వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం చీప్ లిక్కర్ ఏరులై పారడంలో ఆ పార్టీకి చెందిన పెద్ద తలకాయలదే కీలక పాత్ర అన్న సంగతి తెలిసిందే. నాసిరకం మద్యాన్ని సాధారణ లిక్కర్ కన్నా మూడు నాలుగు రెట్లు ధర పెంచేసి మరీ ఏపీలో అమ్మారు. దీంతో జగన్ రెడ్డి రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యం అమ్ముతున్నారని ముద్ర పడిపోయింది. అయితే, వైసీపీలో పెద్ద తలకాయలే ఈ డిస్టిలరీస్ ఎక్కువగా నిర్వహించినప్పటికీ.. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుమారుడికి చెందిన ఎంపీ పీవీ మిథున్ రెడ్డికే మరింత లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది. దీంతోపాటుగా విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన బినామీ సంస్థ అయిన ఆదాన్ డిస్టిలరీస్ కు కూడా అధికంగానే ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా అస్మదీయ కమీషన్లు చెల్లించిన కంపెనీలకే 90 శాతం ఆర్డర్లు వచ్చినట్లుగా ఇప్పుడు బయట పడుతోంది.
నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ను తన గుప్పిట్లో పెట్టుకుని జే బ్రాండ్లు ఉత్పత్తి చేసినట్లు, ఇక్కడ తయారు చేసిన మద్యం బ్రాండ్లకే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు లభించినట్లు సీఐడీ దర్యాప్తులో తాజాగా తేల్చారు. వైసీపీ అధికారం చేపట్టాక ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. ఇది ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డి బినామీ సంస్థ అని గుర్తించారు. దీనికి సొంతంగా ఒక్క డిస్టిలరీ లేకపోయినా విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లను సబ్‌లీజు పేరిట బలవంతంగా ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్లను సరఫరా చేసినట్లు ఆధారాలను సేకరించారు.
సీఐడీ దర్యాప్తులో బయటికి వచ్చిన కీలకమైన అంశాల ఆధారంగా మిథున్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, డిస్టిలరీల ప్రతినిధులు, ఈ దందాను వెనకుండి నడిపించిన నాయకులు, కొందరు కీలక వ్యక్తుల్ని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయవాడ ప్రసాదంపాడులోని బెవరేజస్ కార్పొరేషన్, డిస్టిలరీస్, బ్రూవరీస్ విభాగాల్లో వరుసగా రెండో రోజు కూడా సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత ఐదేళ్లలో ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (ఏపీఎస్‌బీసీఎల్) జారీ చేసిన కొనుగోలు ఆర్డర్లు, వారికి ఖరారు చేసిన బేసిక్ ప్రైస్, వారికి చెల్లించిన బిల్లులు.. తదితర అంశాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. దోపిడీ ఎలా జరిగిందో మొత్తం బయటకు లాగారు.
ఏపీ బేవరేజెస్ లిమిటెడ్ వద్ద మొత్తం ఎన్ని మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి? ఐదేళ్లలో ఎంత విలువైన, ఎంత పరిమాణం మద్యాన్ని ఆయా కంపెనీల నుంచి ఏపీఎస్‌బీసీఎల్ కొనుగోలు చేసింది? అందుకు ఏ విధానాన్ని అనుసరించిందనే వివరాల్ని దస్త్రాల ఆధారంగా సీఐడీ విశ్లేషించింది. వందకు పైగా మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టరు అయి ఉండగా.. దాంట్లో 10 సంస్థలకే 90 శాతానికి పైగా కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఏపీఎస్‌బీసీఎల్ గత ఐదేళ్లలో లిక్కర్ సరఫరా కంపెనీలకు రూ.15 వేల కోట్ల వరకూ చెల్లించిందని అందులో చాలా భాగం నాటి ప్రభుత్వ పెద్దల అస్మదీయ కంపెనీలకే చేరినట్లు గుర్తించింది. త్వరలో మరిన్ని ఆధారాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని అంటున్నారు.










