మనం గుడికి వెళ్లిన ప్రతిచోటా నవగ్రహ మందిరాలు ఉంటాయి. చాలా మంది ఆ గుడిలో మూల విరాట్టును దర్శించుకుని నవగ్రహాల జోలికి పోకుండా వచ్చేస్తుంటారు. దీనికి కారణం వాటి అనుగ్రహాన్ని పొందటానికి మనం ఏం చేయాలనేది సరిగా తెలియక పోవడమే. ప్రదక్షిణలు చేయడంలో కూడా భక్తులకు అనేక సందేహాలు కలుగుతుంటాయి. ఈ సృష్టిలో భగవంతుడికి ఎంత శక్తి ఉందో, భగవంతుడి ప్రతిరూపాలైన నవగ్రహాలకు కూడా అంతే శక్తి ఉంది. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే వాటిని ప్రసన్నం చేసుకోవడం సులువు. అయితే ఈ ప్రదక్షిణలు ఎన్ని చేయాలి? ఎలా చేయాలి అనే విషయంలో కూడా అనేక సందేహాలు ఉన్నాయి. ముందు ఆ విషయాలు తెలుసుకుందాం.
నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నియమాలు పాటించాలి. నవగ్రహ ప్రదక్షిణలకు కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారమే ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మనిషి మనుగడ, వారి జీవన విధానం, మానసిక స్థితిగతులు అన్నీ ఈ నవ గ్రహాల మీదనే ఆధారపడి ఉంటాయి. జీవితంలోని అనేక సమస్యలకు ఈ నవగ్రహాలే కారణమని జ్యోతిష శాస్ర్తం చెబుతోంది. నవగ్రహ ప్రదక్షిణ అనేది మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. ఈ ప్రదక్షిణలు చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మండపంలోకి వెళతాం కదా.. లోపలికి వెళ్లాక ఎడమ వైపు నుంచి.. అంటే క్లాక్ వైజ్ కుడి వైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. కుడి భాగం సూర్యుడికి, ఎడమ భాగం చంద్రుడికి సంబంధించినవిగా భావించాలి.
* అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు కొంతమంది నవగ్రహాల ప్రతిమలను తాకుతుంటారు. అలా తాక కూడదు. తాక కుండానే ప్రదక్షిణలు పూర్తి చేయాలి. * తొమ్మిది ప్రదక్షిణలూ పూర్తయ్యాక కుడి వైపు నుంచి ఎడమ వైపు.. అంటే బుధుడి వైపు నుంచి రాహు, కేతువులను ధ్యానిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.
* మీరు చేసే తొమ్మిది ప్రదక్షిణలలోనూ ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో గ్రహాన్ని స్మరించుకోండి.
* ప్రదక్షిణలన్నీ పూర్తయ్యాక నవగ్రహాలకు మీ వీపును చూపించకుండా మీరు వెనక్కి రావాల్సి ఉంటుంది. చాలా మంది ఇలా చేయరు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
* ఇక చాలామంది వేళా పాళా లేకుండా ప్రదక్షిణలకు వెళుతుంటారు. మీరు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి మాత్రమే ప్రదక్షణకు వెళ్లాలి.
* శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన మండపం ఉంటుంది. మనం గుడిలోకి వెళ్లగానే ముందు మూల విరాట్టును దర్శించుకుని ఆ తర్వాత మాత్రమే నవ గ్రహ దర్శనానికి వెళ్లాలి.
నవగ్రహాల ప్రదక్షిణం చేసే టప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మీకు ఓ శ్లోకం చెబుతాను. దాన్ని చదువుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. అదేంటంటే..
Must Read ;- ప్రతి తిథీ కార్తిక మాసంలో ప్రత్యేకమే
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:
అని చదువుకుంటూ తొమ్మిది ప్రదక్షిణలు పూర్తి చేయాలి.
9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు.. అంటే మొత్తం 11 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. రాహుకేతువులకు ప్రత్యేకంగా ఎందుకంటే అవి ఛాయా గ్రహాలు. జ్యోతిష శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహాలు. రాహుకేతువులను సంతృప్తి పరచడం వల్ల మన జీవితంలో ఒడుదొడుకులు ఉండవు. ప్రదక్షిణ చేసేటప్పుడు ఆయా రాశ్యాధిపతులైన నవగ్రహాలను స్మరించుకుంటే మంచిది. తొమ్మిదో ప్రదక్షిణ పూర్తి చేశాక ప్రత్యేకంగా రాహుకేతువులకు మరో రెండు ప్రదక్షిణలు అపసవ్యంగా అంటే ఇంతకుముందు మీరు తిరిగిన దానికి వ్యతిరేక దిశలో ప్రదక్షిణ చేయాలి. విన్నారు కదా నవగ్రహాలకు ఎలా ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడంవల్ల సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి.
ప్రదక్షిణ విషయంలో సందేహాలు
* నవ గ్రహ ప్రదక్షిణలు చేసి తిరగి వచ్చేటప్పుడు కాళ్లు కడుక్కుంటారు చాలా మంది. ఇలా చేయాలని ఏ ధర్మ శాస్ర్తంలోనూ చెప్పలేదు. ఆలయం లోపలికి వెళ్లే ముందే కాళ్లు కడుక్కోవాలి తప్ప నవగ్రహ ప్రదక్షిణలు అయ్యాక కాదు. కాళ్లు కడుక్కోవడ అంటే స్నానం చేయడంతో సమానం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
* కేవలం నవ గ్రహాల అనుగ్రహం కోసమే వెళ్లే వారైతే మూల విరాట్టును దర్శంచుకోడానికి ముందే నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోవాలి. ఆ తర్వాత మూల విరాట్టును దర్శించుకోవచ్చు.
* ఆలయం నుంచి సరాసరి ఇంటికే వచ్చేయాలి తప్ప వేరొకరి ఇంటికి వెళ్ల కూడదు. మధ్యలో దుకాణం దగ్గరగానీ, ఇతర చోట్ల కానీ ఆగకూడదు. మధ్యలో బాతాఖానీలుపెట్టకూడదు. విన్నారు కదా మరో కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం.
– హేమసుందర్ పామర్తి
Also Read ;- ఆలయంలో ముద్దులు.. మరో వివాదంలో నెట్‌ఫ్లిక్స్!