తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను పోలీసులు అడుగడునా ఆంక్షలు విధించి అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రపై ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చెయ్యడం అవసరమా?
జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకoత భయం? ప్రశాంతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికం. అనైతికం. జగన్ రెడ్డి ఏళ్ల తరబడి కాలికి బలపం కట్టుకుని ఆ యాత్రా ఈ యాత్రా అంటూ జనంలో తిరిగి అధికారం లోకి వచ్చారు.ఈ విధంగా జగన్ పాదయాత్రని గత తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకొని ఉంటే ఆయన పాదయాత్ర చేసేవారా? ఒక పక్కన తమ పరిపాలన అద్భుతం అని, జనరంజకం అని,175 కి -175 సీట్లు గెలుస్తామని చెప్పుకొంటున్న మీకు లోకేష్ పాదయాత్ర చేస్తే జగన్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటి? పాదయాత్రలో మూడు సౌండ్ వెహికల్స్ ను సీజ్ చేసి పట్టుకెళ్లిపోవడం,వాటితో పాటు లోకేష్ ప్రసంగాలకు వినియోగిస్తున్నఎత్తు స్టూలును ను కూడా ఎత్తుకెళ్ళడం, విద్యుత్తు నిలిపివేయడం, మైకు గుంజుకోవడం వంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గం .లోకేష్ ప్రసంగించే వెహికిల్ గుంజుకు పోవడంతో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించెందుకు పక్కనే వున్న బిల్డింగ్ ఎక్కి బాల్కాని లో నిలబడి లోకేష్ మాట్లాడాల్సి రావడం దుర్మార్గం.
చిత్తూరు జిల్లా సంసిరెడ్డి పల్లెలో లోకేష్ నిలుచున్న స్టూల్ ను లాగేసి మైకు గుంజుకొన్నారు పోలీసులు. పాదయాత్ర అనుమతులు ఉల్లంఘించారని లోకేష్ పై చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు వివిధ సెక్షన్లు కింద ఐదు క్రిమినల్ కేసులు పెట్టారు.పోలీసులు అధికార పక్షానికి రక్షకులుగా,ప్రతిపక్షాల భక్షకులుగా బిరుదులు అందుకొంటున్నారు. ఉప్పు మూటను భద్రం చెయ్యమని చేతిలో పెడితే తీసుకెళ్లి నీళ్లలో ముంచిన చందంగా చట్టాన్ని రక్షించమని అధికారం ఇస్తే ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు పోలీసులు.పాలక పక్షం పై ఈగ వాలకుండా కాపలా కాయడానికే వాళ్ళు ఖాకీ బట్టలు వేసుకున్నట్లు కనిపిస్తుంది.ఎవ్వరు అధికారంలోవున్నా చట్టప్రకారం పనిచేయడంలో పోలీసుల పాత్ర మారదు. అధికార పార్టీకి బేషరతుగా,ప్రతిపక్షానికి షరతులతో కూడిన పర్మిషన్ ఇస్తున్నారు పోలీసులు.రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనుకొంటున్నారు అంటూ ప్రతిపక్షనేతగా మొసలి కన్నీరు కార్చి అధికారంలోకి వచ్చి తాను చేస్తున్నది ఏమిటో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.ప్రభుత్వం పై ప్రజాగ్రహం పెరిగిపోవడంతో అందులోనుంచి పెరిగిన పైత్య ప్రకోపంతో ప్రతిపక్షాల నోళ్లు నొక్కేసే కుత్సిత జీవో కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో వినాశకరమైన,విచారకరమైన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.
గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి పాదయాత్రకు, జగన్ పాదయాత్రకు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనుమతించారు. జగన్ రెడ్డి జైలు లో వున్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసినా ఎవ్వరూ ఆటంకం కలిగించలేదు. లోకేశ్ పాదయాత్ర చేస్తే జగన్ ఎందుకు అంతగా భయపడుతున్నారో అర్ధoకావడంలేదు. మీరు ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎం చేశారో చెప్పుకొండి, ప్రతిపక్షం తమకి అధికారం ఇస్తే ఎం చేస్తామో చెప్పి ఓట్లు అడుగుతుంది. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో వారు నిర్ణయించుకొంటారు.అంతే తప్ప ప్రతిపక్షం గొంతు నొక్కి అధికారంలోకి రావాలి అనుకోవడం చేతకాని తనం అవుతుంది.లోకేష్ క్రిమినల్ కాదు.రెచ్చగొట్టే ప్రసంగాలు ఆయనకి చేతకాదు. లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేస్తుండటంతో తమ ఫీఠానికి బీటలు బారుతాయన్న ఆందోళనతో పాదయాత్రను అడ్డుకొంటున్నారు. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఫాసిస్టులు రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని బానిస వ్యవస్థగా మార్చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులన పాదయాత్రలను అడ్డుకొంటున్నారు.
