వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ గడిచిన దశాబ్ధ కాలంగా నత్తనడకన సాగింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. నాంపల్లిలోని ప్రత్యేక CBI కోర్టు ఈ కేసుల్లో విచారణను చాలా వేగంగా జరపాలని నిర్ణయించుకుంది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు త్వరగా తేలేలా చూడాలని హైకోర్టును కోరడంతో జగన్కు ఉచ్చు బిగుసుకుంటోంది. పదేళ్లుగా పెండింగ్లో ఉన్న ED ఛార్జిషీట్లు, క్విడ్ ప్రో కో ఆరోపణలపై రోజువారీ విచారణకు రంగం సిద్ధమవడంతో మాజీ ముఖ్యమంత్రికి చుక్కలు కనిపిస్తున్నాయి.
అధికారంలో ఉన్న ఐదేళ్లూ కేసుల విచారణను ఏదోలా కాలయాపన చేస్తూ నెట్టుకొచ్చిన జగన్కు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అధికారం కోల్పోయిన తరుణంలో కోర్టులు కూడా దూకుడు పెంచడంతో ఆయన అక్రమాస్తుల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. మరోవైపు వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని ఈడీ అధికారులు ఏడు గంటలకు పైగా విచారించడం, తాజా పరిణామాలతో వైఎస్ కుటుంబానికి చట్టం చుట్టుకుంటోంది.
ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి కోలుకోకముందే, అక్రమాస్తులు, మనీలాండరింగ్ కేసుల భారం జగన్కు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇన్నాళ్లూ కేసులు ఎటూ తేలవనే ధీమాలో ఉన్న ఆయనకు, ఇప్పుడు కోర్టుల వేగవంతమైన విచారణ పెద్ద షాక్ అనే చెప్పాలి. చట్టం ముందు అందరూ సమానులే అన్నట్లుగా దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచడంతో, తప్పు చేయలేదంటూ కాలం వెళ్లదీసే రోజులు పోయి అసలు నిజాలు బయటపడే సమయం వచ్చేసింది.
మొత్తానికి, ఇటు ED వేట..అటు సీబీఐ కేసుల గోలతో జగన్ పొలిటికల్ ఫ్యూచర్ మరింత గందరగోళంలో పడింది. చేసిన తప్పులు ఊరికేపోవన్నట్లుగా, గతంలో కూడబెట్టన ఆస్తుల వివాదాలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్న తీరు చూస్తుంటే జగన్ ఖర్మ కాలింది అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మున్ముందు ఈ విచారణలు ఏ మలుపు తిరుగుతాయోనన్న భయం ఇప్పుడు వైసీపీ శ్రేణులను వెంటాడుతోంది.











