థానిక ఎన్నికలను ఎలాగైనా మార్చి ముగిసే వరకు నిలువరించాలని ఏపీ సీఎం చేసిన ప్రయత్నాలు ఫలించాయనే చెప్పాలి. స్థానిక ఎన్నికలు ఏప్రిల్‌లో ఉంటాయని వైసీపీలో నెంబర్ టూగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు. అంటే ప్రభుత్వాన్ని కరోనా కన్నా నిమ్మగడ్డే ఎక్కువగా భయపెట్టినట్టు భావించాల్సి వస్తోంది. నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా ఉంటే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను బెదిరించడం, నామినేషన్లు వేయకుండా చేయడం సాధ్యం కాదనే ప్రభుత్వం మార్చిలోగా ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు రాలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏది ఏమైనా తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య వార్‌కు ముగింపు పలికిందనే చెప్పవచ్చు.
Must Read ;- విజయసాయిరెడ్డి సిగ్నల్స్.. ఏప్రిల్, మే నెలల్లో స్థానిక ఎన్నికలు











