Innovative Protest By AAP Leaders Over Deteriorating Condition Of Roads :
రోడ్డంతా గతుకులమయం. అడుగు సందు లేకుండా గుంతలు పడిపోయాయి. రోజుల తరబడి పరిస్థితి అలాగే ఉంది. స్పందించాల్సిన అధికారులు పట్టించుకోవట్లేదు. అధికారులను అదిలించాల్సిన ప్రజా ప్రతినిధులు స్పందించలేదు. ఆ గతుకుల్లో ఇబ్బందులు పడుతూనే వెళుతున్న ప్రజలు కూడా తమకేమీ పట్టనట్టుగానే వెళ్లిపోతున్నారు. ఇబ్బంది ఎదురవుతున్నా.. ఎవరిని ఏమనాలో తెలియడం లేదన్నట్లుగా జనం ఉన్నారు. వర్షం కురిస్తే నరకమే కనపడుతోంది. అయితే ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలే వేదికగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ పరిస్థితిని చూస్తూ ఊరుకోలేదు. పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, స్పందించని అధికార యంత్రాంగం, పనిచేయలేని ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్న ప్రజలు.. ఇలా అందరినీ టార్గెట్ చేయడమే కాకుండా వారిలో స్పందన వచ్చేలా ఓ వినూత్న నిరసనకుద దిగింది. గుంతలమయంగా మారిన రోడ్లపైనే సంగీత కచేరీ నిర్వహించింది. ఈ వినూత్న నిరసన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఈ నిరసన ఎక్కడ జరిగిందంటే..?
Innovative Protest By AAP Leaders
గుంతల మయంగా మారిన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా రోడ్డుపై ఆప్ నేతలు ఈ వినూత్న నిరసనను చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ యువ నేతలు నిర్వహించిన ఈ కచేరిలో పాటలు పాడుతూ ప్రభుత్వాన్ని కాకుండా ప్రజలను ప్రశ్నించడం గమనార్హం. ప్రజలు ఓట్లు వేసి ఎటువంటి నాయకులను ఎన్నుకుంటున్నారని ఈ నిరసనలో ఆప్ నేతలు ప్రశ్నించారు. కనీసం గతుకుల రోడ్లను కూడా బాగు చేయించని వారిని ఎన్నుకుంటే ప్రయోజనం ఏమిటని నిలదీశారు. ఈ సందర్భంగా ఆప్ నాయకుడు విశాల్ కేల్కార్ మాట్లాడుతూ కోర్బా జిల్లావ్యాప్తంగా రోడ్లు ఇలాగే ఉన్నాయని చెప్పారు. ఇందుకు కారణం ప్రజలేనని అన్నారు. ఇకనైనా తమ ఓట్లను అమ్ముకోకుండా అభివృద్ధి చేసే వారికే ఓట్లు వేయాలని చెప్పామని అన్నారు. సంగీత ప్రదర్శనతో తాము ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
మరి ఏపీ పరిస్థితి ఏమిటి?
ఏపీలో గడచిన రెండేళ్లుగా రోడ్లను బాగు చేస్తున్న నాథుడే కనిపించడం లేదు. రోడ్ల మరమ్మతులతో పాటు కొత్తగా వేయాల్సిన రోడ్లకు కూడా కేంద్రం నుంచి నిధులు వస్తున్నా.. ఆ నిధులను ఇతరత్రా పనులకు మళ్లిస్తున్న జగన్ మోహన్ రెడ్డి సర్కారు.. రోడ్లను అసలు పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఇప్పటికే రాష్ట్రంలోని మెజారిటీ రోడ్లన్నీ గుంతల మయంగా మారిపోయాయి. రాష్ట్రం మీదుగా వెళుతున్న జాతీయ రహదారుల పరిస్థితి కూడా అధ్వాన్నంగానే ఉంది. ఈ తరహా రోడ్లపై ఇప్పటికే విపక్ష టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. రోడ్లపై చేపలు పట్టారు. రోడ్లపై తేలిన నీటి గుంటల్లో వరి నాట్లు కూడా వేసి తమదైన శైలి నిరసనలు తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో కోర్బాలో ఆప్ చేసిన రోడ్డుపై కచేరీ తరహా నిరసనలు.. ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ అవసరమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- దేవినేనికి బెయిల్!.. జగన్ కు మరో షాకే కదా!