పలువురు దక్షిణాది తారలతో పాటు బాలీవుడ్ తారలు ఇప్పడు మాల్దీవులకు క్యూ కట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు డజను మంది ఒకే సమయంలో అక్కడ సేద తీరుతుండటం ఓ విశేషం. అనునిత్యం షూటింగులతో బిజీగా ఉండే కాస్త తీరిక దొరికితే కొత్త వాతావరణంలో విహారం చేయాలని చాలామంది తారలు కోరుకుంటుంటారు. దాదాపు ఎనిమిది నెలల పాటు కరోనా కారణంగా అన్ని బాషల షూటింగులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ నిబంధనల మేరకు తిరిగి కొన్ని సినిమాల చిత్రీకరణలు ప్రారంభమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వ అన్ లాక్ ప్రక్రియలో భాగంగా స్వదేశీ విమానాలే కాదు విదేశాలకు విమానాలు తిరుగుతుండటంతో షూటింగ్ గ్యాప్ ఉన్న తారలు ఎంచక్కా ఎంజాయ్ చేసేందుకు మాల్దీవులకు చెక్కేశారు. చాలాకాలం పాటు షూటింగుల వత్తిడి లేకపోయినా ఇన్నాళ్లు బయటకు రాకుండా ఇళ్ల వద్దే ఉండిపోవడంతో చాలా బోర్ కొట్టేసినట్లుందేమో! ఒక్కసారిగా చాలామంది తారలు కరోనా ప్రభావం అంతగా లేని, అంత్యంత సుందర సముద్ర తీరమైన మాల్దీవులను ఎంపిక చేసుకున్నారు. ఇందులో భాగంగా కొందరు తమ కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి పయనం కాగా ఇంకొందరు తమ భర్తలతోను, బాయ్ ఫ్రెండ్స్ తోనూ ఆనందంగా గడుపుతున్నారు.
ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ తో కలిసి మాల్దీవులలో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ తన కుటుంబ సభ్యులతో మాల్దీవులలో గడుపుతున్నారు. వీరి సంగతి అలావుంటే ఇప్పుడు ఆ జాబితాలో నాగచైతన్య, సమంత దంపతులు చేరారు. నవంబర్ 23న చైతూ పుట్టినరోజు కావడంతో యువ దంపతులిద్దరూ కాస్త ముందుగా మాల్దీవులకు చేరుకొని… అక్కడి బీచ్ లో ఎనలేని ఆనందంతో సందడి చేస్తున్నారు. ఇక మరో తార ప్రణీత కూడా మాల్దీవులకు చేరుకొని సముద్రపుటంచుల్లో స్విమ్మింగ్ చేస్తున్నారు.
ఇక ఈ వరుసలోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కొందరు బాలీవుడ్ తారలు సైతం మాల్దీవులలో షికారు చేస్తున్నారు. ఈ వరుసలో నేహా ధూపియా తన భర్త అంగద్ బేడి, తమ చిన్నారి డాగర్ మెహర్ ధుపియా బేడితో కలిసి సేదతీరుతున్నారు. ఇక దిశాపటాని తన బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాప్ తో కలసి అక్కడ మకాం చేసినట్లు సమాచారం. ఇంకా తార సుతారియా వంటి తారలు మాల్దీవులలో హాయి హాయిగా కాలం తెలియని సంతోషంతో ఉన్నారట. వీరికంటే కాస్త ముందు తాప్సి పన్ను వంటి ఇంకొందరు తారలు కూడా మాల్దీవులలో సందడి చేసి వచ్చారు. మొత్తం మీద ఇండియన్ తారల అందాలతో మాల్దీవులు మరింత శోభను సంతరించుకున్నాయి.
Must Read ;- నీలి ధగధగలలో సాయంకాలం సాగరతీరం..