ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ రెండో మ్యాచ్‌లో చతికిలపడింది. బలమైన ముంబై టీమ్‌పై విజయం సాధించి బలహీనం అనుకున్న రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది. మరోవైపు ఢిల్లీ తొలి మ్యాచ్‌లో ఉత్కంఠభరిత విజయం సాధించి జోరుమీదుంది. ఈ రెండు జట్లు శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడనున్నాయి.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన చెన్నై జట్టుపై విమర్శలు కురుస్తున్నాయి. స్టార్లు లేని రాజస్థాన్‌కు భారీ పరుగులు సమర్పించుకోవడం చెన్నైని తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుత యూఏఈ పిచ్‌లపై సగటు స్కోరు 150గా నమోదవుతోంది. అలాంటిది రాజస్థాన్ జట్టు ఏకంగా 216 పరుగులు చేసింది. అంతటి భారీ లక్ష్యాన్ని చెన్నై ఛేదించలేకపోయింది. ఇక, తొలి మ్యాచ్‌లో అదృష్టం కలిసి రావడంతో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. సూపర్‌ఓవర్‌లో ప్రత్యర్థి జట్టు కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడంతో ఢిల్లీ గెలవగలిగింది. ఆ గెలుపు నామమాత్రం కాదని నిరూపించుకునేందుకు ఢిల్లీ సంసిద్ధమవుతోంది. మరోవైపు రెండో మ్యాచ్ పరాజయాన్ని మరిపించేలా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చెన్నై భావిస్తోంది. మరి, ఈ రెండు టీమ్‌లలో ఏది గెలుస్తుందో చూడాలి.
చెన్నై జట్టు బలాలు
విజయ్, వాట్సన్, డుప్లెసిస్, ధోనీతో కూడిన చెన్నై బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 217 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగి 200 పరుగులు చేసింది. ఓ దశలో గెలిచేస్తుందేమోననిపించింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో కెప్టెన్ ధోనీ ఏడో స్థానంలో కాకుండా ఇంకా ముందు వస్తే బాగుంటుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. బౌలింగ్‌లో సామ్ కర్రన్ స్థిరంగా రాణిస్తున్నాడు. శుక్రవారం నాటి మ్యాచ్‌లో బౌలింగ్ విభాగంపై మరింత దృష్టి సారించాలి.
బలహీనతలు
గాయం కారణంగా రెండో మ్యాచ్‌కు దూరమైన అంబటి రాయుడు రాజస్థాన్‌తో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. చెన్నై ప్రధాన లోపం ఫీల్డింగ్ విభాగంలో కనబడుతోంది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో చెన్నై ఫీల్డర్లు పలు కీలక క్యాచ్‌లు వదిలేశారు. ఇక, ప్రధాన బౌలర్ ఎంగిడి తీవ్రంగా నిరాశపరిచాడు. చివరి ఓవర్లో ఏకంగా 30 రన్స్ ఇచ్చాడు. ఈ పరుగులే రాజస్థాన్ విజయానికి కారణమయ్యాయి. మిగిలిన ప్రధాన బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో వాట్సన్, డుప్లెసిస్‌పైనే చెన్నై ఎక్కువగా ఆధారపడుతోంది. స్పిన్నర్లు జడేజా, చావ్లా ఇంకా గాడిలో పడలేదు.
చెన్నై జట్టు (అంచనా)
విజయ్, వాట్సన్, డుప్లెసిస్, సామ్ కర్రాన్, గైక్వాడ్, కేదార్ జాదవ్, ధోనీ, జడేజా, దీపక్ చాహర్, ఎంగిడి, పియూష్ చావ్లా
ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు
ఢిల్లీ టీమ్‌కు ఆల్‌రౌండర్ స్టోయినిస్ తురుపు ముక్కగా మారాడు. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. అలాగే ధవన్, శ్రేయాస్, పంత్, స్టోయినిస్‌తో కూడిన ఢిల్లీ బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. మరోవైపు బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తక్కువ లక్ష్యాన్ని ఢిల్లీ బౌలర్లు బాగా కాపాడారు. రబాడా, అశ్విన్, స్టోయినిస్ బంతితో మెరిశారు. ఒత్తిడిలో సమర్థంగా రాణించడం వల్లే తొలి మ్యాచ్ ఢిల్లీ వశమైంది.
బలహీనతలు
తొలి మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ అశ్విన్ రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం సందేహాస్పదంగా మారింది. తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ అశ్విన్ గాయపడిన సంగతి తెలిసిందే. వెంటనే పెవిలియన్‌కు వెళ్లిన అశ్విన్ మళ్లీ మైదానంలోకి రాలేదు. ఆ మ్యాచ్‌లో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసి 2 వికెట్లు తీశాడు. చెన్నైతో మ్యాచ్‌కు అశ్విన్ అందుబాటులో లేకపోతే ఢిల్లీకి కష్టమే. ఇక, ఢిల్లీ టాపార్డర్ ఫామ్‌లో లేదు. తొలి మ్యాచ్‌లో కేవలం 13 పరుగులకే మూడు టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. కీలక ఆటగాడు ధవన్ ఇంకా ఫామ్‌లోకి రాలేదు.
ఢిల్లీ జట్టు (అంచనా)
పృథ్వీషా, ధవన్, హెట్‌మెయర్, శ్రేయాస్, పంత్, స్టోయినిస్, అక్షర్, అశ్విన్, రబాడా, నోర్టే, మోహిత్
మ్యాచ్ ఫేవరెట్
రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైనప్పటికీ చెన్నై జట్టును బలమైన టీమ్‌గానే పరిగణించాలి. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో చెన్నై టీమ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ టీమ్ కూడా పటిష్టంగానే కనబడుతోంది. చెన్నైపై గెలవగల సత్తా ఢిల్లీ టీమ్‌కు ఉంది. తొలి మ్యాచ్ తరహాలోనే ఆడితే ఢిల్లీ వరుసగా రెండో విజయం అందుకుంటుందనడంలో సందేహం లేదు.











