తల్లి గర్భంలోని మాయ నుంచి బయట పడ్డాం.. డబ్బు మాయలో పడిపోయాం.. జబ్బు బాగా ముదిరిపోయింది.. అందుకే కరోనా కోరల్లో చిక్కి మాయమైపోతున్నాం. ఆస్పత్రిలో బెడ్ దొరకాలంటే డబ్బు.. ఆక్సిజన్ దొరకాలంటే డబ్బు.. శ్మశానంలో కాష్ఠం కాలాలంటే డబ్బు.. చివరికి మనిషి బతకాలన్నా డబ్బే.. చావాలన్నా డబ్బే.. ఇది భలే జబ్బు.
పంచభూతాలను కూడా పంచుకుంటారో.. చేసిన, చేస్తున్న తప్పులకు తలవంచుకుంటారో మనిషి ఆలోచించుకోవలసిన తరుణం ఆసన్నమైంది. కరోనా వస్తే బతకాలన్నా, చావాలన్నా డబ్బులే.. అంబులెన్స్ ధరల్లో మోసం, రెమిడెసివర్ లో దగా, ఆస్పత్రుల్లో దోపిడీ. ఆఖరికి ఇంటికి లేదా కాటికి చేరాలన్నా ఆ ధరలు చూస్తే కళ్లు భైర్లే. మనిషిని బతికించే ఆస్పత్రులు ఖాళీ లేవు.. మనిషి చస్తే శవాలను దహనం చేసే శ్మశానాలు ఖాళీ లేవు.. బెడ్ కావాలంటే 25 వేలు.. శవానికి చోటు కావాలంటే 50 వేలు. ఇలా ఉంటే మనకు ‘ఆక్సిజన్’ ఏం అందుతుంది.. ప్రాణం గాల్లో కలిసిపోతుంది.
పంచభూతాలతో వ్యాపారం
పంచభూతాలతో ఇప్పుడు మంచి బిజినెస్ కేంద్రాలు తెరిచేస్తున్నారు. గాలి, నీరు, భూమి, నిప్పు, ఆకాశం.. అవకాశం దొరికింది కదా అందుకే పంచభూతాలే మనవారికి ముడిపదార్థాలుగా మారిపోయాయి. శ్రీశ్రీ బతికుంటే భూమి,గాలి, నీరు, నిప్పు, ఆకాశం కాదేదీ కాసుల సంపాదనకు అనర్హం అంటూ మరో మహా ప్రస్థానం రాసేవారేమో. మనిషి జననం నుంచి మరణం దాకా సాగే ఈ మహా ప్రస్థానంలో కరోనా స్థానం ఏమిటో ఇప్పుడు అర్థమవుతోంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను మనం విస్మరించాం.. అందుకే ప్రాణాల మీదికి తెచ్చుకున్నాం.
కరోనాకి ఇప్పుడు మూడు వేరియంట్లు వచ్చాయని మన సైంటిస్టులు చెప్పారు. అలాంటప్పుడు మరిన్ని వేరియంట్లు రావడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మనిషి స్వార్థానికి నిచ్చెన వేస్తే.. అక్కడి నుంచి అమాంతం పడేయడానికి కరోనాల్లాంటివి కాచుకుని ఉంటాయని తెలుసుకోలేకపోవడం వల్లేనా ఇదంతా? మన చేతుల్లో ఏమీ లేదు అని చేతులెత్తేయడమా? అంతా మన చేతుల్లోనే ఉంది అని ప్రాణాలు కాపాడుకోవడమా? అని కూడా మనిషి ఆలోచించుకోవడం లేదు. ఎంత దొరికితే అంత నొక్కేద్దామన్న దురాశతోనే ముందుకు వెళుతున్నాడు.
కరోనా కర్కశానికి కారణం ఏంటి?
మనిషిలోని దురాశ వల్లనేనేమో శివుడి ఆజ్ఞ తీసుకునే కరోనా వచ్చినట్టుంది. ‘లెక్క ఎక్కువైనా ఫర్లేదు షేర్ ఖాన్ .. తక్కువ కాకుండా చూసుకో ’ అన్నట్టుగా కరోనా కర్కశంగా వ్యవహరిస్తోంది. మన భూమి మరుభూమిగా మారుతోంది.. బతకడానికి అన్ని దారులూ మూసుకుపోతున్నా మనిషి ధన దాహం మాత్రం తగ్గడం లేదు. కరోనా అన్నా మాస్క్ ధరిస్తే కనికరం చూపుతుందేమోగాని మనిషి మాత్రం చూపడం లేదు. నీకు ప్రాణ భిక్ష పెట్టేది నీలో ఉన్న దాన గుణమేనన్న సత్యాన్ని మనిషి మరచిపోతున్నాడు. ఎంత డబ్బున్నా ఎన్ని దేశాలకు పారిపోయినా కరోనా నుంచి బతికి బట్టకట్టలేమన్న నగ్న సత్యాన్ని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు.. తప్పటడుగులు వేస్తున్నాడు.. తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు.
కరోనా నుంచి రక్షణ కోసం తయారుచేసిన రెమిడెసివర్ ఇంజెక్షన్లతో బ్లాక్ మార్కెట్ దందా నడుపుతున్నారు. చితికి కట్టెలు కావాలంటే రూ. 14 వేలు గుంజారు. అంబులెన్స్ కావాలంటే రూ. 12వేలు అంతకుమించి ముక్కుపిండి మరీ వసూలు చేశారు. బెంగళూరులో ఓ వ్యక్తి చనిపోతే అతని శవాన్ని కొన్ని గంటలపాటు అంబులెన్స్ లో ఉంచడానికి అరవై వేల రూపాయలు కావాలా? సొంతూరు వెళ్లి ప్రాణాలు కాపాడుకుందామనుకుంటే ట్రావెల్స్ వాళ్లు వేలకు వేలు గుంజుతున్నారు. తినడానికి ఫుడ్ దొరక్కా, ఆస్పత్రిలో బెడ్ దొరక్కా.. ఇంకా ఇలా ఎన్నాళ్లు?.. ఎన్నేళ్లు? కరోనా సమయాన్ని క్యాష్ చేసుకునే మాదచ్చేద్ లకు కళ్లెంవేస్తే తప్ప కాలం ముందుకు సాగదు. అందుకే ఈ కరోనా చెంత.. చితి చింత.
– హేమసుందర్
Must Read ;- కోవిడ్ నివారణకు 2 కొత్త మందులు.. 24 గంటల్లో వైరస్‌కు అడ్డుకట్ట