కింగ్ నాగార్జున అక్కినేని.. టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరు అనేకన్నా.. టాలీవుడ్ కి ఒక మూల స్తంభం అని చెప్పాలి. ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలకు ధీటుగా ఆయన గ్లామర్ ఉంటుందనడంలో సందేహం లేదు. నవ మన్మథుడిగా వెండి తెరపై ఒక వెలుగు వెలుగుతున్న ఆ స్టార్ హీరో.. తన సినీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసి పేరు తెచ్చుకున్నారు. కొత్త కథలను ఓకే చేయాలన్న, కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్న నాగార్జున ముందు వరసలో ఉంటారు. ఆయన పేరు చెప్పుకొని ఎంతోమంది నూతన దర్శకులుగా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు మంచి డైరెక్టర్లగా వెలుగొందుతున్నారు. అలాంటి నాగ్ .. ఇప్పుడు టీవీ హోస్ట్ గా కూడా సత్తా చాటుతున్నారు.
స్మాల్ స్క్రీన్ పై కూడా కింగ్ ఆల్వేస్ కింగ్ అనిపించారు నాగార్జున. తాను మొట్ట మొదటిగా చేసిన “మీలో ఎవరు కోటీశ్వరుడు” షో నుంచి లేటెస్ట్ “బిగ్ బాస్” వరకు తనదైన శైలిలో రక్తి కట్టిస్తూ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. అయితే ఎంత పెద్ద షో అయినప్పటికీ సరైన హోస్ట్ లేకపోతే అది చప్పగానే ఉంటుంది. కానీ అన్ని రకాల రుచులతోను కింగ్ నాగార్జున అందిస్తున్న ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ 4 షోను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. ప్రతీ వీకెండ్స్ లో హోస్ట్ గా నాగ్ వస్తారన్న సంగతి తెలిసిందే. అలా నాగ్ హోస్ట్ చేసిన గత సెప్టెంబర్ 19 మరియు 20వ తేదీల ఎపిసోడ్స్ కు గట్టి టీఆర్పీనే వచ్చినట్టు టాక్ నడుస్తుంది. శనివారం ఎపిసోడ్ కు గాను 9.6 టీఆర్పీ రాగా, ఆదివారం ఎపిసోడ్ కు మాత్రం 13కి పైగా టీఆర్పీ వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో వీకెండ్స్ లో నాగ్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారో చూడొచ్చు. పైగా ఇదే వీకెండ్స్ లో సస్పెన్స్ ఫుల్ గా ఎలిమినేషన్స్ ఉండటం మరింత ప్లస్ అయ్యింది. మరి ఇలాంటి షోను అద్భుతంగా నాగ్ హోస్ట్ చేసి ఒంటి చేత్తో రక్తి కట్టించడం వలనే ఇదంతా అని చెప్పాలి.











