రాయలసీమ రాజకీయ చరిత్రలోనే ఊహించని సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని కంచుకోటగా నిలిచిన పులివెందుల నియోజకవర్గంలో పసుపు జెండా ఊపందుకుంది. పులివెందుల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. నియోజకవర్గంలోని మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకంగా 64 స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తూ ఏకగ్రీవం చేసుకుంది. దాంతో పాటు 7 జడ్పీటీసీ స్థానాల్లో 3 స్థానాలు కూటమి ఖాతాలో చేరాయి.
గతంలో అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలు చేస్తూ విర్రవీగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కుప్పం పీఠాన్ని కైవసం చేసుకున్నామని ప్రగల్భాలు పలికిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి, ఇప్పుడు ఆయన సొంత గడ్డపైనే తెలుగుదేశం పార్టీ కోలుకోలేని దెబ్బకొట్టిందట. ‘కుప్పంలో మీరు చేస్తే.. పులివెందులలో మేం చేసి చూపిస్తాం’ అన్నట్లుగా టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించి నాటి పరాభవానికి పరిపూర్ణమైన రివేంజ్ తీర్చుకుంది.
వైసీపీ నేతలు బలవంతపు ఉపసంహరణలు అని ఆరోపణలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు వైసీపీ వైఫల్యాలకు విసిగిపోయారనేది స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలోనే ఆ పార్టీకి కనీసం పోటీ చేసే అభ్యర్థులు కూడా కరువయ్యేలా పరిస్థితులు మారాయంటున్నారు. టీడీపీ సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సాగిస్తున్న పాలనకు పులివెందుల ప్రజలు వేసిన ముద్రగా ఈ ఏకగ్రీవాల విజయాన్ని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
మొత్తానికి పులివెందులలో సైకిల్ సృష్టించిన ఈ సునామీతో వైసీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. సైకిల్ జోరుతో కడప జిల్లా రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోగా, రాబోయే రోజుల్లో కూటమి గాలి రాష్ట్రమంతటా మరింత వేగంగా వీస్తుందని ఈ తీర్పు నిరూపిస్తోంది. జగన్ అన్న చొక్కా మడత బెట్టాను.. ఎవరొస్తారో చూసుకుందాం అనేలోపే పులివెందులలో ఫ్యాన్ గాలి వీయకుండానే స్విచ్ ఆఫ్ అయింది.. టోటల్గా జగన్ చొక్కా మడతబెట్టేలోపే, వైసీపీని మడతబెట్టేశారు తెలుగు తమ్ముళ్లు.. వై నాట్ కుప్పం అన్న నాడు జగన్ స్లోగన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగు తమ్ముళ్లు పక్కా వ్యూహంతో పులివెందులలోనూ విజయ పతాకం ఎగురవేశారు.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ అరాచకాలకు బ్రేక్ పడిందనే చర్చ సాగుతోంది..











