ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరు నీరో చక్రవర్తిని ఉదహరిస్తోందా ? కేటీఆర్ వ్యాఖ్యల పట్ల ఏపీ ప్రభుత్వం తీరుపై వెల్లువెత్తుతున్న ? రాష్ట్ర పరువు దిగజారిపోతుంటే బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాధినేతకు చీమకుట్టినట్లు కూడా లేదా ? వైసీపీ ప్రభుత్వం వ్యవహారం పై ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ?
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం తీరు కూడా ఇలాగే ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగు రాష్ట్ర ప్రభుత్వం సొంత రాష్ట్ర పరువు తీసేలా వ్యాఖ్యలు చేస్తే బాధ్యతగా వహించాల్సిన ప్రభుత్వం కనీసం ఉలూకూ పలుకూ లేకుండా కూర్చుండనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రభుత్వాధినేతగా తాను పాలిస్తున్న రాష్ట్రంపై ఆరోపణలు వెల్లువెత్తుతుంటే స్పందించాల్సిన ముఖ్యమంత్రి అకేతనంగా ఉండిపోవడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ పరిస్థితులను ఉదహరిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ ఇమేజ్ ని డామేజ్ చేసేలా ఉన్నాయనేది వాస్తవం. అందులోనూ ఓ పారిశ్రామిక సమావేశ వేదికగా ఆయన చేసిన ఈ ఆరోపణలతో ఆంధ్ర ప్రదేశ్ కి ఎంతో నష్టం జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు.ఇటువంటి వ్యాఖ్యల వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోయే పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఏపీ ప్రభుత్వం ఎక్కడా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదట. కేటీఆర్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతిస్పందించకపోవడమే ఇందుకు నిదర్శనమని కొందరు చర్చించుకుంటున్నారు.
నిజానికి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఒక రాష్ట్ర ప్రభుత్వంగా తీవ్రంగా పరిగణించాలి, కానీ జగన్ సర్కార్ వ్యవహారం మాత్రం ఆ విధంగా లేదు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. కేవలం కొందరు మంత్రులు మీడియా ఎదుటకి వచ్చి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు తప్పితే ఎక్కడా ఘాటుగా కౌంటర్ కూడా ఇవ్వలేదు.
వాస్తవానికి ఈ అంశంలో మంత్రుల స్పందన కంటే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి చెందిన మంత్రి ఆయన రాష్ట్రంలో నిర్వహించిన ఒక వ్యాపార వేత్తల సమావేశంలో పక్క రాష్ట్రం ఇమేజ్ డామేజ్ అయ్యే విధంగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేదు అంటూ మాట్లాడారు అంటే అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో రాష్ట్ర ప్రభుత్వంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపధ్యంలోనే ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించి వెంటనే అవతలి వారి ఆరోపణలకు జవాబుగా తాము చేసింది ఏమిటి ? తమ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటి ? ఆ దిశగా వారు ఏం చేశారు అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేసి, మాటకు మాట అన్నట్లు స్పందించాలి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మౌనం పాటిస్తూ కూర్చుంది.
మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగం అయినప్పటికీ రాష్ట్రానికి డామేజ్ జరిగేటటువంటి సంఘనటనలు ఎదురైనప్పుడు స్పందించాల్సింది ప్రభుత్వం. ఆ బాధ్యత మంత్రుల కంటే ప్రభుత్వంపైనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణలోకి తీసుకుని వెంటనే స్పందించకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమే అనే సంకేతాలు బయటకు వెళతాయని.. అప్పుడు రాష్ట్రం పరువు మరింత దిగజారిపోతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.