ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ తీయడంలో మాలయాళ దర్శకులు మొనగాళ్ళని మరోసారి గుర్తు చేసే సినిమా ‘జోసెఫ్’. ఓటీటీ లవర్స్ ను ఓ రేంజ్ లో అలరించే సినిమా ఇది. యాక్టిడెంట్స్ అన్నీ యాక్సిడెంటల్ గా జరిగే ఇన్సిడెంట్స్ కావని.. వాటిలో కూడా స్కామ్ ఉంటుందనే షాకింగ్ విషయాన్ని చెప్పే థ్రిల్లర్ ఇది.
కథేంటి? : జోసెఫ్ రిటైర్డ్ పోలీసాఫీసర్. అతడి ఇంటెలిజెన్స్ కు ముచ్చటపడే పోలీస్ డిపార్ట్ మెంట్ .. రిటైర్ అయినా కూడా అతడి సేవల్ని వినియోగించుకుంటూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే పోలీసు డిపార్ట్ మెంట్ కు ఒక సవాల్ ఎదురవుతుంది. నగరంలో వరుసగా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని సాధారణ యాక్సిడెంట్ కేసుల్లాగానే పోలీసులు నమోదు చేసుకుంటూ ఉంటారు. కానీ జోసెఫ్ కు వాటి మీద సందేహం కలుగుతుంది. దానికి ఓ కారణం ఉంటుంది. అతడి భార్య, కూతురు కూడా గతంలో యాక్సిడెంట్స్ లోనే చనిపోతారు.
సరిగ్గా అవి జరిగిన తీరులోనే ఇప్పటి యాక్సిడెంట్స్ జరుగుతాయి. కానీ వాటిలో ఎవరికీ తెలియని ఒక మిస్టరీ కనిపిస్తుంది అతడికి. దాన్ని పరిశోధించే క్రమంలో తన ప్రాణాల్ని కూడా పణంగా పెడతాడు అతడు. ఇంతకీ జోసెఫ్ కనిపెట్టిన ఆ మిస్టరీ ఏంటి? వాటికి వెనుక ఎవరి హస్తం ఉందో తెలియాలంటే.. జోసెఫ్ సినిమా చూడాల్సిందే.
ఎలా తీశారు?: జోసెఫ్ ఒక తెలివైన పోలీసాఫీసర్ అని, రిటైర్ అయినా కూడా అతడిలో ఏమాత్రం స్పార్క్ తగ్గలేదని సినిమా ఓపెనింగ్ లో వచ్చే ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ సీన్ తో అద్భుతంగా తెలియచెప్పాడు దర్శకుడు పద్మకుమార్. ఆ ఒక్క సీన్ తో జెసెఫ్ ఎపిషియెన్సీ ప్రేక్షకులకు అర్ధమవుతుంది. అంతేకాదు.. ముందు ముందు జోసెఫ్ కు దీని కన్నా పెద్ద సవాలే ఎదురవుతుందనే క్లూ కూడా ఇస్తాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో.. అడుగడుగునా షాకింగ్ సీన్స్ తో .. ప్రేక్షకుల్లో క్షణ క్షణం ఉత్కంఠతను రేకెత్తిస్తాడు దర్శకుడు. జోసెఫ్ గా జోజు జార్జ్ అద్భుతంగా నటించాడు. అంతేకాదు అతడికి ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ గా స్టేట్ అవార్డు కూడ వచ్చింది. ఇక అతడి సుపీరియర్ ఆఫీసర్ గా అనిల్ మురళి మెప్పిస్తాడు . ఇక జోసెఫ్ భార్యగా ఆత్మీయ రాజన్, మాజీ ప్రేయసిగా మాధురీ బ్రగాంజా కనిపిస్తారు.
హైలైట్స్ : ఇందులో జరిగే యాక్సిడెంట్స్ వెనుక రివీలైన స్కామ్ .. ప్రేక్షకులకి షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. జోసెఫ్ దాన్ని ఛేదించే విధానం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. పైకి సాధారణంగా కనిపించే యాక్సిడెంట్స్ లో కూడా స్కామ్ ఉంటుందని.. అది చాలా భయంకరంగా ఉంటుందని ఈ సినిమాతో అందరికీ అర్ధమవుతుంది. ఫ్యామిలీ రిలేషన్స్ , హ్యూమన్ ఎమోషన్స్ బేస్ తో ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను రన్ చేయడం దర్శకుడి ఇంటెలిజెన్స్ కు నిదర్శనం.
నటీనటులు : జోజు జార్జ్, అనిల్ మురళి, దిలీష్ పోత్తన్, ఆత్మీయ రాజన్, మాధురీ బ్రగాంజా, సుధీ కొప్ప, ఇర్షాద్, నెడుముడివేణు, జానీ ఆంటోనీ, ఇడవేళ బాబు తదితరులు
నిర్మాణం: జోజు జార్జ్
దర్శకత్వం: యం.పద్మకుమార్
ఒక్కమాటలో : షాకింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
ఎక్కడ చూడాలి?: అమెజాన్ ప్రైమ్
భాష : మలయాళం
రేటింగ్ : 3.5 /5
– ఆర్కే