ఏపీ సిఎం జగన్ దావోస్ పర్యటన పై టిడిపి సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)లో పాల్గొనేందుకు వెళ్తున్నా అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ అనధికారికంగా లండన్ వెళ్లారని ఆయన ఆరోపించారు. సీబీఐ కోర్టులో దావోస్‌కు వెళ్తున్నానని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. లండన్ వరకు ఎందుకు వెళ్లారో చెప్పాలంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
దావోస్ పర్యటన పేరిట సీఎం జగన్ బయల్దేరిన స్పెషల్ ఫ్లైట్ ఎంబ్రేయర్ ఫాంటమ్ లెగసి 1000 ప్రపంచ టాప్ 50 కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ అని.. దీని ఖర్చు గంటకు 14,500 డాలర్లు అని, అంటే ఇండియన్ కరెన్సీలో గంటకు అక్షరాలా 12 లక్షల రూపాయాలని అయ్యన్న పేర్కొన్నారు.
కాగా, దావోస్ అని చెప్పిన జగన్ రెడ్డి లండన్‌లోని లుటన్ ఎయిర్ పోర్ట్‌లో దిగారని తెలుస్తుందని అయ్యన్నపాత్రుడు తెలిపారు. లండన్ ప్రయాణానికి సుమారు 13 నుంచి 14 గంటల సమయం పడుతుందని.. అంటే, విమానం ఖర్చే దాదాపుగా కోటిన్నర అవుతుందన్నారు. ఇక లండన్‌లోని లుటన్ ఎయిర్ పోర్ట్, కేవలం ప్రైవేట్ ఎయిర్ పోర్ట్ అని.. ధనవంతులు మాత్రమే దిగే చోటన్నారు. ఇక్కడ పార్కింగ్ ఫీజ్, ప్రపంచ కుబేరులు మాత్రమే భరించగలరని.. లావిష్ ఫ్లైట్‌లో, రాయల్‌గా, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి జగన్ రెడ్డి వెళ్తున్నాడాని ఆయన పేర్కొన్నారు. మన పొట్టలు కొడుతూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారని అయ్యన్న ఆరోపించారు.
ఇక, సీబీఐ కోర్టులో తాను దావోస్ వెళ్తున్నా అని చెప్పి, లండన్ వరకు ఎందుకు వెళ్ళారో మరి అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఆ చిదంబర రహస్యం ఏంటో? మీ ఎంపీ గారు చెప్పింది, నిజమేనా అయితే అని ప్రశ్నల వర్షం కురిపించారు.