తన తొలి సినిమా ‘గ్రహణం’తోనే అవార్డును సాధించిన దర్శకుడాయన. 2004 నుంచి నేటి ‘వి’ దాకా ఆచితూచి అడుగులు వేస్తూ వైవిధ్యమైన చిత్రాలకు రూపకల్పన చేశారు. దర్శకుడిగా ఆయనకు ఇది 10వ సినిమా. ఆయనే ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆయన దర్శకత్వంలో నాని, సుధీర్ బాబులతో తెరకెక్కిన ‘వి’ సినిమా ఈనెల 5న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవుతోంది. తెలుగులో ఓ పెద్ద హీరో నాని, మరో పెద్ద నిర్మాత దిల్ రాజుల సినిమా ఇలా ఓటీటీ ద్వారానే విడుదల కావడం ఇదే తొలిసారి. ఈ సినిమా ఫలితం మరికొన్ని సినిమాల విడుదల మీద కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆయన తాత ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, తండ్రి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ… రచయితల కుటుంబం నుంచి వచ్చిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ తన దైన ప్రత్యేక శైలితో సినిమాల రూపకల్పన చేస్తూ ముందుకు వెళుతున్నారు. ‘వి’ సినిమా గురించి ఆయన ఏమంటున్నారో చూద్దాం.
మీ సినిమా ఇలా ఓటీటీ ద్వారా విడుదల కావడం మిమ్మల్ని నిరుత్సాహానికి గురిచేసిందా?
ఇప్పుడున్న హెల్త్ రిస్క్ లో ఇలా విడుదల చేయక తప్పడం లేదు. నిరుత్సాహం కొంత ఉన్నా ఈ పరిణామాలకు తలఒగ్గక తప్పదు. అందరం చర్చించుకున్నాకే ఇలా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం. చాలా తర్జన భర్జనలు జరిగాక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా వల్ల కాలం తెచ్చిన మార్పు ఇది.
క్వాలిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
థియేటర్లలో విడుదలైతే గొడవ ఉండేది కాదు… ఓటీటీ కాబట్టి అనేక రకాలుగా పరిశీలనలు చేశాం. థియేటర్లో చూసిన అనుభూతికి ఏమీ తగ్గకుండా ఉండేలా అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. సౌండ్ డిజైన్ పరంగా, గ్రేడింగ్ పరంగా ఐయామ్ వెరీ హ్యాపీ. థియేటర్లలో మొదటివారంలో చూసేవారంతా మొదటిరోజులోనే ఓటీటీలో చూసేస్తారు. 200 దేశాల్లో అందరూ ఈ సినిమాని చూస్తారు.
ఓటీటీని మీరు ఎలా చూస్తున్నారు? థియేటర్లో చూసిన అనుభూతి ఉండదు కదా?
కచ్చితంగా ఇది ఒక ఫేజ్. థియేటర్ అనుభూతి లెంగ్త్ తగ్గుతుందన్నది మాత్రం వాస్తవం. మన ప్రసాద్స్ లో 8.45 గంటల షో చూసిన అనుభూతి అయితే రాదు. దీనివల్ల థియేటర్లపై మనకు మరింత ఇష్టం పెరుగుతుందన్నది మాత్రం నిజం. టెక్నికల్ డిజిటల్ మాధ్యమాల్లో సినిమా చూసే సమయంలో ఫోన్‌లో ఒకలా, టాబ్‌లో మరోలా, లాప్‌టాప్‌లో మరో రకంగా.. ఇలా వేరియేషన్స ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని బ్రైట్ నెస్, సౌండ్ ఎలా ఉంది అని చెక్ చేసుకుని ముందుకెళ్లాం. వీలైనంత థియేటర్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్షకుడికి అందించడానికి ప్రయత్నించాం. కాలంతో ముందుకు వెళ్లక తప్పదు.
నాని సినిమాల్లో ఇది నెక్ట్స్ రేంజ్ సినిమా అనుకోవచ్చా?
కచ్చితంగా… ఇది నానికి ఛాలెంజింగ్ సినిమా అని మాత్రం చెప్పగలను. మొత్తం ఐదు రాష్ట్రాలలో షూటింగ్ చేశాం. దాంతోపాటు థాయిలాండ్ లో కొంతభాగం షూటింగ్ చేశాం. ఎక్కడా రాజీపడకుండా షూటింగ్ చేశాం.
