బోగస్ ఓటర్ కార్డుల బెడద..దొంగ ఓట్ల రాజ్యంగా రాష్ట్రం..
భద్రం గురూ మీ ఓటు..బీకేర్ ఫుల్
ఆంధ్రప్రదేశ్ లో ఓటు ప్రమాదంలో పడింది.. మన ఓటు భద్రమేనా..? అందరిలో ఒక అనుమానం, ఎవరికివారిలో ఏదో సందేహం..ఎన్నికలు మరో 9నెలల్లో రానున్న నేపథ్యంలో ఓటుశంక రాష్ట్ర ప్రజల్లో ఎందుకు నెలకొందంటే..గత 4ఏళ్లలో పెరిగిన అరాచకాలు, ప్రతిచోటా ప్రతి వర్గంపై దాడులు-దౌర్జన్యాలు, హింసా విధ్వంసాల నేపథ్యమే కాదు, ఆ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న భీభత్స కాండ, భయోత్పాతాల వల్లనే.. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ఎంతకైనా బరితెగిస్తుందనేది ఇప్పటికే రుజువైంది..స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో, శాసనమండలికి ఉపాధ్యాయుల కోటా, పట్టభద్రుల కోటా ఎన్నికల్లో పెద్దఎత్తున బోగస్ ఓటర్ కార్డులతో పొరుగు రాష్ట్రాలవాళ్లను ప్రత్యేక వాహనాల్లో ఇక్కడికి తెప్పించి భారీఎత్తున దొంగఓట్లు పోలింగ్ చేశారనేది మీడియాలో చూశాం.. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు సాధారణ ఎన్నికల్లో మన ఓటు భద్రమేనా, ఓటర్ల జాబితాలో నా పేరు ఉందా, తీసేశారా అనే అనుమానాలు, సందేహాలే సర్వత్రా ..
ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా బోగస్ ఓట్ల అంశం చర్చనీయాంశమైంది.. ప్రత్యర్ధి వర్గం ఓట్లను తొలగించడం, బోగస్ ఓట్లను పెద్దఎత్తున చేర్పించేపనిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం అటు పార్టీ శ్రేణులను, ఇటు గృహ సారధులను, వాలంటీర్ వ్యవస్థను మొహరించిందనే వార్తలపై విపక్షాల్లో ఆందోళన నెలకొంది.
మనది కాదన్న ఓటును పోల్ కానీకుండా చేయడం ఒక ఎత్తయితే, అసలా ఓటే జాబితాలో లేకుండా చేయడం మరో ఎత్తు..అధికార పార్టీ ఆదేశాలమేరకే ఈ అరాచకానికి తెరలేపారనే ప్రచారం ఉంది. ప్రతిపక్షాలకు పట్టున్న ప్రాంతాల్లోనే ఈ మార్పుచేర్పులు ఎక్కువగా ఉన్నాయి. గంపగుత్తగా దొంగ ఓట్లను పెద్దఎత్తున చేరుస్తున్నారు. ప్రతిపక్షాల సానుభూతి పరుల ఓట్లను లిస్టులోనుంచి తీసేస్తున్నారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా, తమ వివరణ తీసుకోకుండా లిస్టులోనుంచి ఓట్లు ఎలా తీసేస్తారని ఓటర్లు మండిపడుతున్నారు. బతికుండగానే చంపేయడం, భర్తకు ఓటుంచి భార్యకు తీసేయడం, పోలింగ్ బూత్ మార్చేయడం వంటి దుశ్చర్యలు ఒకటి రెండు కాదు, అనేకం..
గడపగడపకూ కార్యక్రమం, ఇంటింటికీ స్టిక్కర్లు అంటించడం ఇత్యాది కార్యక్రమాల్లోనే ఎవరెవరు ఏ పార్టీవాళ్లనేది గమనించి, తమకు ఓటేయరని రూఢీగా నిర్ధారణ కాగానే ఆయా ఓట్లను జాబితాలోనుండి తొలగిస్తున్నారనే ప్రచారం ఉంది.. ఇష్టారాజ్యంగా ఓట్లు తొలగిస్తుంటే అధికార యంత్రాంగం కిమ్మనకుండా చోద్యం చూస్తోందనే అపప్రధ సర్వత్రా ఉంది..ప్రతి ఓటుకూ రక్షణగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమైందనే విమర్శలు ఉన్నాయి..
