తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అప్పట్లో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ IAS అధికారి డా. పి.వి. రమేష్ కీలక విషయాలు బయటపెట్టారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక రాజకీయ కక్షసాధింపు ఉద్దేశాలు ఉన్నాయని, ఆ ప్రాజెక్ట్‌లో చట్టపరంగా గానీ, ఆర్థికపరంగా గానీ ఎలాంటి అవినీతి, తప్పు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కేసు అసలు ప్రస్థానం, చంద్రబాబు అరెస్ట్ వెనక జరిగిన పరిణామాలపై స్పష్టతనిచ్చారు.
జర్మనీకి చెందిన అంతర్జాతీయ సంస్థ సీమెన్స్ ఇండియా ప్రతినిధులు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుని కలిసి భారీ ప్రతిపాదన తెచ్చారని చెప్పారు. తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ – CSR కింద సుమారు ₹2,700 కోట్ల విలువైన శిక్షణా కార్యక్రమాలను అందించడానికి ముందుకు వచ్చారు. అయితే, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ₹300 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనపై ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో పరిశీలన జరిపిందని పి.వి. రమేష్ తెలిపారు. కేబినెట్ ఆమోదం పొంది, అసెంబ్లీలో బడ్జెట్లో నిధులు కేటాయించిన తర్వాతే నిధులు విడుదల చేయడం జరిగిందని చెప్పారు. నిధులు విడుదల చేసే సమయంలోనూ అన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సరిచూసుకుని, జాయింట్ అకౌంట్/ఎస్క్రో అకౌంట్ ద్వారా ఇన్వాయిస్లను బట్టి డబ్బు విడుదల చేయాలని తాను స్వయంగా ఫైల్‌పై నోట్ రాసినట్లు ఆయన గుర్తుచేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చట్టపరంగా లేదా న్యాయపరంగా ఎటువంటి తప్పు జరగలేదని పి.వి. రమేష్ తేల్చిచెప్పారు. కేవలం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రికార్డులను, అధికారుల షాడో ఫైళ్లను అడ్డంపెట్టుకుని చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం తప్పు అని అభిప్రాయపడ్డారు. డబ్బు సీమెన్స్ కంపెనీకి వెళ్లిన తర్వాత అక్కడ ఏమైనా అక్రమాలు జరిగాయా లేదా అనేది పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన CID..కేవలం సీఎం మీటింగ్ పెట్టారన్న ఒక్క కారణంతో అరెస్ట్ చేయడం సరికాదని, దీని వెనుక పూర్తిగా రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.
మొత్తానికి, ప్రభుత్వ విధానపరంగా, చట్టబద్ధంగా అప్రూవ్ అయిన ప్రాజెక్ట్‌ను రాజకీయ లబ్ది కోసం తప్పుగా చిత్రీకరించారని, ఈ కేసులో ఎలాంటి అవినీతికి ఆస్కారమే లేదని పి.వి. రమేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.











