ఇవాళ ఎవరి నోట విన్నా బాలయ్య పేరే వినిపిస్తోంది. జై బాలయ్య అనేది తారక మంత్రంలా పనిచేస్తోంది. అసలు బాలకృష్ణ జాతకం ఎలా ఉందో చూద్దాం. జూన్ 10, 1960లో ఉదయం 6.30 ప్రాంతంలో బాలయ్య జన్మించారు.
ఆయనది మూల నక్షత్రం 1వ పాదం. ధనుస్సు రాశి. లగ్నం మిధునం. సాధారణంగా మూల నక్షత్రంలో జన్మించిన వారు బలమైన అభిప్రాయాలతో ఉంటారు. చాలా ఈజీగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరిలో అసాధారణ శక్తి ఉంటుంది. స్వయంకృషితో ఉన్నత స్థానానికి వెళతారు. వీరికి వీరే పోటీ వీరికి వీరే సాటి. వీరితో పోటీపడిన వారు గెలవలేరు. యోగ్యమైన సంతానం ఉంటుంది. ప్రస్తుతం గోచార రీత్యా ఆయనకు ఏలినాటి శని చివరి దశలో ఉంది. వచ్చే జనవరి 17 నాటికి ఏలినాటి శని వెళ్లిపోతుంది. మరో విషయం ఏమిటంటే అఖండమైన రాజయోగాలు ఆయన జాతకంలో ఉన్నాయి. ముఖ్యంగా పంచ మహాపురుష యోగాల్లో రెండు ప్రధాన యోగాలు ఆయన జాతకంలో ఉన్నాయి. అవే హంస యోగం, భద్ర యోగం.
బుధుడి కేంద్ర స్థితి వల్ల భద్ర యోగం ఏర్పడుతుంది. పైగా ఇది లగ్నంలో ఉండటం వల్ల పెద్ద పులి లాంటి గాంభీర్యం ఈ వ్యక్తుల్లో ఉంటుంది. పెద్ద పులి అడుగులు ఎలా ఉంటాయో, దాని ప్రవర్తన ఎలా ఉంటుందో అలా ఈ యోగం ఉన్నవారు ఉంటారు. గజ గమనం అంటే ఏనుగు మాదిరి నడక ఉంటుంది. ఇక హంస మహాపురుష యోగం. ఇది గురువు కేంద్ర స్థితి వల్ల ఉంటుంది. పైగా సప్తమ స్థానంలో గురువు స్వక్షేత్రంలో ఈ యోగం ఉంది. బుధుడు, గురువు స్వస్థానాల్లో కేంద్ర స్థితిలో ఉండటం వల్ల ఈ యోగాలు ఏర్పడ్డాయి. అలాగే కీలకమైన గజకేసరి యోగం ఉంది. గురువు, చంద్రుడు కలిసి సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఈ యోగం వచ్చింది. దీనివల్ల ధన స్థానం, సప్తమ స్థానం, రాజ్య స్థానం బలపడ్డాయి.
అలాగే లగ్నం నుంచి మూడో స్థానంలో రాహువు చాలా శక్తిమంతంగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులు కుటుంబ జీవితంలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా రాహువు మూడో స్థానంలో ఉన్నవారు ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో విజయం సాధిస్తారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వెనకడుగు వేయరు. వారు ఊహించిన మేరకు ఫలితాలు వస్తాయి. ఆయనకు ప్రస్తుతం రాహు మహాదశ నడుస్తోంది. 2026 వరకూ ఈ దశ కొనసాగుతుంది. మరో విషయం ఏమిటంటే మూడు గ్రహాలు స్వస్థానాల్లో ఉండటం విశేషం. ఆయన పుట్టిన సమయం మనకు కచ్చితంగా తెలియదు. ఆయన స్వభావం చూస్తుంటే సింహలగ్నం జాతకుడిలా కనిపిస్తుంది. ఒక వేళ ఆయనది సింహ లగ్నమే అనుకుంటే అది అఖండ సామ్రాజ్య యోగానికి దారితీస్తుంది.
గురువు పంచమ స్థానంలో స్వస్థానంలో ఉండటం వల్ల ఏ యోగం ఏర్పడుతుంది. పైగా ఇది సింహ, వృశ్చికం, కుంభ లగ్న జాతకులకు మాత్రమే ఉంటుంది. మనం మిధున లగ్నం ప్రకారం జాతకం చూడటం ఈ యోగాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఆయన జాతకంలో గజకేసరియోగం పంచమ స్థానంలో ఉంది. ఓవరాల్ గా ఆయన జాతకాన్ని చూస్తే ఆయన సున్నిత మనస్కులు. శని, రాహు, చంద్ర…కాంబినేషన్ సినిమా రంగంలో నటుడిని చేసింది. తండ్రి గ్రహం రవి శుక్రుడితో కలయిక. శని శుక్ర నక్షత్రమైన పూర్వాషాడలో ఉన్నాడు. సినిమా రంగంలో ఉన్నత స్థాయిని చేరుకోడానికి ఈ కాంబినేషన్ ఉపయోగపడింది.