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఓటర్ల మార్పుచేర్పులు విచ్చలవిడిగా జరిగాయి.. ఒకే డోరు నంబరుతో వందలమందికి ఓట్లు చేర్పించారు. ఇంటి నంబరు లేకుండానే ఈ చేర్పులు ఉన్నాయి. వీటిలో ఎక్కువమంది అపరిచితులేనని స్థానికులే చెబుతున్నారు. లిస్టులో ఉన్న ఓట్లను ఇష్టారాజ్యంగా తొలగించారు..
వైసిపిని ఓడించే ఓట్లను ఏకంగా లిస్టులోనుంచే పీకేస్తున్నారు..విశాఖ తూర్పులో ఏడాదిన్నరలో 40వేల ఓట్ల తొలగించడం, కొత్తగా 15,792మంది చేర్చడం విశేషం..
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శ్యామలానగర్ లో ఒకే ఇంటి నంబరుపై 125ఓట్లు, మరో ఇంట్లో 59 ఓట్లు, ఇంకో నంబరుపై 72ఓట్లు ఉండటం గమనార్హం.. నర్సీపట్నం నియోజకవర్గంలో 17వేలకు పైనే బోగస్ ఓట్లు ఉన్నాయనే సమాచారం ఉండగా, ఇప్పటివరకు అధికారులు 2443ఓట్లే తొలగించడం గమనార్హం..
నోటీసు ఇవ్వకుండానే లక్షల్లో ఓట్ల తీసివేతపై, జాబితా నుంచి పెద్దఎత్తున ఓట్లు మాయం కావడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది..జాబితాల ప్రక్షాళన పేరుతో అడ్డగోలుగా ఓట్లను తొలగించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. పోయిన ఓట్లన్నీ తమవేనని ప్రతిపక్షాలు గగ్గోలు పెడ్తున్నాయి. వైసిపి గృహసారధులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని అడ్డం పెట్టుకుని ఈ అరాచకానికి తెరదీయడంపై మండిపడ్తున్నారు.. దీన్ని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూడటాన్ని నిరసిస్తున్నారు..
‘‘ఓటర్ల జాబితాలో కొన్ని తప్పులు జరిగాయి..నిజమైన ఓటర్లనూ కొన్నిచోట్ల తీసేశారని’’ సాక్షాత్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారే ఒప్పుకోవడం డెమోక్రసీకే డేంజర్ బెల్స్ గా చూడాలి.. ‘‘అయితే అవి పెద్దసంఖ్యలో లేవని, ఒకే ఇంటి నంబర్ పై 500కు పైగా ఓట్లు 6చోట్ల మాత్రమే ఉన్నాయని, 50ఓట్లకు పైగా 2100 డోర్ నెంబర్లలో ఉన్నాయని, ముసాయిదా జాబితా నాటికి ఈ తప్పులు లేకుండా చూస్తామని ఆయన పేర్కొనడం కొసమెరుపు.. మరోసారి తప్పులు జరిగితే ఈఆర్వోలపై చర్యలు తీసుకుంటామని అన్నారు..ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగించినా, దొంగ ఓట్లు చేర్చినా చర్యలు తీసుకుంటామని, ఇందులో వలంటీర్లు జోక్యం చేసుకుంటే చర్యలు తప్పవని కూడా హెచ్చరించడం విశేషం..
