మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్ ఘటన..దానిపై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ ఘటనపై జగన్ స్పందిస్తూ..సీదిరి అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ల చిన్న పిల్లోడని, వాహనం నడుపుతూ ఎవరినో ఢీకొడితే అతను చ*నిపోయాడని, ఒక్కోసారి ఇలాంటివి జరుగుతుంటాయంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిండు ప్రాణం పోతే కనీస మానవత్వం లేకుండా, నిందితుడిని చిన్న పిల్లోడంటూ వెనకేసుకురావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా ఎక్కడైనా ప్రమాదం జరిగితే బాధితులు ఎవరు, వారి పరిస్థితి ఏంటి, వైద్య అవసరాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేయడం కనీస ధర్మం. కానీ సీదిరి అప్పలరాజు మాత్రం తన కుమారుడి నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం పోయినా కనీసం పట్టించుకోలేదు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారే తప్ప, ఆ ప్రమాదంలో చ*నిపోయిన వ్యక్తి కుటుంబం ఏమైందో, ఎలా ఉందో అని కనీసం చూడలేదు సరే కదా, ఇంతవరకు ఆ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు కూడా లేవు.
ఈ ప్రమాదంలో మృ*తి చెందిన దుబ్బు దానయ్య కుటుంబం ఇప్పుడు పూర్తిగా దిక్కులేనిదైపోయింది. ఉపాధి కోసం వెళ్లిన భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్న ఆ ఇల్లాలు ద్రౌపది గుండెవిసేలా విలపిస్తోంది. అభం శుభం తెలియని ఐదేళ్ల పెద్ద కుమారుడు అభి, 16 నెలల చిన్న కుమారుడు తండ్రి ఇక రాడని తెలియక బేలచూపులు చూస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఎమోషనల్ వీడియోలుగా మారి కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నెలల వ్యవధిలోనే రెండో బిడ్డను కోల్పోయిన ఆ వృద్ధురాలైన తల్లి కామమ్మకు గర్భ శోకమే మిగిలింది.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సూదికొండ ప్రాంతంలో నివాసముంటున్న దానయ్య కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధురాలైన తల్లితో కలిసి అద్దె ఇంట్లోనే బతుకును ఈడుస్తున్నారు. గొర్రెలు మేపుకుంటూ ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న దానయ్య అకాల మరణంతో ఆ ఇల్లు చీకటమయమైంది. తమ పిల్లల భవిష్యత్తు, తన జీవితం పూర్తిగా అంధకారంలో పడిపోయాయని, తమను ఎవరైనా ఆదుకోవాలంటూ ద్రౌపది కన్నీరుమున్నీరవుతూ వేడుకుంటున్న వీడియోలు ఇప్పుడు సమాజాన్ని కదిలిస్తున్నాయి.











