నేరుగా ప్రభుత్వం జవాబుదారీతనం వహించవలసి వచ్చే కొన్ని విషయాల్లో మాత్రమే… ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. అంతో ఇంతో చర్యలు తీసుకుంటోంది. అవి వినా.. ఇక సమాజం ఎలా చచ్చిపోయినా.. వారికి అక్కర్లేదు. రాష్ట్రంలో ఇప్పటికే 20 సంఖ్యను దాటిన శానిటైజర్ మరణాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రభుత్వంలో కనీస ఆలోచన కూడా మొదలైనట్లు కనిపించడం లేదు. సర్కారు అడ్డుకట్ట వేయదగిన అవకాశం ఉంది. కానీ.. ఈ చావుల విషయంలో.. జగన్ సర్కారు ఎవరి ఖర్మానికి వారిని వదిలేస్తున్నట్టుంది. సాక్షాత్తూ నాణ్యత ప్రమాణాలతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా సాగుతున్న శానిటైజర్ అమ్మకాలకు వకాల్తా పుచ్చుకుంటూ మాట్లాడడమే ఇందుకు నిదర్శనం.
ప్రకాశం జిల్లా కురిచేడులో 13 మంది అర్థంతరంగా దుర్మరణం పాలయ్యారు. వీరందరూ శానిటైజర్ తాగి మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. ఒకటిరెండు రోజుల వ్యవధిలోనే కడప జిల్లా సింహాద్రిపురంలో మరో ముగ్గురు మరణించారు. ప్రభుత్వం ప్రకటించిన కారణం మాత్రం అదే. అదే మాదిరిగా తిరుపతిలో ఇదే తరహాలో మరో నలుగురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 20 కి చేరుకుంది. అన్ని మరణాలకు అధికారికంగా ప్రకటించిన కారణం ఒక్కటే. శానిటైజర్ తాగడం!!
కొన్ని వర్గాల ప్రజలు లిక్కర్ దొరకనప్పుడు, లేదా, లిక్కర ధర ఎక్కువగా ఉందని అనుకున్నప్పుడు.. అందుబాటును బట్టి.. శానిటైజర్ తాగి తృప్తి చెందడం జరుగుతూనే ఉంది. అయితే ఇది ఏదో ఒకరిద్దరు ఒకటిరెండు సందర్భాల్లో చేసే పనులు. మద్యప్రియత్వం కాస్తా శానిటైజర్ ప్రియత్వంగా మారిపోయి.. అదేపనిగా శానిటైజర్ మాత్రమే అందరూ ప్రతిరోజూ తాగుతున్నట్టుగా ప్రభుత్వ ప్రచారం జరుగుతోంది.
నాటుసారా వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే..
లోతుగా ఆరా తీసినప్పుడు వీటిలో చాలా వరకు నాటుసారా మరణాలు అని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో తాజాగా ఆదివారం నాడు కూడా నాటుసారా కాస్తున్న వారిని పట్టుకున్నారు. ఏపీలో ప్రభుత్వం మద్యం ధరలను విపరీతంగా పెంచడంతో పాటు, ప్రజలకు తెలిసిన బ్రాండ్ లు కాకుండా, ఊరూపేరూ లేని మద్యం విక్రయిస్తున్నారు. ఇవన్నీ మద్యనిషేధం దిశగా పడుతున్న అడుగులు అని సర్కారు వారు సమర్థించుకోవచ్చు గాక..! అదే సమయంలో నాటు సారా కాయడం కూడా గ్రామాల్లో విచ్చలవిడిగా పెరుగుతోందనే సంగతిని వారు ఒప్పుకోవడం లేదు.
నాటుసారా కారణంగా ఎవరైనా చచ్చిపోతే.. ఇప్పుడు కుంటిసాకులు చెప్పడానికి శానిటైజర్ వారికి దొరికింది. నాటుసారా ను నియంత్రించలేని తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి.. అన్నింటినీ శానిటైజర్ చావులుగా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారనే వాదన కూడా ప్రజల్లో వినిపిస్తోంది.
కల్తీ శానిటైజర్ లను సమర్థించడం చోద్యం
పోనీ ప్రభుత్వం చెప్పినట్లుగా శానిటైజర్ తాగే చచ్చిపోతున్నారని అనుకుందాం. మరి అలా చావులకు దారితీయగల, శానిటైజర్ లను నియంత్రించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? కనీసం ఒక పద్ధతీ పాడూ లేకుండా.. రోడ్ల పక్కన ప్లాట్ ఫారం ల మీదకూడా కల్తీ శానిటైజర్లు అమ్మేస్తున్నారు. చాలా శానిటైజర్లతో వాటితో చేతుల్ని శుభ్రం చేసుకుంటే.. కొత్త ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. చేతులకు దురద వంటి సమస్య వస్తోంది. కనీసం శానిటైజర్లను తయారుచేసే వారిని నియంత్రించడం గురించి, ప్రమాణాలను నిర్దేశించి.. అనుసరించేలా చూడడం గురించి ప్రభుత్వం పట్టించుకుంటున్నట్టు లేదు.
తిరుపతిలో నలుగురు స్కావెంజర్లు మరణిస్తే.. శానిటైజర్ చావులుగా ముద్ర వేశారు. ఒకరి ఇంట్లో గుట్టలుగా ఖాళీ శానిటైజర్ సీసాలు కనిపించాయి. ఆధారాలు కూడా తయారైనట్టే. శానిటైజర్ తాగే వ్యక్తి ఖాళీ సీసాలను గుట్టలుగా ఎందుకు దాచుకుంటాడనేది చిన్న అనుమానం. పోనీ, అదంతా నిజమే.. శానిటైజర్ చావులే అనుకుందాం. ఈ మృతదేహాలను చూడడానికి వచ్చిన ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి.. కల్తీ శానిటైజర్ల గురించి అడిగితే.. తమాషా జవాబులు చెప్పారు. ఒక స్టాండర్డ్ లేదా.. రోడ్డు పక్కన ఎలా పడితే అలా అమ్మేస్తే ఎలా అని అడిగినందుకు.. ప్రజలందరికీ అందుబాటులో ఉండడానికే అలాంటి అమ్మకాలను కూడా అనుమతిస్తున్నామని చెప్పారు. పోనీ అమ్మకాలు అనుమతిస్తున్నారు.. తయారీదార్లనైనా అధికారులు ప్రశ్నిస్తున్నారా? ప్రమాణాలు పరిశీలిస్తున్నారా? అంటే అదీ లేదు. ఏదో కొందరు చచ్చినప్పుడు కొన్ని కంటితుడుపు మాటలు వస్తున్నాయి. శానిటైజర్ అనేది… నాటుసారాని నియంత్రించలేని వైఫల్యానికి ఒక అందమైన మేలిముసుగులా తయారౌతోంది.