కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకొనే వాళ్ల కోసం.. బిజినెస్‌లో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకొనే వారి కోసం.. బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. కానీ వ్యవసాయాన్ని పంటలు పండించే వృత్తిలా కాకుండా.. ఆదాయం పెంచి, ఉపాధి అవకాశాలు సృష్టించి, వ్యాపార అవకాశాలు కల్పించే శక్తివంతమైన పరిశ్రమలా తయారు చేసే నిపుణులను తీర్చిదిద్దే విద్యా సంస్థలు ఎక్కడా లేవనే చెప్పాలి.
ఆ లోటుని తీర్చడానికే.. ఏపీ సీఎం చంద్రబాబు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వేలాది మంది ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దింది. ఈ విద్యా సంస్థలో నేర్చుకున్న పాఠాలతో ఎంతో మంది సొంతంగా స్టార్టప్ కంపెనీలు ప్రారంభించి.. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది కొత్త కాన్సెప్ట్ కాదు. ఐఎస్బీ రూపంలో హైదరాబాద్‌లోనే తెలుగు రాష్ట్రాల యువతకు ఒక అంతర్జాతీయ స్థాయి బిజినెస్ మేనేజ్మెంట్ సంస్థ అందుబాటులోకి వచ్చింది. కానీ మదనపల్లెలో ప్రారంభించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్.. ఈ రంగంలో ప్రప్రథమ సంస్థ. వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీ వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పంటల మార్కెటింగ్, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ.. ప్రాసెసింగ్, సరఫరా వ్యవస్థలు, లాభదాయకమైన మార్కెట్లను గుర్తించడం వంటి రంగాల్లో రైతులకు దిశా నిర్దేశం చేసే నిపుణులు తయారు చేస్తుంది.
వ్యవసాయంపై ఆసక్తి కలిగిన యువత ఆగ్రి స్టార్టప్‌లు ప్రారంభించడానికి, సాగులో డ్రోన్ టెక్నాలజీ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్, డిజిటల్ మార్కెటింగ్.. ఇతర అగ్రికల్చర్ సర్వీసెస్ రంగాల్లో నైపుణ్యాలు పెంచడానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉపయోగపడుతుంది. ఈ సంస్థ ద్వారా.. రైతులు, శాస్త్రవేత్తలు, మార్కెట్ నిపుణులు, అగ్రికల్చర్ ఇండస్ట్రీతో అనుసంధానం ఏర్పడి వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలకు.. లాభదాయక సాగు విధానాలకు మార్గం సుగమం అవుతుంది.
రైతు ఆదాయం పెరగాలి, యువతకు ఉపాధి కల్పించాలి, వ్యవసాయం లాభసాటిగా మారి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కావాలి. ఈ లక్ష్యాల సాధనకు.. ఆధునిక విద్య, పరిశోధన, శిక్షణ, మార్కెట్ లింకింగ్ వంటి అంశాల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించే సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. మేనేజర్లు, పారిశ్రామికవేత్తలను తయారు చేస్తే.. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్.. వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే అగ్రిటెక్ నిపుణులను తీర్చిదిద్దుతుంది. రైతులను ఆంత్రప్రెన్యూర్లుగా మార్చి.. వ్యవసాయానికి పరిశ్రమ హోదా తీసుకొచ్చే దిశగా ఐఎస్ఏతో తొలి అడుగు పడింది.