కలెక్షన్లు, రికార్డులు మిస్సవుతున్నాం అనే ఫీలింగ్ లేదా?
ఆ ఫీలింగ్ కొంత ఉంటుంది. చెప్పానుగా ప్రసాద్ లో చూసిన మజాను మాత్రం మిస్సవుతాము. కాకపోతే అంచనాలకు మాత్రం ఈ సినిమా ఏమీ తగ్గదు. ఈ విషయంలో అందరం సంతోషంగా ఉన్నాం.
ఇందులో నాని పాత్ర ఏ టైప్ నెగిటివ్ షేడ్?
అది మేం రివీల్ చేయలేం. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది.
ఎందుకు మీరు చేసిన వాళ్లతోనే సినిమాలు చేస్తున్నారు?
ఒక విధంగా ఇది కంఫర్ట్ జోన్. మా వేవ్ లెంగ్త్ కలిసింది. పాత్రలకు తగ్గట్టుగానే నటుల ఎంపిక కూడా జరిగింది. నటుల అసలు సామర్థ్యం ఏంటో ఈ సినిమా నిరూపిస్తుంది. నానితోపాటు సుధీర్ బాబుది కూడా.
ఈ కరోనా ఎఫెక్ట్ తెలుగు సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపిందని అనుకుంటున్నారు?
అంతా అగమ్యగోచరంగా ఉంది. అక్టోబరు, నవంబరు నెలల్లో షూటింగులకు వెళ్లేందుకు కొందరు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అంతా సవ్యంగా జరిగితే థియేటర్లు మళ్లీ ప్రారంభమవుతాయి. ఓటీటీ అనేది మరో రెండో ప్రయారిటీ మాత్రమే. బి. సి. సెంటర్లకు కూడా మా వి సినిమా రీచ్ అవుతుందన్న నమ్మకం ఉంది.
ఈ సినిమాలో అదితి ఉన్నా ప్రచారంలో ఆమెను హైలైట్ చేయకపోవడానికి ప్రత్యేక కారణం ఉందా?
నిజంగా కావాలనే ఆమెను హైలైట్ చేయడం లేదు. ఈ సినిమా కథలో ఆమె చాలా కీలకం. అది ఏమిటనేది తెలియాలంటే సినిమా చూడాలి.
థియేటర్ విడుదలకు, ఓటీటీ విడుదలకు మీరు గమనించిన తేడా ఏమిటి?
థియేటర్ ప్రొజెక్షన్ అనేది మనందరికీ తెలిసిందే. కానీ డిజిటల్ లో అలా కాదు. ఇందులో ఓ ప్రత్యేకమైన వెలుగు ఉంటుంది. మేం ఓటీటీకి ఈ సినిమాని ఇచ్చేముందే అన్ని డివైజ్ లలో సినిమాని ప్రదర్శించి చెక్ చేశాం. పూర్తిగా సంతృప్తిచెందాకే ఓటీటీకి ఇచ్చాం. థియేటర్ లో చూసిన అనుభూతికి పెద్దగా తేడా ఏమీ ఉండదు. కాకపోతే మనకు ఉన్న ఆప్షన్ లలో ఓటీటీ బెస్ట్. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత, పంపిణీదారుడు కూడా దీని వైపు మొగ్గుచూపారంటేనే మనం అర్థంచేసుకోవచ్చు. ఆయనకు నమ్మకం కుదరితేనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తీసుకున్న నిర్ణయమిది. కరోనా ఉన్నా రిస్క్ తీసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేయగలిగాం.
తన 25 వ సినిమా మీదే అయినందుకు నాని ఎలా ఫీలవుతున్నారు?
ఆయన చాలా హేపీ ఫీలవుతున్నారు. మా అష్టాచమ్మా విడుదలైన తేదీనే ఈసినిమా కూడా విడుదలవుతోంది. 25వ సినిమా నీతో చేయడం హేపీ… మిగతా ఏమొచ్చినా అది బోనస్ అని నాని అన్నారు.
సినిమా సినిమాకీ రెండేళ్లు గ్యాప్ తీసుకుంటున్నారెందుకు?
