Jagan Government Has Announced That It Will Issue Government Orders In The E-Gazette :
సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చాక.. అటు కేంద్ర ప్రభుత్వం అయినా, ఇటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలైనా తాము తీసుకునే కీలక నిర్ణయాలతో పాటు సాధారణ నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిందే. రక్షణ, దేశ భద్రతకు సంబంధించిన కొన్ని విషయాలకు మాత్రమే ఇందులో మినహాయింపు ఉంది. అయితే సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరించిన జగన్ సర్కారు.. తాము విడుదల చేసే ఏ ఉత్వర్వ కూడా ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండదని సంచలన ప్రకటన చేసింది. ఈ తరహా నిర్ణయం నిరంకుశత్వానికి నిదర్శనమని, ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న పాలనలో ఇది కుదరదని.. రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి నిరసన వెల్లువెత్తింది. విపక్షాలు అయితే ఈ నిర్ణయాన్ని పట్టుకుని జగన్ సర్కారును ఏకేశాయి. దీని ఫలితమో, ఏమో గానీ.. జగన్ సర్కారు ఇప్పుడు దిగివచ్చింది. అయితే ఆ దిగివచ్చిన వైనంలోనూ జగన్ సర్కారు తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించుకుంది. జీవోలను ఈ-గెజిట్ లో పెడతామంటూనే.. కొన్ని జీవోలను మాత్రం ప్రజలకు అందుబాటులో లేకుండా రహస్యంగానే ఉంచుతామంటూ ప్రకటించింది.
సీఎస్ దాస్ ఏమంటారంటే..?
ఈ- గెజిట్ లో జీవోలను ఉంచుతామంటూ బుధవారం నాడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..‘‘ఇకపై అన్ని ఉత్తర్వులను ఈ–గెజిట్ ద్వారా జారీ చేస్తాం. ‘ఏపీ ఈ గెజిట్’లోనే ప్రజలకు అవి అందుబాటులో ఉంటాయి. జీవో ఐఆర్ వెబ్ సైట్ ను నిలిపివేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండేందుకుగానూ వివరాలను ఈ–గెజిట్ లో పొందుపరచనున్నాం. అయితే, కొన్ని ఉత్తర్వులు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండవు. ప్రజలకు అవసరం లేని వ్యక్తిగత సమాచారం, తక్కువ ఖర్చులు, అధికారుల సెలవులు, రహస్య సమాచారాన్ని మాత్రం అందుబాటులో ఉంచబోం. అధీకృత అధికారి డిజిటల్ సంతకంతో ఈ గెజిట్ లో ఉత్తర్వులు అందుబాటులో ఉంటాయి’’ అని దాస్ చెప్పుకొచ్చారు.
ఇందులో కొత్త ఏముంది?
గతంలో ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ప్రజలకు అందుబాటులో ఉంటున్న సమయంలో అధికారుల సెలవులు, వ్యక్తిగత సమాచారం, అతి తక్కువ ఖర్చుల జీవోలు ప్రజలకు అందుబాటులో ఉండేవి కాదు. జీవోఎంస్ నెంబరు మీద వచ్చే జీవోలన్నీ అందుబాటులోనే ఉండేవి. జీవోఆర్టీ నెంబర్ ఆధారంగా వచ్చే వాటిలో కొన్ని అందుబాటులో ఉంటే.. మరికొన్ని అందుబాటులో ఉండేవి కాదు. మరి ఇప్పుడు జగన్ సర్కారు ‘కొన్ని’ జీవోలు అందుబాటులో ఉండవంటూ చెప్పడంలో అర్థమేమిటనేది ప్రశ్నగా మారింది. ప్రజలకు ఇబ్బంది కలిగించే ధరల పెంపు, ఇతరత్రా చార్జీల పెంపు, విచారణల పేరిట జారీ అయ్యే జీవోలను ఏ ప్రభుత్వం కూడా ప్రజలకు అందుబాటులో ఉంచేది కాదు. మరి ఇప్పుడు జగన్ సర్కారు తన కఠిన నిర్ణయాన్ని సవరిస్తున్నట్లుగానే నటిస్తూ కొన్ని జీవోలు మాత్రం అందుబాటులో ఉంటవని చెప్పడం ద్వారా.. తమకు లబ్ధి కలిగించే నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల జీవోలను బయటపెట్టరని ఒప్పుకున్నట్టే కదా అన్న దిశగా ఆసక్తికర చర్చలకు తెర లేసింది.
Must Read ;- జగన్ ను నమ్మి అమూల్ నిండా మునిగిందే!