హనుమంతుడు చిరంజీవి అంటారు. మనకు రామాయణం, మహాభారతంలోనూ హనుమంతుడు కనిపిస్తాడు. అసలు హనుమంతుడు ఎప్పటివాడు? ఎక్కడి వాడు? అనే ప్రశ్నలు ఎప్పటి నుంచో ఉన్నాయి. చాలా పరిశోధనలు జరిగాయి కూడా. చివరికి టీటీడీ కమిటీ తేల్చి చెప్పింది ఏమిటంటే తిరుమల కొండపైనే హనుమంతుడు పుట్టాడని.
అసలు హనుమంతుడి పుట్టుకకు సంబంధించి వివాదాలు ఏమేం ఉన్నాయి? చరిత్ర ఏం చెబుతోంది? పురాణాలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలను మనం చూద్దాం. భూమి పుట్టుక, జీవం పుట్టుకే ఓ మిస్టరీ. అలాంటప్పుడు మన పురాణాల మీద మనం ఆధార పడక తప్పదు. మన పురాణాల లెక్కలు, సైన్సు చెబుతున్న లెక్కలు దగ్గరగా ఉండటం వల్ల మన పురాణాలే ప్రామాణికం అని నమ్మాల్సిన పరిస్థితి ఉంది. హనుమంతుడు, వేంకటేశుడు ఒకే కాలం నాటివారా? అనే ప్రశ్న కూడా ఉద్భవిస్తోంది. ఎందుకంటే ఇద్దరికీ వేంకటాచలం కూ సంబంధం ఉండటమే కారణం. హనుమంతుడి చరిత్రకు శ్రీపరాశర సంహిత ప్రామాణిక గ్రంథంగా చెబుతారు.
స్కంధ పురాణంలోనూ ఈ ప్రస్తావన ఉంది. మనకున్న నాలుగు యుగాలలోనూ వేంకటేశ్వరుడు, హనుమంతుడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. హనుమంతుడికి సంబంధించిన చరిత్ర ఎక్కువగా రామాయణంలోనే కనిపిస్తుంది. వేంకటేశుడు కొలువున్న వేంకటాచాలనాకి అంజనాద్రి అనే పేరు కూడా ఉంది. మొత్తం 20 పేర్లు ఈ కొండకు ఉన్నాయి. త్రేతాయుగంలో దీన్ని అంజనాద్రి అని పిలిచేవారంటారు. ఈ పర్వతంపై తపస్సు చేసిన అంజనాదేవికి అంజనేయుడు పుట్టాడని చెబుతారు.
హనుమంతుడి జన్మస్థానంపై పరిశోధనకు ఏర్పాటు చేసిన కమిటీలో మురళీధర శర్మతో పాటు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ్‌కుమార్ సభ్యులుగా ఉన్నారు. తితిదే ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా.ఆకెళ్ల విభీషణశర్మ కన్వీనర్‌గా వ్యవహరించి చివరికి వీరి పరిశోధనను ముగించారు. అందరూ తేల్చి చెప్పింది ఏమిటంటే అంజనేయుడు పుట్టింది తిరుమల కొండపైనే. జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ఈరోజు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
వరాహ పురాణం అవలోకిస్తే..
వరాహ పురాణం ప్రకారం సృష్టి ప్రారంభంలోనే వరాహస్వామి నీటి నుంచి భూమిని బయటికి తెచ్చి సృష్టిని ప్రారంభించాడంటోంది. ఆ తర్వాతే వేంకటాచలంపై ఇప్పటి స్వామి అవతారం స్వామివారి పుష్కరిణి పక్కన శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడని తెలుస్తోంది. దానికి నిదర్శనం అక్కడ ఉన్న పుష్కరిణికి పడమరన ఉన్న వరాహ స్వామి ఆలయం. ఇది జరిగి 200 కోట్ల సంవత్సరాలు అయి ఉంటుందంటున్నారు. శ్వేత వరాహకల్పంలోని ఏడోదైన వైవస్వత మన్వంతరం లోని 28 వ మహాయుగం లో వచ్చే కృతయుగంలో శ్రీ మహా విష్ణువు వేంకటేశ్వరుడిగా అవతరించాడని అంటారు.
