వైసీపీ హయాంలో జగనన్న లేఅవుట్లలో భూముల చదును పేరిట జరిగిన అక్రమాలపై విచారణ పక్కదారి పడుతున్నట్లు సమాచారం. నాడు తప్పులు చేసిన, అక్రమాలకు సహకరించిన అధికారులే నేడు విచారణ బాధ్యతల్లో ఉన్నారు. తమ తప్పులను బయటపెట్టుకోలేని వీరు..నాడు పనులు చేసిన వైసీపీ నేతలు, వారి అనుచరులకు బకాయిలుగా ఉన్న రూ.240 కోట్ల బిల్లుల చెల్లింపునకు రూట్ క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉపాధి హామీ పథకం నిధులతో భూముల చదును పేరిట జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం 2024 డిసెంబర్లో విచారణకు ఆదేశించింది. మొత్తం 9,600 పనుల్లో ఇప్పటిదాకా 3,900 చోట్ల మాత్రమే తనిఖీలు పూర్తిచేశారు. వాటిలోనూ 236 పనులకే సమగ్ర నివేదికలు తయారయ్యాయి.
అప్పుడు, ఇప్పుడు వారే –
ఉపాధి హామీ పథకంలో కీలకమైన క్వాలిటీ కంట్రోల్ విభాగం జగన్ ప్రభుత్వంలో నిర్వీర్యమైంది. అప్పట్లో ఈ విభాగాన్ని వైసీపీ అనుకూల అధికారులతో నింపేశారు. జిల్లాల్లో ఇప్పుడున్న ఉన్నతాధికారుల్లో అత్యధికులు గత ప్రభుత్వంలో నియమితులైన వారే. జగనన్న లేఅవుట్లలో తనిఖీల కోసం ఇంజినీర్లతో బృందాలు ఏర్పాటు చేయడం, వారిచ్చే నివేదికలను పరిశీలించి జిల్లా నీటి యాజమాన్య సంస్థ – డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లకు అందజేయడం వంటి కీలక బాధ్యతలను ఈ క్వాలిటీ కంట్రోల్ సీనియర్ అధికారులకు అప్పగించారు.
గత ప్రభుత్వంలో వీరితోపాటు ప్రస్తుత జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా భూముల చదును పనుల్లో అక్రమాలకు సహకరించారన్న ఆరోపణలున్నాయి. మూడో పక్షంతో విచారణ జరిపిస్తే వీరిలోనే చాలామంది అవినీతి వెలుగులోకి వచ్చే ఆస్కారముంది. అలా చేయకుండా, దొంగ చేతికే తాళాలిచ్చినట్లుగా, వీరికే విచారణ బాధ్యత అప్పగించడం గమనార్హం.
తనిఖీ నివేదికల్లో క్వాలిటీ అధికారుల జోక్యం
వివిధ విభాగాల్లోని ఇంజినీర్లతో విచారణ బృందాలు ఏర్పాటు చేయడం, వారితో తనిఖీలు చేయించడం సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారుల బాధ్యత. ఇంజినీర్ల బృందాలు భూములు చదును చేసిన ప్రతి లేఅవుట్‌కు వెళ్లి, అక్కడ నిబంధనల మేరకు పనులు చేశారా? లేదా అన్నది పరిశీలించాలి. కానీ, గత 3 నెలల్లో దాదాపు 3,900 పనులను మాత్రమే వీరు తనిఖీ చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో తనిఖీలు నామమాత్రంగా జరిగాయన్న ఫిర్యాదులొస్తున్నాయి.
కొన్ని జిల్లాల్లో విచారణ నివేదికల్లో అక్రమాల తీవ్రతను సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు తగ్గించి, డ్వామా పీడీలకు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికలను బట్టే పెండింగ్ బిల్లుల చెల్లింపుపై డ్వామా పీడీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గృహనిర్మాణ సంస్థ పోర్టల్‌లో పీడీలు వీటిని అప్లోడ్ చేశాకే, ఆ సంస్థ బిల్లులు చెల్లిస్తుంది.