వైపీఎస్ అధికారులు.. గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పదవిలో ఉండగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ సస్పెషన్ విషయంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఈ కేసులో విజిలెన్స్ నివేదిక అందిన తర్వాత.. 2024 డిసెంబర్‌లో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. తర్వాత ఆయన సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పొడిగించారు. నవంబర్ చివరికి ఆయన సస్పెన్షన్ గడువు ముగుస్తుంది. అయితే ప్రభుత్వం సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పొడిగించింది. అంటే 2026 మే వరకు ఐపీఎస్ సంజయ్ సస్పెన్షన్‌లో ఉంటారు.
ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్లో అవినీతిపై అప్పట్లో ఏపీ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. సంజయ్ హయాంలో అగ్నిమాపక విభాగం కొనుగోళ్లు, కాంట్రాక్టులపై విచారణ చేసిన ఏసీబీ.. ఆయన్ను ఈ ఏడాది ఆగస్టులో అరెస్టు చేసింది. ప్రస్తుతం సంజయ్ జైల్లోనే ఉన్నారు. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వరుస కేసులు నమోదు చేసిన సమయంలో సంజయ్ సీఐడీ ఛీఫ్‌గా ఉన్నారు. చంద్రబాబు అరెస్టుపై.. అప్పటి అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో కలిసి, ఐపీఎస్ సంజయ్… ఢిల్లీ, ముంబై, హైదరబాద్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి వివాదాస్పదం అయ్యారు. ఐపీఎస్ అధికారిగా ఉంటూ.. రాజకీయ నాయకుడిలా కామెంట్స్ చేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు.
వైసీపీ హయాంలో డజనుకు పైగా సీనియర్ ఐపీఎస్ అధికారులు అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంటెలిజెన్స్ ఛీఫ్‌గా పనిచేసిన డీజీపీ ర్యాంక్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్లి.. బెయిల్‌పై బయటకు వచ్చారు. పీవీ సునీల్ కుమార్, కాంతి రాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, విశాల్ గున్నీ వంటి అనేక మంది ఐపీఎస్ అధికారులు అయితే సస్పెన్షన్‌లోనో లేక.. సైడ్ ట్రాక్‌లోనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజును వైసీపీ హయాంలో టార్చర్ చేసిన కేసులో సీనియర్ ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్‌పై విచారణ ప్రారంభమైంది. ఎంత పెద్ద పదవిలో ఉన్నా.. తప్పు చేస్తే తప్పించుకోలేరని వైపీఎస్ అధికారులపై చర్యల ద్వారా కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది











