కరోనా కారణంగా ఐదు నెలల పాటు నగరంలో మెట్రో సేవలకు బ్రేక్ పడింది. అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వడంతో ఈనెల 7 నుండి మెట్రో రైలు సేవలు పునఃప్రారంభమయ్యాయి. కానీ జనాలు మెట్రో రైళ్లలో ప్రయాణం చేయాలంటేనే వణుకుతున్నారు. అసలే నగరంలో ప్రతి రోజూ దాదాపు 500 వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో ఎక్కాలంటెనే జనం జంకుతున్నట్లు తెలుస్తోంది.
మెట్రోలో ప్రయాణించి కరోనాను అంటించుకోవడం ఎందుకని సొంత వాహనాలు, క్యాబ్‌లు, ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణమంటేనే వామ్మో…మెట్రో జర్నీనా! అనేలా ప్రయాణికులు వ్యవహరిస్తున్నారు.
సోమవారం ప్రారంభమైన మియాపూర్ టు ఎల్‌బినగర్ మార్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువగా కేవలం 19 వేల మంది మాత్రమే ప్రయాణికులు మెట్రో సేవలను ఉపయోగించుకున్నారు. నాగోల్ టు రాయదుర్గం, జెబిఎస్ టు ఎంజిబిఎస్, మియాపూర్ టు ఎల్‌బినగర్ మార్గాల్లో అత్యంత రద్దీగా ఉండే మార్గం మియాపూర్ టు ఎల్‌బినగర్. బిఫోర్ కరోనాలో ఈ మార్గంలో నిత్యం సుమారు 70 వేలకు పైగానే ప్రయాణికులు ప్రయాణించేవారు. పండగలు, పెళ్లిళ్ల సీజన్, సెలవుల దినాల్లో ఆ సంఖ్య లక్షకు పైగా కూడా దాటేది. దాదాపు ఐదు నెలల తరువాత మెట్రో సేవలు నగరవాసులకు అందుబాటులో లేవు. అలాగే నగరంలో సిటీ బస్సలు కూడా తిరగడంలేదు. ఇలాంటి నేపథ్యంలో మెట్రో సేవలు ప్రారంభమైనా…వాటికి ప్రయాణికుల నుంచి ఆదరణ కరువైందనే చెప్పుకోవాల్సి ఉంటుంది.
విడుతల వారీగా మెట్రో రైళ్లను నడిపిస్తున్నారు. మొదటి విడతలో భాగంగా సోమవారం కారిడార్ 1 అయినటువంటి మియాపూర్ నుంచి ఎల్‌బినగర్(29 కి.మీ.) మార్గంలో దాదాపు 120 వరకు ట్రిప్పులను నడిపిస్తూ మెట్రో సేవలు జనాలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రోజు(మంగళవారం) నుంచి కారిడార్3 నాగోల్ టు రాయదుర్గంలో మెట్రో సేవలు ప్రారంభం చేస్తున్నట్లు మెట్రో ఎండి తెలిపారు. అలాగే బుధవారం నుంచి కారిడార్2 అయినటువంటి జెబిఎస్ టు ఎంజిబిఎస్ మార్గంలో మెట్రో రైళ్లు నడవనున్నాయి.
సాధారణ రోజుల్లో నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే మెట్రో రైళ్లు ఇప్పుడు జనంలేక వెలవెల బోతున్నాయి. మెట్రో సేవలకు ప్రయాణికుల నుంచి స్పందన కరవైంది. కరోనా నేపథ్యంలో క్లోజ్డ్ గా ఉండే మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు జనాలు మొదటి రోజు ఆసక్తి చూపలేదు. తక్కువ సంఖ్యలోనే ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు వెళ్లారు. మనదగ్గరనే కాదు… ఢిల్లీ మెట్రోలో సైతం ఇదే పరిస్థితి కనిపించింది. మరోవైపు మెట్రో అధికారులు మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందని మిడియాతో పేర్కొన్నారు.