రాప్తాడు పాఠశాలలో ఉన్మాది దా*డిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని గోపిక ఘటనపై మంత్రి నారా లోకేష్ అత్యంత వేగంగా, మానవీయ కోణంలో స్పందించారు. ఘటన తెలిసిన వెంటనే బాలికను అత్యవసర చికిత్స నిమిత్తం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేయించిన ఆయన, ప్రతిక్షణం డాక్టర్లతో పర్సనల్ ఫాలోఅప్ చేస్తూ ఆరోగ్యంపై అప్డేట్స్ తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు తన ఎక్స్ వేదికగా చిన్నారి చికిత్స వివరాలను పంచుకుంటూ పర్యవేక్షణ కొనసాగించారు.
అంతటితో ఆగకుండా, నారా లోకేష్ స్వయంగా బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. ఉన్మాది ఘాతుకానికి గాయపడిన చిన్నారి పరిస్థితిని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం, పార్టీ తరఫున బాధిత కుటుంబానికి సంపూర్ణ అభయం ఇస్తూ, ఏ అవసరం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా సంకోచించకుండా నేరుగా నాకు ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి అని తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను సదరు చిన్నారి తండ్రికి స్వయంగా అందించారు.
రాష్ట్ర మంత్రిగా మాత్రమే కాకుండా, కుటుంబ పెద్దన్నగా వారి కష్టసుఖాల్లో అండగా ఉంటానని లోకేష్ మాట ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో బాధిత కుటుంబానికి పూర్తి స్థాయి ఆర్థిక, మానసిక మద్దతు ఇస్తామని, పాప కోలుకుని పూర్తి న్యాయం జరిగే వరకు నిరంతరం ఫాలోఅప్ చేస్తానని స్పష్టం చేశారు. మంత్రి నేరుగా వచ్చి పరామర్శించి, పర్సనల్ నంబర్ ఇవ్వడంతో ఆందోళనలో ఉన్న కుటుంబసభ్యుల్లో కొండంత ధైర్యం నిండింది.
చిన్నారికి అత్యంత మెరుగైన ఉచిత వైద్యం అందేలా లోకేష్ చేసిన ముందస్తు ఏర్పాట్లు, ఆయన చూపిన ఈ ప్రత్యేక చొరవ పట్ల హర్షం వ్యక్తమవుతోంది. నాయకుడంటే పాలించడమే కాదు..కష్టాల్లో ఉన్న ప్రజల పక్కన నేరుగా నిలబడటం అని లోకేష్ నిరూపించారని పలువురు ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఉన్మాదిని 24 గంటల్లోనే చట్టం ముందుకు తీసుకురావడం, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత చిన్నారికి మెరుగైన చికిత్స అందించేలా లోకేష్ చేసిన నిరంతర పర్యవేక్షణ, ఆయన చూపిన చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.











