కోనసీమ ప్రాంత ప్రజల దశాబ్దాల స్వప్నమైన కోటిపల్లి – నరసాపురం బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం, భూసేకరణ పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 100 కోట్ల నిధులను మంజూరు చేస్తూ రవాణా, రహదారులు, భవనాల శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తం 57.21 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన 25 శాతం వాటా ఒప్పందానికి కట్టుబడి నిధులు విడుదల చేసింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా మంజూరైన ఈ నిధులను భూసేకరణ నిమిత్తం అమలాపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) ఖాతాకు బదిలీ చేసి పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ నిర్ణయంపై అమలాపురం MP జి.ఎం. హరీష్ బాలయోగి హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు బీజం వేసిన తన తండ్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి 75వ జయంతి రోజే ఈ నిధుల ఉత్తర్వులు వెలువడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు.
ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే అమలాపురం, పేరూరు, పసర్లపూడి, జగ్గన్నపేట, రాజోలు వంటి ప్రాంతాలకు నేరుగా రైలు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదులపై వంతెనల నిర్మాణం, భూసేకరణ ప్రక్రియ ఈ రూ.100 కోట్ల నిధుల విడుదలతో మరింత పుంజుకోనుంది.