వేంకటేశుడికన్నా ముందు ఆదివరాహ స్వామి తిరుమలపై వెలిశాడని అంటారు. వరాహం అంటే పంది, హనుమంతుడు అంటే కోతిగా భావిస్తుంటారు. ఆ ప్రకారం చూస్తే జీవం పుట్టుకే తిరుమల కొండపై ప్రారంభమైందా అన్న సందేహం కూడా వస్తోంది. అసలు ఆ కొండ వరకూ ఒకప్పుడు సముద్రం ఉండేదని కూడా అంటుంటారు. అక్కడి నుంచి తిరుమల భూభాగంగా బయటపడి జీవం ఆవిర్భావానికి కారణం అయి ఉండొచ్చన్న వాదన ఉంది. వేంకటా చలం ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అనేది తెలియాలంటే వరాహ పురాణం చదవాల్సిందే. దీని ప్రకారం చూస్తే 28వ మహాయుగంలోనే శ్రీనివాసుడు ఉన్నాడనుకోవచ్చు.
కల్పం అంటే ఏమిటో చూద్దాం
శ్వేత వరాహ కల్పం ప్రస్థావన వచ్చింది కాబట్టి కల్పాల లెక్కలు కూడా చూడాల్సిందే. కల్పం అంటే 432 కోట్ల సంవత్సరాలు. ఒక్కో కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక్కో మన్వంతరం లో 71 మహాయుగాలు ఉంటాయి. ప్రతి మహాయుగంలో నాలుగు యుగాలు ఉంటాయి. ఇప్పుడు ఏడో మన్వంతరం అయిన వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో వచ్చే కలియుగంలో ప్రథమ పాదం నడుస్తోంది. ఈ కల్పం 28వ మహాయుగంలో వచ్చే కృతయుగంలోనే తిరుమల ఆవిర్భవించి ఉంటుందని అంటున్నారు. నిజానికి దీనికి పురాణాల ఆధారం. స్కంద పురాణం వైష్ణవ ఖండంలో చాలా వివరాలున్నాయి.
దశరథుడు పుత్ర సంతానం కోసం యాత్రలు చేస్తూ వేంకటా చలానికి వెళ్లగా అక్కడ వశిష్ఠుడితో పుత్రకామేష్టి యాగం చేయించాల్సిందిగా శ్రీనివాసుడు ఆదేశిస్తాడు. అక్కడే ఉన్న అంజనాద్రిపై పుత్ర సంతానం కోసం తపస్సు చేస్తున్న అంజనా దేవికి ఆంజనేయుడు కలగడం కూడా అలాంటిదే అనుకోవాల్సి ఉంటుంది. 5,114 సంవత్సరంలో జనవరి 10న మధ్యాహ్నం 12.05 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. లంకలోని అశోకవనంలో సీతమ్మతల్లిని ఆంజనేయుడు క్రీస్తు పూర్వం 5,076 సెప్టెంబర్ 12న కలిశాడని లెక్కలు వేసి తేల్చారు.
మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3,139, అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైందని పరిశోధకులు తేల్చారు. మనం మాట్లాడుకుంటున్నది 28వ మహాయుగంలో వచ్చే యుగాల గురించే. ఆ ప్రకారం చూస్తే అంతకుముందు వచ్చిన యుగాల్లో ఈ భూమ్మీద జీవం లేదా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. వీటన్నిటికీ మన పరిశోధకులు సమాధానం చెప్పాల్సిందే.
(మరో వ్యాసంలో ఆంజనేయుడి పుట్టుకకు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.)











