సహారా గ్రూపు సంస్థల ఛైర్మన్ సుబ్రతారాయ్ అరెస్టు తప్పేలా లేదు. సెబీ నిబంధనలు ఉల్లంఘించి ప్రజల నుంచి వేలాది కోట్ల రూపాయల డిపాజిట్లను స్వీకరించిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పాటించడం లేదని సెబీ మరలా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డబ్బు చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సహారా గ్రూపునకు చెందిన రెండు సంస్థలు ఉల్లంఘించాయని సెబీ మరలా సుప్రీంకోర్టుకు తెలిపింది. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రూ. 62,602 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును సెబీ కోరింది.
చెల్లింపుల్లో విఫలమైతే సహారా గ్రూపు ఛైర్మన్ సుబ్రతారాయ్ ను అరెస్టు చేయాల్సిందిగా ఆదేశించాలని కోర్టుకు విజ్ఙప్తి చేసింది. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు పూర్తిగా సెబీ నిబంధనలు ఉల్లంఘించాయని సెబీ న్యాయవాదులు కోర్టు ముందుంచారు. ప్రజల వద్ద నుంచి అక్రమ పద్దతుల్లో సేకరించిన డిపాజిట్లకు తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించినా వారు పాటించడం లేదని సెబీ తెలిపింది.
నవంబరు 18 వరకు ఉన్న బకాయల మొత్తం వడ్డీతో కలపి రూ.62,600 కోట్లను సెబీ సహారా రిఫండ్ ఖాతాలో జమ చేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు. చెల్లించడంలో విఫలం అయితే సహారా ఛైర్మన్ సుబ్రతారాయ్ ను అదుపులోకి తీసుకునేలా ఆదేశించాలని సెబీ సుప్రీంకోర్టుకు విజ్ఙప్తి చేసింది.
Must Read ;- తిక్కవరపు వారి ఆస్తులు సీజ్ చేసిన ఈడీ!
అసలు సహారా గోల ఏంటంటే?
సహారా గ్రూపు ఛైర్మన్ సుబ్రతారాయ్ పెరల్ ఇండియా పేరుతో కొన్ని సంస్థలను ఏర్పాటు చేసి, సెబీ నిబంధనలను తుంగలో తొక్కి రూ.25 వేల కోట్లు డిపాజిట్లు వసూలు చేశారు. ప్రజల వద్ద నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు వసూలు చేసేప్పుడు మొద్దునిద్రపోయిన సెబీ తరవాత మేల్కొని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సహారా గ్రూపు సంస్థలు- నిబంధనలు పాటించకుండా రూ.25 వేల కోట్లు వసూలు చేశాయని, అవి ప్రజలకు తిరిగి చెల్లించేలా ఆదేశించాలని గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మొత్తం డిపాజిట్ల సొమ్ము సెబీ సహారా రిఫండ్ ఖాతాలో జమచేయాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఆ పెద్దమనిషి అంత పెద్ద మొత్తంలో అంటే రూ.25 వేల కోట్లు చెల్లించలేకపోవడంతో అరెస్టు చేసి నాలుగేళ్లు జైల్లో పెట్టారు. తరవాత బెయిల్ పై బయటకు వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు డబ్బు చెల్లిస్తానని హామీ మేరకు సుబ్రతారాయ్ ను బెయిల్ పై విడుదల చేశారు. విడుదలైన ఎంత కాలానికి డబ్బు చెల్లించకపోవడంతో మరోసారి సెబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సారి వడ్డీతో కలపి మొత్తం రూ.62,602 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంటే సుబ్రతారాయ్ మరోసారి జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని తెలుస్తోంది.
తప్పెవరిది?
దేశ వ్యాప్తంగా బ్రాంచీలు ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుంచి రూ.25 వేల కోట్లు వసూలు చేసే వరకు సెబీ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. వారికి తెలియకుండానే సహారా గ్రూపు ఇంత పెద్ద మొత్తంలో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందంటే నమ్మశక్యం కావడం లేదు. దేశంలోని 13 ప్రధాన భాషల్లో 42 ప్రధాన పత్రికల్లో మొదటిపేజీ మొత్తం ప్రకటనలు గుప్పించి మరీ సహారా గ్రూపు డిపాజిట్లు సేకరిస్తూ ఉంటే సెబీకి కనిపించలేదంటే ఎవరు నమ్ముతారు? అక్రమాలను మొగ్గలోనే తుంచేయకుండా ప్రజలను పిండేశాక, సెబీ రంగంలోకి దిగింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం.
జనం సొమ్ము తరలిపోయింది. అగ్రిగోల్డ్ తెలుగు రాష్ట్రాలకు పరిమితం అయితే, సహారా గ్రూపు అధినేత దేశం మొత్తం ప్రజల జేబులు కొల్లగొట్టారు. మొద్దునిద్ర నటించిన సెబీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భారీ మొత్తం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. సుబ్రతారాయ్ చేతులెత్తేశారు. అతన్ని నాలుగేళ్లు జైల్లో పెట్టారు. తరవాత షరతులపై విడుదల చేశారు. మరలా జైలుకు పోతాడు సందేహం లేదు. ఇంత చేసినా సామాన్యుల డబ్బు తిరిగి తీసుకురాగలిగారా? లేదు. అది అసాధ్యమనే చెప్పాలి. తప్పు సహారా గ్రూపు అధినేతతా, తప్పు చేస్తూ ఉంటే మొద్దు నిద్ర నటించిన సెబీ అధికారులదా?
Also Read ;- ఇంకా చాలా చేస్తాం : ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతోంది