వ్యవసాయానికి ప్రాణాధారమైన సాగునీటి రంగం పై వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత వివక్ష ?నీటి వనరులు జాతి జీవనానికి ,ఉపాదికీ,ఆహార భద్రతకు, సుస్థిర అభివృద్దికి మూలాధారాలు.అంతటి ప్రాధాన్యత వున్న సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసింది వైసీపీ ప్రభుత్వం.
కోట్లాది మంది రైతాంగానికి అవసరమయిన సాగునీటి రంగాన్ని ఎందుకు గాలికి వదిలేశారో రాష్ట్ర రైతాంగానికి సమాదానం చెప్పవలసిన భాధ్యత ప్రభుత్వం పై వుంది. ఎన్ని అరకొర పధకాలు అమలు చేసినా వ్యవసాయం లాభసాటి కానంత వరకు రాష్ట్ర సమగ్రాభివృద్ది అసాధ్యం. జగన్ రెడ్డి తన పాదయాత్రలో రైతాంగానికి జల కధలు వినిపించి అధికారంలోకి వచ్చాక సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారని రైతులు ఆవేదన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరస సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ నిలిపి వేస్తూ మెమో ఇచ్చారు. ప్రాజెక్టుల టెండర్లు అన్నీవరస బెట్టి రద్దు చేశారు.టెండర్లు రద్దుచేసి సాగునీటి రంగాన్ని రివర్స్ టెండర్స్ పేరుతో కావాలనే నీరుగార్చారు. సాగునీటి ప్రాజెక్టులలో అరకొర పనులు కూడా జరగ లేదు.
ఏ ప్రాజెక్టులో తట్ట మట్టి తీయలేదు.బొచ్చెడు కాంక్రీట్ వేసింది లేదు. కానీ మూడున్నరేళ్లలో రూ 7 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకు పప్పుకూడు తినిపిచ్చారు తప్ప ఎక్కడా కొత్తగా చుక్కనీరు కాలువల్లో పారిన దాఖలాలు లేవు.మూడున్నరేళ్లుగా సాగునీటి రంగానికి బడ్జెట్ లో కేటాయించిన నిధులు కూడా ఖర్చు పెట్టలేదు రైతుల కన్నీళ్లు తుడవడానికి మాత్రమే బడ్జెట్లలో నిధులు కేటాయిస్తున్నారు. సాగునీటి రంగానికి కేటాయించిన నిధులు కూడా సంక్షేమ పధకాలకే మళ్లిస్తున్నట్లు సమాచారం.ప్రభుత్వం చేసిన రూ 7 లక్షల కోట్లలో లక్ష కోట్లు సాగునీటి రంగానికి ఖర్చు పెట్టి వుంటే రాష్ట్రంలో దాదాపు సాగునీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తి అయ్యేవి.రాష్ట్ర ప్రభుత్వం ఆరు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి 2021 నాటికి పూర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నప్పటికీ ఆ గడువును 2022 డిసెంబర్ కు మార్చారు.
ఈ గడువు దాటింది.ప్రాజెక్టుల పూర్తికి రూ 1,100 కోట్లు ఖర్చు చేస్తే వాటిని పూర్తి చెయ్యవచ్చని,సాగు విస్తీర్ణం పెరుగుతుందని తెలిసినా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తీ చెయ్యలేదు ప్రభుత్వం మూడున్నరేళ్లుగా . నెల్లూరు బ్యారేజ్,సంగం బ్యారేజ్,అవుకు టన్నెల్,వెలిగొండ టన్నెల్ 2 హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం పూర్తీ చెయ్యడంతో పాటు వెలిగొండ మొదటి టన్నెల్ నుంచి నీరు ఇవ్వడం వంటి లక్ష్యాలు నిర్ధేశించుకొన్నారు. వంశధార రెండో దశ పనులు పూర్తీ చెయ్యాలని లక్ష్యoగా పెట్టుకొన్నారు. రాష్ట్రంలో రూ 24,092 కోట్లతో 54 ప్రాజెక్టులు పూర్తీ చేస్తామని గొప్పలు చెప్పారు.మూడున్నరేళ్లలో74 శాతం పూర్తి అయిన పోలవరాన్ని అసమర్ధ నిర్వాహంతో బలి పీటమేక్కించారు. ఎన్నికలముందు తాము అధికారంలోకి వస్తే గుండ్రేవుల రిజర్వాయర్ ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.అధికారంలోకి వచ్చాక దానిని పట్టించుకోవడంలేదు.
