ఐపీఎల్‌పై కరోనా పడగ విసిరింది. ఆటగాళ్లపై వైరస్ ప్రతాపం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై దేశవ్యాప్తంగా కొందరు నిరసనలు తెలిపారు. ఐపీఎల్‌లోని కొందరు విదేశీ ఆటగాళ్లు ఆటను వదలి వెళ్లిపోయారు. ఆక్సిజన్ కోసం కొవిడ్ బాధితులు తల్లాడుతుంటే.. కోట్లు వెచ్చించి ఐపీఎల్ నిర్వహణ అవరసమా అంటూ.. ఓ ప్రఖ్యాత ఆటగాడు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్ లను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ప్రకటించారు.
ఐపీఎల్‌కు కొవిడ్ ఫీవర్!
ఐపీఎల్ ఆటగాళ్లు కొందరు కరోనా బారిన పడ్డారు. సన్‌రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాకు కొవిడ్ సోకింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అమిత్ మిశ్రా సైతం కరోనా బారినపడ్డాడు. ఢిల్లీ మైదానంలో సిబ్బందిలో కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితోపాటు కోల్‌కతా ఆటగాళ్లు వరణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌లకు సైతం పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. చెన్నై బౌలింగ్ కోచ్ బాలాజీకి సైతం కరోనా వ్యాపించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజా సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
అంతా అనుకూలించిన తర్వాత..
‘‘కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కొందరు ఆటగాళ్లు, సిబ్బంది సైతం కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుత టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నాం. పరిస్థితులను బట్టి.. అంతా అనుకూలిస్తే తర్వాత నిర్వహిస్తాం. కానీ, అది ఈ నెలలోనే మాత్రం సాధ్యం కాకపోవచ్చు’’
– బ్రిజేష్ పటేల్, ఐపీఎల్ ఛైర్మన్