మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని ఆయన కుమారుడు లోకేష్ నిలుపుతారా? ఆయనకు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందా? ఆయన జాతకం ఏం చెబుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. 23 జనవరి 1983న నారా లోకేశ్ జన్మించారు. ఆయనది భరణి నక్షత్రం మేష రాశి. భరణి శుక్ర నక్షత్రం. మిధున లగ్నం. లగ్నంలో రాహువు. జన్మ జాతక చక్రంలో శని ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఈ స్థానం కేంద్రం అయి ఉంటే శశ మహాపురుష యోగం ఏర్పడి ఉండిది. అయితే రాశి నుంచి కేంద్రంలో శని ఉన్నాడు కాబట్టి శశ మహాపురుష యోగం ఈయనకు వర్తిస్తుంది. ఈ యోగం ఉన్న వ్యక్తులు రాజుగా గాని, మంత్రిగా గాని ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరు ఏ పనిచేయడానికైనా వెనకాడరు.
రోషం కూడా ఎక్కువే. ఎవరినీ లెక్క చేయరుగానీ తల్లికి విధేయులుగా ఉంటారు. తేడా వస్తే దేనికైనా రెడీ అంటారు. రూలర్ గా ఉంటారు. 2009 నుంచి 2027 వరకు ఆయనకు రాహు మహాదశ, ఆ తర్వాత 2027 నుంచి 2043 వరకు గురు మహా దశ. ఆ తర్వాత 19 ఏళ్లు శని మహా దశ. శని ఉచ్ఛ రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ దశ యోగిస్తుంది. ఉచ్చలో ఉండటం, శుక్ర నక్షత్రం కావడం దీనికి ప్రధాన కారణం. 2062 వరకు ఈ శని మహాదశ జరుగుతుంది. శుక్ర, శని పరివర్తన. శని శుక్రుడి ఇంటిలో, శుక్రుడు శని ఇల్లయిన మకరంలో ఉన్నాడు.
ఈ పరివర్తన యోగం వల్ల శనికి రవితో సంబంధం ఏర్పడింది. 2025 ఏప్రిల్ నుంచి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. 2032వరకు ఇది కొనసాగుతుంది. 2040లో గోచార గురువు జాతక ఉచ్ఛ శనితో కలవడం ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించడానికి అవకాశం కల్పిస్తోంది. ఈయన జాతక చక్రంలో ఇబ్బంది పెట్టే గ్రహాలు కూడా ఏమీ లేవు. అందువల్ల నారా లోకేష్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మిధున లగ్నం కావడం వల్ల చాలా తెలివిగా రాజకీయ ఎత్తుగడలు వేస్తారు. రాజకీయ చతురత ఉంటుంది. లగ్నంలో ఉన్న రాహువు వల్ల ఆయనకు అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఈ విషయంలో ఆయన జాగ్రత్తగా ఉండాలి. 2040లో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి తీరతారు. 2030 నుంచి రాజకీయంగా అనేక ఉన్నత పదవుల్ని చేపట్టే అవకాశం ఉంది.