ప్రాజెక్టుల పూర్తికి నిధులు కొరత అడ్డంకిగా మారింది.పనులు చేసినా బిల్లులు వచ్చే పరిస్థితి లేదని టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. అసలు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు వున్నాయని వైసీపీ ప్రభుత్వానికి గుర్తు ఉన్నట్లు లేదు. అత్యంత ప్రాధాన్యం వున్న సాగునీటి రంగాన్ని,రైతాంగం శ్రేయస్సును విస్మరించి సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించారు. రాయలసీమ,ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రాజెక్టులు ,గాలేరు- నగరి,హంద్రీ-నీవా,గండి కోట రిజర్వాయర్, వెలుగొండ,చింతల పూడి ఎత్తిపోతల పధకం ,వంశధార,తోటపల్లి,ఉత్తరాంద్ర సుజల స్రవంతి ,కృష్ణా డెల్టా ఆధునీకరణ, సంగం ఆనకట్ట.సోమశిల,స్వర్ణముఖి, రాయలసీమలోని గుండ్రేవుల రిజర్వాయర్,వేదవతి ఎత్తిపోతల పధకం, ఆర్డిఎస్ వంటి ప్రాజెక్టులను గాలిలో దీపాలు చేసింది జగన్ ప్రభుత్వం. గత తెలుగుదేశం ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులలోనూ భారీ ఎత్తున సాగునీటి నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి 2014 జూన్ నుండి 2019 మార్చి వరకు సాగునీటి రంగానికి రూ 69,246.94 కోట్లు ఖర్చు చేసింది.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్ లో 2014- 15 లో రూ 3,017.5 కోట్లు కేటాయించి,రూ 9223,75 కోట్లు ఖర్చు చేసింది.2015-16 లో రూ 4,500.79 కోట్లు కేటాయించి,రూ 9545.87 కోట్లు ఖర్చు చేసింది.2016-17 లో రూ7,205.82 కోట్లు కేటాయించి రూ 10,561.68 కోట్లు ఖర్చు చేసింది.2017-18 లోరూ 11,870 కోట్లు కేటాయించి, రూ 12,100.28 కోట్లు ఖర్చు చేసింది.2018-19 లో రూ 16,978 కోట్లు కేటాయించి రూ 14,462.13 కోట్లు ఖర్చు చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం అయిదేళ్లలో సాగునీటి రంగానికి బడ్జెట్ లో రూ 43,572 కోట్లు,నీరు ప్రగతికి,ఇతరాలకు రూ 13,353.23 కోట్లు ఖర్చు చేసి మొత్తం సాగునీటి రంగానికి అయిదేళ్లలో రూ 69,246.94 కోట్లు ఖర్చు చేయగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ లో 2019-20 లో13,139.05 కోట్లు కేటాయించి రూ 5744,44 కోట్లు ఖర్చు చేసింది . 2020-21 లో రూ 11,,805 కోట్లు కేటాయించి రూ 6164.84 కోట్లు ఖర్చు చేసింది.
2021-22 లో రూ 12,431 కోట్లు కేటాయించి రూ 6749.49 కోట్లు ఖర్చు చేసింది.2022-23 లో రూ 11,482.37 కోట్లు కేటాయించి 2022 అక్టోబర్ వరకురూ 3,016.53 కోట్లు ఖర్చు చేశారు. అంటే మూడున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం మొత్తం సాగునీటి రంగానికి రూ 21,675.46 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అందులో ఆ డిపార్టు మెంట్ ఉధ్యోగుల జీతాలకు రూ 7,365,44 కోట్లు, గతప్రభుత్వ హయాంలో వున్న పెండింగ్ బిల్లులు దాదాపు రూ 5,320 కోట్లు పోను సాగునీటి రంగానికి జగన్ ప్రభుత్వం చేసిన వ్యయం ఎంత అంటే రూ 8,982.02 కోట్లు మాత్రమే. గత తెలుగుదేశం ప్రభుత్వం ఏడాదికి రూ 13,849 కోట్లు ఖర్చు చేస్తే,జగన్ ప్రభుత్వం ఏడాదికి రూ 2,245.50 మాత్రమే ఖర్చు చేశారు.గతప్రభుత్వం సాగునీటి రంగానికి ఒక్క ఏడాదిలో ఖర్చుపెట్టినంత కూడా వైసిపి ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో ఖర్చు చెయ్యలేదంటే. ఈ ప్రభుత్వం సాగునీటి రంగం పై ఎంత వివక్ష చూపిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. పైగా తమది రైతు పక్షపాత ప్రభుత్వంగా చెప్పుకొంటున్నారు.
గత ప్రభుత్వం ఐదేళ్లలో జలవనరుల రంగంలో రూ.69,246.94 కోట్ల వ్యయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 62 ప్రాజెక్టులను చేపట్టి, 23 ప్రాజెక్టులను పూర్తి చేసి, 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు సాగులోకి తెచ్చింది .అంతే కాకుండా 3,348 కాస్కేడ్లు అభివృద్ధి చేసి 4,735 చెరువులకు అనుసంధానం చేశాం, 93,308 చెక్ డ్యాములు, 27,866 ఊట చెరువులు, 8.4 లక్షల పంటకుంటలు, 3 మీటర్ల నుంచి 8 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగేలా చర్యలు తీసుకోవడం జరిగింది టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి రూ.8,291.76 కోట్లు ఖర్చు చేయగా, వైసీపీ ప్రభుత్వం రూ.2,011.23 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ప్రజలను భ్రమ కలిగించి వివాదం సృష్టించారు. తెలుగుదేశం హయాంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పూర్తికి రూ. 1,531 కోట్లు ఖర్చు చేస్తే,వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.453 కోట్లు మాత్రమే ఖర్చ చేశారు.
