అందరి తలరాతనూ ఆ బ్రహ్మ దేవుడే రాస్తారంటారు. అలాంటి రాత ఉంటేనే కొందరు మహానేతలవుతారేమో. మన ప్రధాని నరేంద్ర మోడీ తలరాతను ఆ బ్రహ్మ దేవుడు ఏమని రాసి ఉంటారు? ఇంకా ఆయన ఎంత కాలం అధికారంలో ఉంటారు? ఈ విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
గుజరాత్ లో మేహసానా జిల్లాలోని వాద్ నగర్ లో 1950 సెప్టెంబరు 17 వ తేదీ ఉదయం 11 గంటలకు నరేంద్రమోడీ జన్మించారు. వికృతి నామ సంవత్సరం, భాద్రపద మాసం ఆదివారం కృష్ణ పక్షంలోని షష్ఠి తిథి, అనూరాధ నక్షత్రం 2 వ పాదంలో ఆయన జన్మించారు. పరాశర, భృగునాడీ పద్ధతిలో నరేంద్ర మోడీ జాతకాన్ని విశ్లేషణ చేసి తెలుసుకుందాం.
జాతక విశ్లేషణ
వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం.. ఇదీ ఆయన జాతకం. అనూరాధ నక్షత్రం అంటేనే శని భగవానుడి నక్షత్రం. అందువల్ల ఆయన శని మహర్దశలో శుక్రుడి అంతర్ధశతో ఆయన జీవితం ప్రారంభమైంది. వృశ్చిక లగ్నానికి అధిపతి అయిన కుజుడు లగ్నంలోనే స్వస్థానంలో ఉన్నాడు. ఆ కుజుడితో చంద్రుడు కూడా ఉండటం చంద్ర మంగళ యోగానికి దారితీసింది. మూడు అద్భుతమైన యోగాలు ఆయన జీవితాన్ని నిర్దేశించాయి. ఆ మూడు యోగాల్లో ప్రధానంగా గజకేసరి యోగాన్ని ప్రస్తావించాలి. ఆయన జన్మ జాతక చక్రంలో గురువు కుంభ రాశిలో ఉన్నాడు.
గురువు నుంచి కేంద్ర స్థానమైన 10 వ రాశి వృశ్చికంలో చంద్రుడు ఉండటంతో గజకేసరి యోగం ఏర్పడింది. ఈ లగ్నానికి రెండో స్థానం అధిపతిగా, అయిదో స్థానం అధిపతిగా గురువు ఉన్నాడు. రెండో స్థానం వాక్కు, ధనం లాంటివి వస్తాయి, ఇక అయిదో స్థానం సంతానం, పూర్వపుణ్యం, మంత్ర స్థానం అవుతుంది. సంతాన స్థానంలో రాహువు కొంత ఆ భావాన్ని పాడుచేశాడు. చంద్రుడిని తీసుకుంటే భాగ్య స్థానం అధిపతి అయ్యాడు. ఆయన జాతకంలో ఈ మూడు స్థానాలు గజకేసరి యోగం వల్ల బలపడ్డాయి. మరో ముఖ్యమైన యోగం బుధాదిత్య యోగం.
ఆయన పూర్తి జాతకాన్ని ఈ వీడియోలో చూడండి
బుధుడు, రవి కన్యా రాశిలో ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడింది. పైగా బుధుడు ఉచ్ఛ స్థానంలో ఉండటం వల్ల ఆయన జాతకంలో ఇది విశిష్ట యోగమైంది. రాజ్యస్థానాధిపతి అయిన రవి ఈ యోగంలోనే ఉన్నాడు. దీంతో పాటు బుధుడు 8, 11 స్థానాలకు అధిపతి అయ్యాడు. మంచి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ఈ యోగం ఆయనకు ప్రసాదిస్తుంది. మూడో యోగం చంద్ర మంగళ యోగం. లగ్నాధి పతి కుజుడు సొంతరాశిలో చంద్రుడితో ఉండి ఈ యోగాన్ని ఇస్తున్నాడు. చంద్రుడికి వృశ్చికం నీచ రాశి. అయినా కుజుడితో కలవడం వల్ల ఇది నీచభంగ రాజయోగంగా కూడా మారింది. కర్మ కారకుడు శని సింహరాశిలో ఉండటం, ఆ రాశి అధిపతి రవి బుధాదిత్య యోగంలో ఉండటంతో ఆయన జీవితం రాజకీయ మలుపు తిరగటానికి కారణమైంది.
