దేశంపై బర్డ్ ఫ్లూ విరుచుకుపడుతోంది. తొలుత రాజస్థాన్ లో బయటపడిన ఈ వైరస్.. క్రమంగా విస్తరిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళలోనూ వరుసగా కేసులు బయల్పడుతుండడంతో.. కేంద్ర అప్రమత్తమైంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ అప్రమత్తం చేస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు, కాకులు, బాతులు మృత్యువాత పడ్డాయి. రోజురోజుకీ ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో నెమళ్లు మృత్యువాతపడుతున్నాయి. కానీ, ఇక్కడి ప్రభుత్వం మాత్రం దానికి వేరే కారణాలను చూపుతోంది.
4 లక్షల కోళ్లు మృత్యువాత
హర్యానాలో గత పది రోజుల్లోనే 4 లక్షలకు పైగా పౌల్ట్రీ కోళ్లు చనిపోపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కోళ్లన్నీ ఒక్క పంచకుల జిల్లాలోనే మృతి చెందడం గమనార్హం. కొన్ని కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు.. వాటిని జలంధర్ రీజినల్ డిసీస్ డయాగ్నసిస్ ల్యాబ్కు పంపించారు. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్లో కేసులు బయటపడ్డాయి. మంగళవారం జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్లోనూ కొన్ని కేసులు బయటపడ్డాయి. ఈ సీజన్లో మన దేశానికి విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో వలస పక్షులు వస్తాయి. ఈ నేపథ్యంలో.. వాటి రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఈ వైరస్ మనుషులకు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టంచేసింది.
కోడికి మళ్లీ గడ్డుకాలం?
నిన్న మొన్నటి వరకు కరోనా దెబ్బతో పాతాళానికి పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ సమయంలో మళ్లీ బర్డ్ ఫ్లూ రూపంలో మరో ముప్పు కోళ్లకు పొంచివుంది. దీంతో.. పౌల్ట్రీ యజమానులు కలవరపాటుకు గురవుతున్నారు. కరోనా కాలంలో వేల కొద్దీ కోళ్లను గోతులు తీసి పాతి పెట్టిన దృశ్యాలను తలచుకొని భయబ్రాంతులకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూ మరింత విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని, చికెన్ ధరలపై దాని ప్రభావం పడకుండా ముందుజాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కోడి మాంసం తినవచ్చా?
బర్డ్ ఫ్లూ పేరు వినగానే కొంత కాలం కోడి మాంసం మానేద్దాం అంటుంటారు. కానీ నిజంగా మానేయాలా? ఒకవేళ తినాలంటే ఎలా తినాలి? ఎలా వండాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి మనసులో. బడ్ ఫ్లూ కారణంగా కోడి మాంసం మానేయాల్సిన అవసరం లేదు. కానీ తినాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు మాత్రం కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మార్కెట్ నుండి తెచ్చిన మాంసం శుభ్రం చేసే సమయంలో కాస్త నిమ్మరసం, ఉప్పు, పసుపు వేస్తే మంచిది. వీటి వల్ల బ్యాక్టీరియా, జెమ్స్ లాంటి వాటిని దూరం చేయచ్చు. ఇక కోడి మాంసం మాత్రమే కాదు.. గుడ్లు కూడా బాగా శుభ్రం చేసి తర్వాతే ఉడికించాలి. కోడి మాంసం 165 డిగ్రీల వద్ద వండుకుంటే వైరస్ నశిస్తుంది. ఇంకో మార్గం కూడా ఉంది. 70 డిగ్రీల వద్ద 30-45 నిమిషాల పాటు ఉడికించినా సరిపోతుంది. వైరస్ ప్రభావం ఉండదంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ.. కోడి మాంసం ఆహారంగా భాగంగా తీసుకోవచ్చు.
Must Read ;- ఈ ఆహారంతో ప్రణాళిక లేని గర్భధారణకు చెక్ పెట్టవచ్చు