హంద్రీ నీవా ప్రాజెక్టుకు తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్లల్లో రూ.4,182 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం మూడున్నరేళ్లల్లో కేవలం రూ రూ.515.78 కోట్లు ఖర్చు చేశారు.పైగా 07.06.2021న జీవో నెం. 30 ద్వారా రూ.1977 కోట్ల కు అంచనాలు పెంచుకున్నారు.వంశధార ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో రూ.878 కోట్లు ఖర్చు చేయగా,ఈ ప్రభుత్వం రూ.305 కోట్లు ఖర్చు చేశారు.ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని,వంశధార, మహేంద్ర తనయ ప్రాజెక్టులను అటకెక్కించారు. కెఆర్ఎంబి గెజిట్ ప్రతిపాదనలతో జలవనరులు అన్నీ పూర్తిగా కేంద్రం ఆదీనం లోకి తీసుకుంటే దానిని సైతం హర్షించడం జగన్ రెడ్డి అసమర్ధతకు నిదర్శనం. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ విడుదల చేసిన KRMB, GRMB పరిధి నోటిఫికేషన్ 5.12.2015న ఇరు రాష్ట్రాలు చేసుకొన్న ఉమ్మడి ఒప్పందాన్ని 27.5.2016 నాటి డాఫ్ట్ నోటిఫి కేషన్ ను అతిక్రమించే విధంగా వుంది. అక్టోబర్ 14,2021వ తేదీ నుండి 107 ప్రాజెక్టులు కేంద్రం బోర్డు చేతులోకి వెళ్లాయి. ప్రకాశం జిల్లా వర ప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టుకు తూట్లు పొడుస్తూ అనమతులు లేని ప్రాజెక్టుగా కేంద్రం గెజిట్ లో చేర్చినా కనీసం ప్రశ్నించే స్థాయిలో లేకపోవడం సిగ్గుచేటు.23.12.2020న సమాచారం హక్కు చట్టం ప్రకారం మొదటి టన్నల్ 99.45 శాతం పూర్తి. రెండో టన్నల్ 60.91 శాతం పనులు పూర్తి అయ్యాయి.
హైదరాబాద్ లో జగన్ తన ఆస్తులను కాపాడుకోవటానికి, ఏపీ నీటి హక్కులను తెలంగాణా అప్పగిస్తున్నారు.కృష్ణా బేసిన్ లో రాయలసీమ లేదని కెసిఆర్ వాదిస్తున్నా జగన్ రెడ్డి మాట్లాడటం లేదు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా 8 ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటే ఏపీ ప్రభుత్వం నోరుమేడపడం లేదు. కృష్ణా, గోదావరి జలాలపై ఏపీ ప్రయోజనాలను, బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన హక్కుల్ని తాకట్టు పెడితే సీఎం జగన్ రెడ్డిని తెలుగుజాతి క్షమించదు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఆదేశాలతో ఆగిపోయి ఉండాలి. కాని తెలంగాణ ప్రభుత్వం మాత్రం గుట్టుచప్పుడు కాకుండా పనులు సాగిస్తున్నా ఒక్క వైసీపీ మంత్రి కానీ, సీమకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదు..తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు మాత్రం ఏపీ ప్రభుత్వం నిలిపి వేసింది. జనవరి 11, 2017న గాలేరు-నగరి ప్రాజెక్టులో అంతర్భాగమైన గండికోట ఎత్తికోట ఎత్తిపోతల పథకం ద్వారా పులివెందులకు నీరందించి దశాబ్ధాల కలను సాకారం చేసీన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత గండికోట నిర్వాసితులకు నమ్మక ద్రోహం చేశారు. నిర్వాసితులకు మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతుంటే చోద్యం చూస్తున్నారు.గండి కోటనిర్వాసితులకు రూ.479 కోట్లు విడుదల చేయడమే గాక సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అవు కు సొరంగం పనులు పూర్తి చేయడం జరిగింది.ఏది ఏమైనా గత ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాణాధారమైన సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో రెండుకోట్ల ఎకరాలను సాగులోకి తేవాలన్న బృహత్తర లక్ష్యంతో ఆర్ధిక ఇబ్బందులలోనూ భారీ ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి అయిదేళ్లలో సాగునీటి రంగానికి రూ 69,246.94 కోట్లు ఖర్చు చెయ్యడం జరిగింది. కానీ జగన్ ప్రభుత్వం సాగునీటి రంగాన్నిపూర్తిగా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసింది . కోట్లాది మంది రైతాంగానికి అవసరమయిన సాగునీటి రంగాన్ని ఎందుకు గాలికి వదిలేశారో ప్రభుత్వం సమాదానం చెప్పాలి.