ఈయన జాతకాన్ని పరిశీలిస్తే బాల్యమంతా కష్టాలతోనే నిండినట్లు కనిపిస్తోంది. శని నక్షత్రం కావడంతో జీవితం శని మహాదశతోనే ప్రారంభమైంది. అందువల్ల ఆయన బాల్య జీవితం అంతా కష్టాల మయమే. విద్యా కారకుడు బుధుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కాకపోతే కేతువుతో ఉండటంవల్ల చదువు ఆటంకాలతోనే ముందుకు సాగింది. కానీ ఆధ్యాత్మిక విద్య విషయంలో కేతువు ఆయనకు సహకరించాడు. ఈ బుధ కేతువుల కలయికే ఆయనను మహా జ్ఞానిగా మార్చాయి. ఆయనలోని దైవిక శక్తులను ఈ గ్రహస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.
1961లో శని మహాదశ ముగియడంతో ఆయన జీవితం మంచి మలుపు తిరిగింది. అక్కడి నుంచి బుధ మహాదశ ప్రారంభమైంది. ఈ దశ దాదాపు 17 ఏళ్ల పాటు అంటే 1978 వరకూ కొనసాగింది. ఆ తర్వాత 1985 వరకు కేతు మహాదశ కొనసాగింది. అనంతరం వచ్చిన శుక్రమహర్దశ 20 ఏళ్ల పాటు నడిచింది. మోడీ జీవితంలో ఇది ఓ కీలక దశ. 2005 వరకు కొనసాగిన ఈ దశలోనే మోడీ రాజకీయంగా కీలక పదవులను అనుభవించారు. నిజానికి శుక్రుడు ఈ లగ్నానికి పాపి. యోగించే అవకాశం లేదు. శుక్రుడు శనితో కలిసి సంహరాశిలో ఉండటం, సింహరాశి అధిపతి రవి బుధాదిత్య యోగంలో ఉండటం ఆయనకు విశేషంగా యోగించిందని అనుకోవచ్చు. వాటితో పాటు ఇందాక మనం అనుకున్న మూడు మంచి యోగాలు ఆయన జీవితాన్ని అత్యున్నత స్థితికి మలుపుతిప్పేశాయి.
సాధారణంగా ఏలినాటి శని అనగానే అందరూ అమ్మో అనేస్తారు.. కానీ మన మోడీ గారు అదే ఏలినాటి శనిలో ప్రధాని అయ్యారనే సంగతి ఎంతమందికి తెలుసు? మొన్న జనవరి వరకూ ఆయనకు ఏలినాటి శని నడిచింది. అంటే దాదాపు 2013 నుంచి ఆయనకు ఏలినాటి శని నడిచింది. ఏలినాటి శనిలోనే 2014, 2019లో మొత్తం రెండు దఫాలు ఆయన ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏలినాటి శని గురించి ఎవరూ భయపడకూడదు. దీనికి ఉదాహరణ మోడీ జాతకమే. ఆయన జాతక బలం ఎంత గొప్పదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మోడీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
నరేంద్ర మోడీ ఇంకా ఎంత కాలం ప్రధానిగా ఉంటారు? ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? లాంటి ఎన్నో సందేహాలు చాలామందికి ఉన్నాయి. భారత దేశం వేదభూమి. ఎందరో పుణ్యపురుషులు జన్మించిన యోగ భూమి ఇది. అందరి ఆశీర్వాద బలం ఆయనకు ఉంది. వచ్చే నవంబరు 21 నుంచి ఆయన జాతకంలో కొంత గురుబలం తగ్గుతోంది. ఈ ప్రభావం దాదాపు ఆరు నెలల పాటు ఉంటుంది. ఆ తర్వాత 2021 జూన్ నుంచి మళ్లీ మోడీ ప్రభ వెలిగిపోతుంది. వచ్చే ఆరు నెలల కాలంలో ఆయన కొంత అనారోగ్యానికి గురయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన తల్లిగారి ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఆయన జాతకం ప్రకారం చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. జాతకం ప్రకారం చంద్రుడిని మాతృకారకుడిగా చెబుతారు.
ప్రస్తుతం గోచార రీత్యా వృశ్చిక రాశిలో కేతువు ఉన్నాడు. ఏడాదిన్న పాటు కేతువు ఇక్కడే చంద్రుడితో ఉంటాడు. ఈ రాశిలో కేతువు ఉన్న సమయమంతా ఆయన తల్లిగారికి బాగుండదు. ఎందుకంటే భృగు సూత్రాలరీత్యా మోడీగారి జన్మ జాతక చక్రంలో మీన రాశిలో రాహువు ఉన్నాడు. ఈ రాహువు, గోచార కేతువు ప్రభావం చంద్రుడి మీద ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ఆయన మాతృమూర్తి ఆరోగ్య పరిస్థితి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంతకుమించి మోడీ జాతకంలో ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవు. ఆయన జాతకంలో పూర్వపుణ్యబలం ఎక్కువగా ఉంది. రాజకీయంగా ఆయన తిరుగులేని శక్తి అనడంలో రెండో అభిప్రాయానికి తావు లేదు.
– హేమసుందర్ పామర్తి