ఎవరిదైనా ఓటు తొలగించాలంటే వ్యక్తిగత నోటీసివ్వాలి. ఆ చిరునామాలో సదరు ఓటరు లేకపోతే ఆ ఇంటిగోడ మీద నోటీసు అంటించాలి, ఇద్దరు సాక్షులతో సంతకాలు తీసుకోవాలి. ఇష్టారాజ్యంగా ఓట్ల తొలగింపు కుదరదు. ఆ తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన జరపాలి. తొలగింపు సమాచారం ఆయా బూత్ ల పరిధిలోని రాజకీయ పార్టీల ఏజెంట్లకు ముందుగా ఇవ్వాలి..ఓట్ల తొలగింపు అభ్యర్ధనలను బూత్ ల వారీగా వాటి వివరాలను సీఈవో వెబ్ సైట్ లో ప్రదర్శించాలి, ప్రాంతీయ అధికారి కార్యాలయ నోటీసు బోర్డులో పెట్టాలి, పోలింగ్ బూత్ నోటీసు బోర్డులో పెట్టాలి. ప్రతి ఓటు తొలగింపుపైన తహశిల్దార్, డిప్యూటీ తహశిల్దార్ స్థాయి అధికారి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. ఒక వ్యక్తి 5గురు ఓటర్లకు మించి ఫిర్యాదులు ఇచ్చినా దానిపై కూడా ప్రత్యక్ష పరిశీలన జరపాలి. ఏ బూత్ పరిధిలోనైనా 2% కంటే ఎక్కువ ఓట్లు తొలగింపునకు గురైనా తహశిల్దార్ పైస్థాయి రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పరిశీలన జరపాలి. బూత్ స్థాయి ఎన్నికల అధికారి(బిఎల్ వో) నివేదిక లేకుండా ఒక్క ఓటుకూడా తొలగించడానికి వీల్లేదు. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షించాలి, రాజకీయ పార్టీలతో సమావేశాలు పెట్టి వివరాలు వారికిస్తుండాలి.
ఒక కుటుంబంలోని ఓట్లను వేర్వేరు బూత్ ల పరిధిలో చేర్చరాదు, ఒకే బూత్ పరిధిలో ఉంచాలి. ఒక భవనంలో ఉండే ఓటర్లందరినీ ఒకే బూత్ పరిధిలో ఉంచాలి. ప్రతి బూత్ లో 1500ఓట్లకు మించి ఉండకుండా చూడాలి. కొత్త బూత్ ఏర్పాటు కూడా ఓటరు నివాసానికి 2కిమీ లోపే ఉండేలా చూడాలి.
ఓటరుకు రెండుచోట్ల ఓటు ఉంటే దేనిని తొలగించాలో అతడినే అడగాలి, సంబంధిత బీఎల్ వో నోటీసు ఇవ్వాలి, చనిపోయినవారి ఓటు తీసేయాలంటే ఆ కుటుంబానికి నోటీసు ఇవ్వాలి, చిరునామామారినా, ఊరేమారినా సదరు నోటీసును పక్కింటివారికివ్వాలి. ఎవరికివారు తమ ఓటును వేరోచోటకి మార్చుకోవాలి అనుకుంటే ఫారం 7 కింద దరఖాస్తు చేసుకోవాలి. చనిపోయిన వారి ఓట్లు తీసేయాలన్నా సంబంధిత కుటుంబ సభ్యులు, దగ్గరివారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆ తర్వాతనే తొలగించాలి. డెత్ సర్టిఫికెట్ ఆధారంగానే సదరు ఓటును తొలగించాలి.
జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రచురణ జరగనుంది, వాటిని గుర్తింపు పొందిన పార్టీలకు అందజేయనున్నారు. ఎవరికివారు తమ ఓటు ఉందో లేదో ముందే చూసుకోవడం ఎందుకైనా మంచిది. ఎన్నికలయ్యేదాకా తమ ఓటు భద్రంగా ఉందో లేదో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఓటును కాపాడుకోవడం ఇప్పుడీ ప్రభుత్వంలో మరో అదనపు పౌరవిధి..
ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి ఆయుధం ఓటుహక్కు..రాజ్యాంగం కల్పించిన హక్కు..పోరాడి సాధించుకున్న హక్కు..స్వాతంత్ర్యం నా జన్మహక్కని బాల గంగాధర్ తిలక్ ఆనాటి నినాదమే నేటి ఓటు మన జన్మహక్కుగా మారింది.. ఎందరో వీరుల త్యాగఫలమైన మన ఓటుహక్కును భద్రంగా చూసుకోవడం, కాపాడుకోవడం ప్రతి పౌరుడి విధి మాత్రమే కాదు బాధ్యత కూడా.