ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందనే భయంతోనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా జనాలకు పప్పు బెల్లాలు పంచుతున్నాడని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఒకవేళ బెయిల్ రద్దయి జైలుకు వెళితే, తాను జైల్లో ఉండటం వల్లే పథకాలు అందడం లేదని చెప్పడానికే పప్పుబెల్లాల మాదిరి పంచుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అనర్హులకు సంక్షేమ పథకాలు ఇవ్వడం అంటే కేవలం ఓట్ల కోసమేనన్నారు. సంపద సృష్టించకుండా, రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం సమంజసం కాదని రాఘురామరాజు ఢిల్లీలో అభిప్రాయపడ్డారు.
ఉద్యోగుల జీతాలు ఇవ్వకపోవడం దారుణం
అస్థవ్యస్థ ఆర్థిక విధానాలతో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వలేకపోవడం బాధాకరమని రఘురామరాజు ఆందోళన వ్యక్తం చేశారు. 3.6 లక్షల మంది విశ్రాంత ఉద్యోగులు పింఛనుదారులు ఎదురుచూపులు తప్పడం లేదన్నారు. సంక్షేమం పేరుతో ఖజానా లూటీ చేసిన ఘనులు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేరా అని రఘురామరాజు ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీలో ఆర్థిక సంక్షోభం తప్పదన్నారు. వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం లేకనే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్కరు కూడా రావడం లేదన్నారు. కనీసం ఏపీలో లక్ష రూపాయలు కూడా పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని రఘురామరాజు ఎద్దేవా చేశారు.
Must Read ;- రాజన్న రాజ్యం కోసం షర్మిల ఏపీలో పోరాడాలి.. వైసీపీ ఎంపీ రఘురామరాజు