దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కేటగిరిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి ప్రపంచస్థాయి నటీనటుల్ని ఎంపికచేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ సరసన కథానాయికగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ ను తీసుకున్నాడు రాజమౌళి. ఇప్పుడు ఈ సినిమాలో మరొక ప్రధాన పాత్ర కోసం ఐరిష్ నటి అలిసన్ డూడీని ఎంపికచేశాడు. ఈమె హాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించారు. ఈమె ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో లేడీ స్కాట్ పాత్రలో కనిపించనున్నారు.
లేడీ స్కాట్ పాత్ర ఈ కథలో ప్రధాన విలన్ అనే టాక్ కూడా టాలీవుడ్ లో నడుస్తోంది. బ్రిటిష్ సంస్థానంలో ప్రముఖ అధికారిణిగా ఉండే అలిసన్ డూడీ, అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలకు సవాల్ విసిరే పాత్రలో కనిపించనుందట. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ కోసం అలిసన్ డూడీ ఇండియాకు విచ్చేశారు. తాను ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు అలిసన్ డూడీ. లేడీ స్కాట్ హెడింగ్ టూ ఇండియా అంటూ సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి వీడియోను పోస్ట్ చేశారు ఆమె.
త్వరలోనే అలిసన్ డూడీకు సంబంధించిన కీలక సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి తీయనున్నాడని సమాచారం. కాగా సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరన్, అలియా భట్ లాంటి నటీనటులు నటించనున్నారు. మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే చరణ్ అల్లూరి సీతారామరాజు, తారక్ కొమురం భీం పాత్రలపై విడుదలైన రెండు టీజర్లు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో ఆ అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కొమురం భీం పాత్రపై కొన్ని కాంట్రవర్సీలు జరిగినా రాజమౌళి మాత్రం షూటింగ్ పైనే తన దృష్టిని పెట్టాడు. సుమారు 450కోట్ల భారీ వ్యయంతో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నారు.
Welcome to Indian cinema, #AlisonDoody! Had a wonderful time shooting for your first schedule… We are glad to have you play lead antagonist #LADYSCOTT in #RRRMovie! #RRR pic.twitter.com/ELNUUS0g32
— RRR Movie (@RRRMovie) November 20, 2019











