వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారందరికీ ఇది శుభవార్తే. ఇటు హైకోర్టులో అయినా, అటు సుప్రీం కోర్టుకు వెళ్లినా.. పదేపదే ఎదురుదెబ్బలు తగులుతున్న ప్రభుత్వానికి తాజాగా సుప్రీంలో ఒక కేసు విషయంలో ఊరట లభించింది. అమరావతి భూ కుంభకోణంలో కేసులో సుప్రీం కోర్టు బుధవారం నాడు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ భూ కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
అమరావతి భూముల అంశంలో ప్రభుత్వ మాజీ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఏసీబీ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ లోని సమాచారాన్ని మీడియాలో ప్రసారం చేయొద్దని కూడా హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది. గ్యాగ్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ ఏపీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మీడియాలో ప్రసారం చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలపై ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటిషన్ పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. జనవరి చివర వారంలో ఈ కేసును విచారిస్తామని పేర్కొన్న సుప్రీంకోర్టు.. అప్పటివరకు దమ్మాలపాటి పిటిషన్ ను హైకోర్టు విచారించవద్దని కూడా ఆదేశించింది. (ఇదీ చదవండి : ఈడీ కేసుల్లో కూడా..)
అమరావతి భూముల వ్యవహారంలో పాత ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జగన్ సర్కారు అనేక ఆరోపణలు చేసింది. ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించింది. అడ్వొకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించగా.. ఏసీబీ దర్యాప్తును నిలిపేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. మీడియాలో కథనాలు కూడా రారాదని నిషేధాజ్ఞలు వచ్చాయి. వీటిపై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా.. ప్రభుత్వానికి కొంత ఊరట లభించినట్టే.
Must Read ;- మంటగలుస్తున్న ’మహారాజా‘ ప్రతిష్ట