గొంతు నొక్కే ప్రక్రియ ఇది
తమ అభిప్రాయాలతో విభేదించే వారి గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. హింసకు తావు లేకుండా వారి హక్కును వినియోగించుకునేలా తోడ్పాటు అందించడం పోలీసులు భాధ్యత అధికార పార్టీ నాయకులు చెప్పారని పోలీసులు నిరంకుశంగా వ్యవహరించి వారి హక్కులు కాలరాయడం సమంజసం కాదు. వందల మంది పోలీసులను ప్రయోగించి ప్రశాతంగా సాగుతున్న యువగళం పాదయాత్రను నిర్భoదాలతో రణరంగంగా మార్చడం ఏమిటి?లోకేష్ పాదయాత్ర రోజు,రోజుకు జనయాత్రగా మారడంతో ప్రభుత్వం తట్టుకోలేక పోలీసులను ప్రయోగించి పాదయాత్ర పై రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టింది.లోకేష్ ను చూసేందుకు,తమ గుండె ఘోషను ఆయనకు వినిపించేందుకు రైతులు,యువత, మహిళలు,ప్రజా సంఘాలు,అన్నీ వర్గాల ప్రజలు,న్యాయ వాదులు దారి పొడవునా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూలవర్షంతో,మంగళ హారతులతో లోకేష్ కు నీరాజనాలు పట్టడం ప్రభుత్వానికి కంటగింపుగా మారింది.లోకేష్ చేపట్టిన పాదయాత్ర కు వస్తున్న అపూర్వ స్పందన ను చూసి ఓర్వలేక అడుగడుగునా ఆంక్షలు విధిస్తు అడ్డుకొనే ప్రయత్నం చేస్తూ వారి దుష్ట బుద్దిని బయట పెట్టుకొంటున్నారు ప్రభుత్వం పెద్దలు.
అధికారపార్టీ వైసీపీ ని ఒక్కసారిగా అనేక సమస్యలు చుట్టుముట్టడంతో ఉక్కపోత మొదలైంది. పార్టీలో అసంతృప్తి జ్వాలలు రోజు,రోజుకూ రగిలి పోవడంతో పార్టీ పునాదులు కదులు తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నది. మరో పక్క ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష పార్టీలు, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల ఉద్యమాలు ఉక్కిరి,బిక్కిరి చేస్తున్నాయి.నిత్యం హైకోర్టు ఏదో ఒక అంశంపై ప్రభుత్వ తీరును దుయ్యపడుతూ అక్షింతలు వేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బహిరంగంగానే ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు ఉధ్యోగులు. ఎన్నడూ లేనివిధంగా ఏకంగా గవర్నర్ను కల్సి తమకు జీతాలు సక్రమంగా ఇచ్చేలా చూడాలని వినతిపత్రం ఇవ్వడం ప్రభుత్వంపై ఉద్యోగులకున్న వ్యతిరేకత తీవ్రరూపం దాల్చింది. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తూ ప్రభుత్వ అసమర్ధ పరిపాలన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ప్రజలను చైతన్యవంతులను చేయ్యడంతో ప్రభుత్వానికి చుక్కలు కనపడుతున్నాయి. వైసీపీ అధిష్ఠానం వీటన్నింటినీ సమాదానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.
కొంత కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఆనం రామనారాయణ రెడ్డి బాట పట్టారు.కోటం రెడ్డి నేరుగా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీలో దాదాపు అన్ని జిల్లాలలోనూ అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. నెల్లూరు జిల్లా తరహాలో మిగిలిన చోట్ల కూడా ఏ రోజైనా అసంతృప్తి భగ్గుమనే అవకాశం ఉందని వైసీపీ నేతల్లోనే చర్చ సాగుతోంది.ఈ వరుస పరిణామాలు అధికార పార్టీ వైసిపికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ వేగవంతం కావడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు లోకేష్ పాదయాత్రను అడ్డుకొంటున్నారు.లోకేష్ పాదయాత్రకు వస్తున్న జనాధారణ చూసిన కొందరు మంత్రులు,ఎమ్మేల్యేలు లోకేష్ పై ఇష్టాను సారం నోరుపారేసుకొంటున్నారు.
అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాదయాత్రలు చేసినట్లు గానే నారా లోకేష్ కూడా పాద యాత్ర చేస్తున్నారు.కానీ ఒక్క లోకేష్ పాదయాత్ర పైనే ఇన్ని ఆంక్షలు విధించి, ఇంత అక్కసు వెళ్ళకక్కుతున్నారు అంటే ప్రభుత్వం ఏంత భయపడుతున్నదోఅర్ధం అవుతున్నది. లోకేష్ తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ఏ తప్పు చేయనని,భాధ్యత గల ప్రతిపక్ష పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా శాంతి యుతంగా ప్రజల పక్షానా పోరాడుతున్నానని, పాదయాత్ర చిత్తూరు జిల్లా పూర్తికాక ముందే తనపై అయిదు అక్రమ కేసులు పెట్టారని,నేను కేసులకు భయపడనని, కేసులు పెడితే తాను కూడా జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమని,పాదయాత్ర ఆగదని స్పష్టం చేస్తూ ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
పాదయాత్రలో అన్ని వర్గాలతో మమేకం అవుతూ వారిని చైతన్యం చేస్తున్నారు లోకేష్. ప్రభుత్వ అసమర్ధ,అవినీతి పాలనను ప్రజలకు వివరిస్తూ అన్ని వర్గాల పక్షాన నిలుస్తున్నారు . ఆబాల గోపాలాన్ని అక్కున చేర్చుకొంటూ లోకేష్ చేస్తున్న పాదయాత్ర కొత్త కోణం ఆవిష్కరింప చేస్తుంది.అందుకే ఎదో విధంగా పాదయాత్రను అడ్డుకోవాలన్న దుర్భుద్దితోనే పొంతన లేని అసంబద్ధమైన,అడ్డమైన షరతులు విధించి పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడానికి పోలీసుల ద్వారా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. లోకేష్ పాదయాత్ర తమ ప్రభుత్వానికి అంతిమ యాత్ర అవుతుందని ఆందోళన చెందుచున్నది జగన్ గ్యాoగ్.