సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశానికి కొమ్ము కాస్తున్నారంటూ.. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. లేఖను మీడియా ముందు బహిర్గతం చేయడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ పై తగిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సీనియర్ న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ తరఫున అడ్వకేట్ ఆన్ రికార్డ్ ముక్తి సింగ్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. జగన్ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆయన కోరారు. ఇక ముందు ఇలా విలేకరుల సమావేశాలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ సుప్రీం కోర్టును కోరారు.
ఈ చర్య హేయం
‘దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రతిష్ఠను దిగజార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. దేశంలో ఒక అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి పై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం అనేది హేయమైన చర్య అని సింగ్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 121, 211 అధికరణల ప్రకారం కక్ష పూరితంగాా ఆరోపణలు చేయడం అనేది నిషిద్దం. అయినప్పటికీ జగన్ అలాంటి ప్రయత్నం చేశారు. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పార్లమెంటులో కానీ, అసెంబ్లీలో కానీ ఎటువంటి చర్చలు జరపరాదని రాజ్యాంగం పేర్కొంది’.
రాజ్యాంగంలోని 19(1)(ఏ) అధికరణ కింద భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం వంటి వాటిలో కోర్టుల ధిక్కారం, వాటి గౌరవానికి భంగం కలిగించేందుకు వీలు లేకుండా కొన్ని నిబంధనలున్నాయి. ప్రస్తుత కాలంలో ఎటువంటి విషయమైన సరే క్షణాల్లో ప్రజల వద్దకు చేరుకుంటుంది. ఈ సమయంలో జగన్ ఇటువంటి లేఖలను బహిర్గతం చేయడం వలన న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బ తినడమే కాక, ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం కూడా పోతుందని పిటిషనర్ పేర్కొన్నారు.
రాజ్యాంగం ప్రకాారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఓ వ్యక్తి తప్పకుండా న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ సీఎం స్థానంలో ఉండి ఒక అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది పలు అనుమానాలకు తావిస్తుందంటూ పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ‘స్వయంగా ముఖ్యమంత్రే ఇటువంటి అనుచిత ప్రకటనలు చేయడం- ప్రజానీకానికి న్యాయవ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పొయేలా చేస్తుందని’ సునీల్ కుమార్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.