తెలుగు నేల రాజకీయాల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీకి దక్కని ప్రాభవం తెలుగు దేశం పార్టీ సొంతం. ప్రస్థానం మొదలెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన పార్టీగా టీడీపీకి చెరిగిపోని రికార్డు ఉంది. అయితే తన ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన టీడీపీ… మొన్నటి 2019 ఎన్నికల్లో గతంలో ఎన్నడూ చవిచూడని ఓటమిని ఎదుర్కొంది. అయినా కూడా ఎక్కడా రాజీలేని పోరాటం సాగిస్తున్న టీడీపీకి… భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ అధ్యక్షుడు కొత్త కమిటీలను ప్రకటించేశారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం పొలిట్ బ్యూరో సహా ఇతర అన్ని కమిటీల్లోనూ చంద్రబాబు తనదైన మార్కును చూపి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తారన్న నమ్మకం ఉన్న నేతలకు అత్యథిక ప్రాధాన్యం కల్పించారు. కొత్తకమిటీల కూర్పును చూస్తుంటే… ఈ కమిటీల కోసం చంద్రబాబు ఏ మేర కసరత్తు చేశారన్న విషయం ఇట్టే స్పష్టమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మొన్నటిదాకా పార్టీ పొలిట్ బ్యూరోలో ఎంత ఎక్కువ అనుకున్నా… 10 మంది నేతలకు మించి స్థానం దక్కేది కాదు. అయితే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో ఈ దఫా పొలిట్ బ్యూరోలోకి ఏకంగా 22 మందికి స్థానం కల్పిస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో పార్టీ పదవులను ఇక మోయలేనంటూ దాదాపుగా కాడి కింద పడేసినంత పనిచేసిన మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి విజ్ఝప్తిని ఓ వైపు అంగీకరిస్తూనే… ఆమెను కేంద్ర కమిటీలో ఉపాధ్యక్షురాలిగా నియమించారు. అంతేకాకుండా గల్లా కుమారుడు, గుంటూరు ఉంపీ గల్లా జయదేవ్ కు ఇప్పుడు ఏకంగా పొలిట్ బ్యూలోలో సభ్యత్వం కల్పించారు. అంతేకాకుండా పార్టీ ఏపీ అధ్యక్షుడిగా చాలా కాలం పాటు ప్రచారంలో ఉన్న బీద రవిచంద్రకు కూడా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించారు. ఇక వైరి వర్గాల ఆరోపణలను తుత్తునీయలు చేస్తున్న దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలు వర్ల రాయమ్య, నక్కా ఆనందబాబు, వంగలపూడి అనితలకు కూడా పొలిట్ బ్యూరోలో సభ్యత్వం ఇస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
పార్టీలో సీనియర్లు అనుకున్న నేతల్లో ఏ ఒక్కరిని కూడా పక్కనపెట్టకుండా చంద్రబాబు తనదైన శైలి కసరత్తు చేశారనే చెప్పాలి. మాజీ మంత్రులు అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ లకు కూడా కీలక పదవులు అప్పజెప్పారు. ఇక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులు లేకుండా గతంలో పొలిట్ బ్యూరో కొనసాగిన సందర్భాలు లేవు. దివంగత హరికృష్ణ బతికున్నంత కాలం ఆయనకు పొలిట్ బ్యూరోలో సభ్యత్వం కొనసాగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరణంతో టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఇక పార్లమెంటులో పార్టీ వాణిని బలంగా వినిపిస్తున్న యువ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కూడా ఈ దఫా జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్థానం దక్కింది.
ఇదిలా ఉంటే… ఆది నుంచి టీడీపీకి బీసీల పార్టీగా పేరున్న సంగతి తెలిసిందే. ఈ మాటను మరింత ఘనంగా చాటేందుకు కొత్త కమిటీల్లో బీసీలకు చంద్రబాబు అగ్ర తాంబూలం ఇచ్చారు. పార్టీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్ష పదవులను బీసీలకే కేటాయించారు. తెలంగాణకు ఇప్పుడున్న ఎల్.రమణను కొనసాగిస్తూనే, ఏపీకి కొత్తగా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఎంపిక చేశారు. ఇక వైసీపీ సర్కారు చేతిలో నానా ఇబ్బందులకు గురవుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కూడా పొలిట్ బ్యూరోలో సభ్యత్వం కల్పించిన చంద్రబాబు… అధికార పార్టీ వేధింపులకు ఏమాత్రం భయపడేది లేదన్న మాటను పార్టీ శ్రేణుల్లోకి పంపారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలో అంతగా యాక్టివ్ గా లేని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభకు కూడా కేంద్ర కమిటీలో సభ్యత్వం ఇవ్వడం ద్వారా వారిని తిరిగి యాక్టివ్ చేసే దిశగా చంద్రబాబు వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక వైసీపీ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఎమ్మెల్సీ గునుపాటి దీపక్ రెడ్డి, కొమ్మారెడ్డి పట్టాభిరాంలకు అధికార ప్రతినిధులుగా కీలక బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా ఈ దఫా కొత్త కమిటీల విషయంలో చంద్రబాబు సుధీర్ఘ కసరత్తు చేసి, పార్టీ పునర్వైభవం తీసుకొచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.