దుబ్బాక ఓటమి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే షాకిచ్చిందనే చర్చ రాష్ట్రంలో జరుగుతుంది. బీజేపీ గెలిచింది ఒక్క సీటే కానీ ఆ సీటుకు ఉన్న పవర్ అలాంటిది మరి. దుబ్బాక విజయంతో తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తే ఆ ఓటమి తాలుకు చేదు జ్ఞాపకాలు పోతాయా? ప్రజల్లో తమపై ఉన్న వ్యతిరేకత పోతుందా.. అని ఆలోచించినట్లుగా తెలుస్తోంది. వీటన్నింటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుకను ప్రకటించి అటు విపక్ష పార్టీలకు ఇటు ప్రజలకు ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వాలు ఏదోక రూపంలో తాయిలంను ప్రకటించి ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రకటనలు గుప్పిస్తుంటాయి. దీన్నికూడా ఇదే కోణంలో చూడాల్సి ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రానున్న ఎన్నికలే కేంద్రంగా…
శనివారం మధ్యాహ్నం ప్రజలకు దీపావళి కానుక పేరుతో మంత్రి కేటీఆర్ ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటన సారాంశాన్ని ఒక్కసారి గమనిస్తే రాబోయే జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రజల తలలపై మంత్రి కేటీఆర్ ఎన్నికల తాయిలాన్ని అంటించినట్లుగా చర్చ జరుగుతోంది. మంత్రి చేసిన ప్రకటనలో ప్రధానంగా మూడు అంశాల ఉన్నాయి. ఒకటి 2020-21లో ఆస్తిపన్నులో 50 శాతం రాయితీ, మరొకటి జీహెచ్ఎంసీ కార్మికులకు వేతనాల పెంపు, ఇంకోకటి వరద సాయం కొనసాగింపు గురించి మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్నులో 50 వాతం రాయితీనిస్తున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.15వేల వరకు ఆస్తి పన్ను కట్టిన వారికి అందులో 50 శాతం రాయితీ లభిస్తోందన్నారు. అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో రూ.10వేలలోపు ఆస్తి పన్ను కట్టిన వారికి అందులో 50 శాతం రాయితీ ఉంటుందన్నారు. దీనివల్ల జీహెచ్ఎంసీ పరిధిలో 13లక్షల 72 వేల కుటుంబాలకు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30లక్షల మంది లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. దీంతో రాష్ట్రంపై మొత్తంగా రూ.196.48 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.
అలాగే సాయం అందని నిజమైన వరద బాధితులు ఎవరైనా ఉంటే మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మరో అవకాశాన్ని కల్పిస్తూ ఈ రోజు నుంచే మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వీటి కోసం అదనంగా మరో 100 కోట్లను బాధితుల కోసం కేటాయిస్తామన్నారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు మరో 3వేల వేతనం పెంచారు. దీంతో వారి వేతనం రూ.14500 నుంచి 17500 వరకు పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. దీపావళి కానుకగా సీఎం కేసీఆర్ ఈ కానుకను రాష్ట్ర ప్రజలకు అందించారని మంత్రి చెప్పుకొచ్చారు.
దుబ్బాక ఎఫెక్టేనా?..
గత దుబ్బాక ఎన్నికల్లో ఎక్కడో మూడవ స్థానానికి పరిమితమయ్యే బీజేపీ.. నిన్నటి ఉప ఎన్నికల్లో అధికారపార్టీని వెనక్కి నెట్టేసీ విజయం సాధించింది. ఈ విజయంతో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో క్రెడిట్ సాధించింది. అలాగే ఆ విజయం బీజేపీ నేతలకు మంచి బూస్టుగా పనిచేస్తుంది. లక్ష ఓట్ల మెజారిటీ అన్నటీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక్క ఓటుతో గెలిచినా చాలూ అన్నంతగా సరిపెట్టుకున్నా కానీ దుబ్బాక విజయం దరిచేరలేదు. ప్రభుత్వం ప్రకటించిన దీపావళి కానుక కోణం నుంచి చూస్తే దుబ్బాక దెబ్బ అధికారపార్టీకి గట్టిగానే తగిలిందని చెప్పుకోవాలి. జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్‌లో జరిగేఛాన్స్ ఉంది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం వచ్చే ఏడాదిలో జరగనున్నాయి. విపక్షాలను.. మరీముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలంటే ప్రజలను తమవైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. ఈక్రమంలోనే ఎన్నికల ముందు ఈ విధంగా కానుకలను గుప్పించినట్లుగా చర్చ జరుగుతోంది. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 100 నుంచి 130 సీట్లపై గురిపెట్టింది. ఈనేపథ్యంలోనే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఓటును తమకు అనుకూలంగా మార్చుకునేందుకే ఇలా దీపావళి కానుక పేరుతో ఎన్నికల తాయిలంను ప్రకటించారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఇవి ఎంత వరకు పనిచేస్తాయో చూడాలి మరి.