2008 నుంచి 2016 వరకూ రెండేళ్లకో సినిమా చేశాను. తొందర తొందరగా సినిమాలు చేయాలని నాకు లేదు. సినిమా విషయంలో రాజీ పడే ధోరణి నాకు లేదు.
నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర అని తెలిసినపుడు నాని ఫీలింగ్ ఏమిటి?
రిస్క్ చేయడానికి నాని భయపడడు. తనకు పాత్ర బాగుండాలి అంతే. నెగిటివ్ టచ్ ఉంటుంది అన్నపుడు లెట్స్ గో అన్నారు.
ఈ సినిమాని థియేటర్లలో కూడా అవకాశం ఉంటుందా?
థియేటర్లు ప్రారంభమయ్యాక విడుదల చేసే ఆలోచన ఉంది. ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నాలు విజయవంతం కావాలని కూడా కోరకుందాం. ఓటీటీ విడుదల అనేది ఓ ప్రయోగం మాత్రమే. ఇలా విడుదల చేయడం పై ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నాం. కేఎస్ రామారావు లాంటి నిర్మాత కూడా మా ప్రయత్నాన్ని అభినందించారు.
మీరు పెద్ద హీరోలతో ఎందుకు చేయడం లేదు?
పెద్ద హీరోలతో చేయాలంటే నాకు భయం. వాళ్ల అభిమానుల్ని కూడా సంతృప్తి పరచాలి. నా దగ్గర ఉన్న కథను పెద్ద స్టార్లు చేయలేకపోవచ్చు కూడా.
ఈ సినిమాను మహేష్ బాబు లేదా పవన్ కళ్యాణ్ లతో చేయాలనుకున్నారట కదా.
అవన్నీ పుకార్లే. అయినా వాళ్లు ఎంత బాగా చేయగలరో వీరు కూడా అంతబాగా చేశారు.
ఇంట్రడక్షన్ ఫైట్ లో చాలా ప్రత్యేకత ఉందంటున్నారు నిజామా?
అవును… ఇది చాలా ప్రత్యేకమైన ఫైట్. ముఖ్యంగా ఓ కీలక సన్నివేశంతో ఆ ఫైట్ వస్తుంది. అది ఈ కథకు మూలస్తంభం. ఈ సినిమాకు నేపథ్య సంగీతం మరో హైలైట్. తమన్ అదరగొట్టేశారు.
వెబ్ సిరీస్ చేసే ఆలోచన ఉందా?
రెండు మూడు అవకాశాలు వచ్చాయి. కాకపోతే నాకున్న కమిట్ మెంట్స్ కు ఇప్పట్లో అది సాధ్యం కాదు. మూడు నాలుగు సినిమాలు చేయాల్సి ఉంది. అందువల్ల వెబ్ సిరీస్ ను ఇప్పట్లో చేయలేను.
విజయదేవరకొండలో సినిమా ఎప్పుడు?
ఆయనతో సినిమా చేయాల్సి ఉంది. ముందు ఆయన చేస్తున్న సినిమా పూర్తవ్వాలి కదా. షూటింగ్ వ్యవహారాలు కొలిక్కి వస్తే ఎప్పుడనేది తెలుస్తుంది.
శప్తభూమి వెబ్ సిరీస్ ఎప్పుడు ఉంటుంది?
శప్తభూమి నవల నాకు బాగా నచ్చింది. రచయిత బండి నారాయణస్వామి నుంచి హక్కులు తీసుకున్నా. దీన్ని వెబ్ సిరీస్ గా తీయాలా? సినిమా గా చేయాలా అనే విషయంలో నాకే ఇంకా స్పష్టత లేదు.
మీరు సినిమా రంగంలో రావడానికి మీ నాన్నగారు లేదా మీ తాత గార్ల ప్రభావం ఏమైనా ఉందా?
తాతగారు, నాన్న మంచి రచయితలు. కొన్ని సినిమాలకు నాన్న రచనలు చేశారు. ఉద్యోగ ధర్మాల వల్ల ఆయన ఈ రంగంలో కొనసాగలేకపోయారు. సినిమా రంగం అనేది నేను ఎంచుకున్నదే. వారి ప్రమేయం లేకుండానే ఈ రంగానికి వచ్చాను.
– హేమసుందర్ పామర్తి