ఓవైపు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెబుతున్న ఏపీ సర్కారు.. కేంద్రం అమలు చేస్తున్న ప్రైవేటీకరణ కార్యక్రమానికి పూర్తిగా సహకరించేందుకు మరో అడుగు వేసింది. దేశంలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేవలం ఏపీ నుంచే ఇలాంటి ముందడుగు పడిందని చెప్పవచ్చు.
ఏపీలో ఇన్‌క్యాప్ ఏర్పాటు..
నష్టాల్లో ఉన్నాయన్న కారణంతోపాటు నిరర్దక ఆస్తులు పేరుకుపోయిన సంస్థలు, కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్నికేంద్రం మరింత వేగిరం చేసింది. ఇందుకు గాను రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పెట్టుబడుల ఉప సంహరణను మరింత వేగిరం చేసే చర్యల్లో భాగంగా ఏపీలో నోడల్ ఏజన్సీ కూడా ఇప్పటికే ఏర్పాటైంది. జాతీయ ఆస్తులు, సంస్థల నుంచి వేర్వేరు మార్గాల్లో నిధుల సమీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ వంటి లావాదేవీలను పర్యవేక్షించేందుకు ఏపీలో నోడల్ ఏజెన్సీగా ఇన్‌క్యాప్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
లక్ష్యం రూ.1.75లక్షల కోట్లు..
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.1.75లక్షల కోట్ల నిధుల సేకరణను కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రహ్మణ్యం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.10 లక్షల కోట్లను టార్గెట్‌గా పెట్టుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష్య సాధన కోసం ప్రతిపాదిత ఎల్ఐసీ ఐపీఓ ద్వారా ప్రభుత్వం రూ.1 లక్ష కోట్లు సేకరించవచ్చని, బీపీసీఎల్ ప్రైవేటీకరణ, ఎల్ఐసీ లిస్టింగ్ ద్వారా మరో రూ.75వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఆ దిశగా కార్యకలాపాలు ముమ్మరం చేసింది.
మార్గదర్శకాలు జారీ..
పెట్టుబడుల ఉప సంహరణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శాంతి భద్రతల అంశాలకు సంబంధించి నీతి ఆయోగ్ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో భాగంగా కేంద్రం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటీకరణకు సిద్ధమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల విక్రయాల ద్వారా నిధుల సమీకరణ కోసం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ప్రాజెక్టు (NMP) ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే నోడల్ ఏజెన్సీగా రాష్ట్రంలో ఏపీ ఇన్‌క్యాప్ సంస్థ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా NMP ద్వారా మాత్రమే పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తులను నగదుగా మార్చే ప్రక్రియ, నిధుల సేకరణ జరగాలని, అందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో ఈ నోడల్ ఏజన్సీ ఏర్పాటైంది. మార్చి 9న రాష్ట్రాలకు ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
వీటిని కూడా చేర్చి..
పెట్టుబడుల ఉపసంహరణతో పాటు ఖాయిలా పడిన సంస్థల మూసివేత, వాటి ఆస్తుల నగదీకరణ జాబితాపైనా చర్చ నడుస్తోంది. రాష్ట్ర రహదారులు, ఎక్స్ ప్రెస్ వే లు,ట్రాన్స్ మిషన్ టవర్లు, డిస్కమ్‌లు, విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు, మైనర్ పోర్టులు, రాష్ట్ర ఎయిర్ పోర్టులు, జల రహదారులు, జెట్టీలు, లాజిస్టిక్ పార్కులు, బస్ టెర్మినళ్లు, క్రీడా స్టేడియంలు, గోదాములు తదితర ఆస్తుల్ని గుర్తించాల్సిందిగా కేంద్రం సూచించింది. వీటితోపాటు రాష్ట్రాల్లో ఉన్న సంస్థల జాబితా విషయంలోనూ కొన్ని సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్టీసీ లాంటి సంస్థలను ఆ జాబితాలో చేర్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓ వైపు ఉద్యమం నడుస్తుండగానే ఏపీలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
Must Read ;- ముందుగా విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రకటన