ఏపీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నిధుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం పన్ను బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పురపాలికలు, కార్పొరేషన్లలో ఆస్థి పన్ను పెంచుకునేందుకు అనుమతించిన ప్రభుత్వం తాజాగా మంచినీటి పన్ను, పారిశుద్ధ్య ఛార్జీలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే స్థానిక సంస్థలు మంచినీరు, పారిశుధ్య పన్నులను ఏటా క్రమం తప్పకుండా 7శాతం పెంచుకుంటూ వస్తున్నాయి. అయినా చాలా పురపాలికలు, కార్పొరేషన్లు నిధుల కొరతతో సతమతం అవుతున్నాయి. ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మీకు ఎంత ఖర్చు వస్తుందో అంత పిండుకోవాల్సి బాధ్యత మీదేనంటూ పన్నులు పెంచుకునేందుకు ప్రభుత్వం తాజా అనుమతించింది.
ఇక బాదుడే…
ఇప్పటికే పురపాలక సంస్థలు, కార్పొరేషన్ల పన్ను పీకుడుతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆస్థిపన్ను, చెత్తపన్ను, మంచినీటి పన్ను, పెరిగిన విద్యుత్ ఛార్జీలతో 200 గజాల్లో ఓ మాదిరి ఇళ్లు ఉన్నవారు కూడా కార్పొరేషన్లలో ఏటా రూ.60 వేల దాకా పన్నులు చెల్లించాల్సి వస్తోంది. అయితే కార్పొరేషన్ల నుంచి అందే సేవలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ఇప్పటికీ చాలా కార్పొరేషన్లలో అనేక కాలనీల్లో కనీస సదుపాయాలు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. అయినా నిధుల లేమితో కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇక తాజాగా పన్నులు పెంచుకునే అధికారం పురపాలికలకు, కార్పొరేషన్లకు ఇవ్వడంతో, వారు ఎంత పన్ను పెంచుతారో అని జనం బెంబేలెత్తిపోతున్నారు. సౌకర్యాలు మెరుగు పరుచుకుంటూ, పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన స్థానిక సంస్థలు ఇలా పన్ను బాదుడుతో జనాలకు చుక్కలు చూపిస్తున్నాయని విజయవాడ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
Must Read ;- ఎన్నికల కమిషనర్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు!
స్థానిక ఎన్నికల తరవాతే పెంచుతారట..
ఏపీలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా లేదు. వారి మధ్య వార్ జరుగుతోంది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. ఆ వెంటనే కొత్త కమిషనర్ ను నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నిమ్మగడ్డ పదవీ విరమణ చేయగానే స్థానిక ఎన్నికలు నిర్వహించి, ఆ వెంటనే పన్నులు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ తరవాత పన్నులు పెంచుకునేందుకు అనుమతించడాన్ని పరిశీలిస్తే, స్థానిక ఎన్నికలు పూర్తికాగాగే వెంటనే జనానికి వాతలు వేసేందుకు సిద్దమవుతున్నారని అర్థం అవుతోంది.
కనీస సదుపాయలు కల్పించలేరా?
ఏ ప్రభుత్వమైనా ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో నడుస్తుంది. అయితే ప్రజలు చెల్లించేది ఎంత? వారికి అందుతున్న సేవలు ఆ స్థాయిలో ఉన్నాయా? అనే విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. పురపాలికలు, కార్పొరేషన్లలో భారీగా పన్నులు వసూలు చేస్తూ కనీస సదుపాయలు కల్పించడంలో ఆ సంస్థలు విఫలం అవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి నగరంలో ఏవో రెండు ప్రధాన రోడ్లను ముస్తాబు చేసి షో చేయడం తప్ప శివారు కాలనీల్లో సదుపాయాలపై మాత్రం అధికారగణం దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
Also Read ;- మంత్రుల తిట్లపై.. మళ్లీ గవర్నరు చెంతకు నిమ్మగడ్డ..