గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో పూర్తిగా చతికిలబడిపోయినట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బల్మూరి వెంకట్‌పై పెద్దగా వ్యవతిరేకత లేకున్నా కూడా ఆ పార్టీకి కనీస స్థాయిలో కూడా ఓట్లు పడలేదు. గత ఎన్నికల్లో దాదాపుగా 60 వేల పైచిలులు ఓట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కనీసం 1,500 ఓట్లైనా సాధిస్తుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఉప ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా పదో రౌండ్ పూర్తి అయ్యేసరికి బల్మూరికి కేవలం 1,349 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పెద్దగా ఓట్లు దక్కే అవకాశాలు లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పాడి చర్యతోనే ఈ పరిస్థితా..?
కాంగ్రెస్ పార్టీ ఇంతలా దిగజారిపోవడానికి చాలా కారణాలే వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2018 ఎన్నికల్లో ఈటల చేతిలో ఓడిపోయిన పాడి కౌశిక్ రెడ్డే బరిలోకి దిగుతారన్న వాదనలు వినిపించాయి. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి దగ్గరి బంధువు అయిన కౌశిక్ రెడ్డి పార్టీలో మంచి గుర్తింపే దక్కించుకున్నారు. ఉత్తమ్‌ను చూసుకునే ఆయన తనదైన శైలిలో స్వైర విహారం చేశారన్న వాదనలు వినిపించాయి. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు చాలా ముందుగానే.. ఆయన టీఆర్ఎస్ ట్రాప్‌లో పడిపోయారు. ఓ వైపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తానేనని ప్రచారం చేసుకుంటూనే.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో రహస్య మంతనాలు సాగించారు. ఈ విషయం స్వయంగా ఆయనే తన ఫోన్ కాల్ ద్వారా బయటపెట్టుకోగా.. కాంగ్రెస్ పార్టీ షాక్ తిన్నది. పార్టీ తేరుకుని పాడిపై చర్యలు తీసుకోవడానికి కొన్ని గంటల ముందు ఆయన టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అంతేకాకుండా కొత్తగా పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. మొత్తంగా పార్టీ శ్రేణులను పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర అయోమయంలో పడేశారని చెప్పాలి.
రేవంత్ చర్యలు ఫలించలేదా?
హుజూరాబాద్ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. రేవంత్ రాకతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. అయితే హుజూరాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో రేవంత్ సహా ఇతర నేతలు అంతగా దృష్టి సారించలేదా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్ మధ్య సాగుతున్న ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ గనుక బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి ఉంటే.. ఏ ఒక్కరూ ఊహించని ఫలితాలు వచ్చి ఉండేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్థిత్వంపై రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్లుగా సమాచారం. టికెట్ కూడా ఆమెకే దక్కుతుందన్న వాదనలూ వినిపించాయి. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. జాబితా నుంచి కొండా పేరు వెనక్కి వెళ్లగా.. పార్టీకి నిబద్ధత కలిగిన యువకుడిగా కనిపించిన బల్మూరి వెంకట్‌ను రేవంత్ ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడే రేవంత్ రాంగ్ స్టెప్ వేసినట్టుగా విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ తర్వాత కూడా పార్టీ అభ్యర్థి విజయం కోసం కాకుండా.. ఇంటికో ఓటు మాత్రమే తమ పార్టీకి వేయాలంటూ రేవంత్ ఇచ్చిన పిలుపు కూడా పార్టీకి తీరని నష్టం చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- రేవంత్‌కు ‘పట్టు’ చిక్కినట్టేనా?